close

ఏప్రిల్‌లో చంద్రయాన్‌-2 

మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది 
గడువులోగానే గగన్‌యాన్‌ 
మహిళా వ్యోమగామికీ అవకాశం 
ఇస్రో చైర్మన్‌ ప్రకటన

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధించిన గడువులోగా 2021 డిసెంబర్‌లోనే మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ను చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం చేపట్టే చంద్రయాన్‌-2ను ముందుగా ప్రకటించినట్లు జనవరి- ఫిబ్రవరిలో కాకుండా ఏప్రిల్‌ మూడో వారంలో ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని పరీక్షలు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం ఇక్కడ విలేఖరులతో పేర్కొన్నారు.

మహిళా వ్యోమగామికి అవకాశం! 
గగన్‌యాన్‌ ప్రాజెక్టు తుది ప్రయోగానికి ముందుగా 2020 డిసెంబరు, 2021 జులైలో మానవ రహిత ప్రయోగాలు చేపడతామని శివన్‌ తెలిపారు. 2021 డిసెంబరు చివరన లేదా 2022 జనవరి తొలివారంలో మానవసహిత యాత్రను చేపడతామన్నారు. ఈ యాత్రలో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణిస్తారని, వారిలో ఓ మహిళ కూడా ఉండొచ్చని తెలిపారు. వైమానిక దళం, ఇస్రో, సాధారణ పౌరుల్లో ఒకరు ఈ ప్రతిష్ఠాత్మక యాత్రలో పాల్గొనబోతున్నారు. అది ఎవరన్నది ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామన్నారు. గగన్‌యాన్‌.. ఇస్రోకు ఒక కీలక మలుపని చెప్పారు. ‘‘గగన్‌యాన్‌లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఇంజినీరింగ్‌, రెండోది జీవ శాస్త్రం. ఇంజినీరింగ్‌ అంశంలో వాహకనౌక, వ్యోమగాములను మోసుకెళ్లే క్రూ మాడ్యూల్‌, సర్వీసు మాడ్యూల్‌ ఉంటాయి. ఇందులో ఇస్రోకు నైపుణ్యం ఉంది. అయితే వ్యోమగాముల ఎంపిక, శిక్షణ, వారికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం వంటివి జీవశాస్త్ర విభాగంలో ఉంటాయి. ఇవి ఇస్రోకు కొత్త. గగన్‌యాన్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మేం కొత్తగా ఇస్రోలో ‘హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి డైరెక్టర్‌గా ఉన్నికృష్ణన్‌ను ఎంపిక చేశాం. గగన్‌యాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆర్‌.హట్టన్‌ వ్యవహరిస్తారు’’ అని తెలిపారు. వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణను భారత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌’లోను తదుపరి శిక్షణ రష్యాలో ఉండొచ్చన్నారు.

చంద్రయాన్‌-2 ఆలస్యం 
జనవరి-ఫిబ్రవరిలో ప్రయోగించాల్సి ఉన్న చంద్రయాన్‌-2ను ఏప్రిల్‌లో ప్రయోగిస్తామని డాక్టర్‌ కె.శివన్‌ తెలిపారు. పదేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్‌-1 కంటే ఎంతో మెరుగైన సాంకేతికతతో చంద్రయాన్‌-2 రూపుదిద్దుకుంటోంది. రూ.800 కోట్ల వ్యయంతో తయారవుతున్న చంద్రయాన్‌-2లోని రోవర్‌ చంద్రునిపై వాతారవణ పరీక్షలను సమర్థవంతంగా చేపడుతుంది. ల్యాండర్‌, రోవర్‌లు 14 రోజుల పాటు పని చేస్తాయని శివన్‌ వివరించారు. చంద్రునిపై 500 మీటర్ల పాటు చలించే రోవర్‌లను కొత్త ప్రాజెక్టులో రూపొందించామన్నారు.

ఆరు చోట్ల పరిశోధన కేంద్రాలు 
దేశవ్యాప్తంగా ఆరు చోట్ల అంతరిక్ష సాంకేతిక ప్రోత్సాహక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు శివన్‌ తెలిపారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, ఈశాన్య, పశ్చిమ, మధ్య భారత్‌లో ఇవి సిద్ధమవుతాయని చెప్పారు. అంతరిక్ష పరిజ్ఞాన ఫలాలను అన్ని ప్రాంతాల ఔత్సాహికులకు అందేలా చూడటం ఈ కేంద్రాల ఏర్పాటు ఉద్దేశమన్నారు. ‘‘ఈ అంకుర సంస్థలకు ఇస్రోనే పలు ప్రాజెక్టుల ఆలోచనలను అందిస్తుంది. వీటిపై అవి రూపొందించిన డిజైన్లను అభివృద్ధి చేసేందుకు ఇస్రో సాంకేతిక సహకారాన్ని ఇస్తుంది’’ అని తెలిపారు. చిన్న ప్రయోగంగా పిలిచే ఎస్‌ఎస్‌ఎల్‌వీ, జీశాట్‌-20, ఆదిత్య ఎల్‌-1 వంటివి ఈ ఏడాదిలో ప్రయోగించే ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవని వివరించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.