close

బాబ్బాబు.. తప్పుకోవూ! 

పోటీదారులకు అభ్యర్థుల వేడుకోలు 
రేపే నామినేషన్ల ఉపసంహరణ 
పరిశీలనలో 4,711 తిరస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆదివారం (13వ తేదీ) ఆఖరి రోజు. దీంతో వీలైనంత వరకు పోటీ తగ్గించుకోవాలని అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. తమ విజయానికి గండికొట్టే వారిని బుజ్జగించేందుకు నానాయాతన పడుతున్నారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల నగదు రూపేణా నజరానాలు ఇచ్చి పోటీ నుంచి తప్పుకోవాలని పలువురు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రొటోకాల్‌ నేపథ్యంలో ప్రాధాన్యం ఉన్న పంచాయతీల్లో  కొందరు సర్పంచి అభ్యర్థులు పోటీని తగ్గించుకునేందుకు ఎమ్మెల్యేలతో సాటి అభ్యర్థులకు చెప్పిస్తున్నారు. అయితే తరువాత సారి జరగబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే రిజర్వేషన్‌ కొనసాగనుండడంతో పోటీలో నిలిచేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. తొలి విడతలో పంచాయతీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 4,479 పంచాయతీలకు ఎన్నికల ప్రకటన వెలువడగా 11 పంచాయతీల నామినేషన్లను పూర్తిగా తిరస్కరించారు. రెండు, మూడు నామినేషన్లు దాఖలు చేసిన వారివి, సరిగా పత్రాలు నింపని అభ్యర్థులవి కలిపి 4,711 నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి. 39,822 వార్డులకు గాను 206 వార్డుల్లో పూర్తిగా నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన వార్డుల్లో 4,189 నామినేషన్లను నిబంధనల ప్రకారం లేవని ఆమోదించలేదు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 4,135 పంచాయతీలకు 4,850 నామినేషన్లు, 36,602 వార్డులకు 9,198 నామినేషన్లు దాఖలయ్యాయి.

రూ.1.17 కోట్లు స్వాధీనం 
ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో రూ.1.17 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్‌, కరీంనగర్‌తో పాటు పలు జిల్లాల్లో మద్యం, ఇతరత్రా కలిపి రూ.4.40 లక్షల విలువైన సామగ్రిని పట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశారు.

నేడు జిల్లాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి శనివారం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం సిద్దిపేటలో, మధ్యాహ్నం సిరిసిల్ల, సాయంత్రం జగిత్యాలలో పర్యటిస్తారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.