close

ఇటు మోదీ.. అటు ఏరీ? 

నాయకత్వం, సిద్ధాంతాల్లేని ప్రతిపక్షాల కూటమి 
  భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా 
ఈనాడు - దిల్లీ

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. శుక్రవారం దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ఆ పార్టీ జాతీయ సమ్మేళనంలో ప్రారంభోపన్యాసం చేస్తూ వచ్చే ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గంటసేపు చేసిన ప్రసంగంలో హిందుత్వ ఓటర్లను బుజ్జగిస్తూ, తటస్థులను ఆకర్షించేందుకు ‘వికాస్‌’నూ ప్రస్తావించారు. రానున్న ఎన్నికలు రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరిగే పోటీ అని చెప్పారు. ‘‘ప్రపంచంలోనే ప్రజాదరణ పొందిన ప్రధాని నరేంద్ర మోదీ, నాయకత్వం లేని కూటమి మధ్య పోటీ జరుగుతుంది. గతంలో కాంగ్రెస్‌...ఇతరుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు భాజపా...ఇతరుల మధ్య పోటీ జరుగుతుంది. మోదీని గద్దె దించడం సాధ్యం కాదని గుర్తించే అపవిత్రంగా భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేశారు. ఇది మోదీ శక్తిని, భాజపా బలాన్ని అంగీకరించడం కిందకే వస్తుంది. ప్రతిపక్షాల నిస్సహాయతను తెలియజేస్తోంది’’ అని అన్నారు. ‘‘ప్రజలు ‘మజ్బూత్‌ సర్కార్‌’ (బలమైన ప్రభుత్వం) కావాలని కోరుకుంటుంటే ప్రతిపక్షాలు ‘మజ్బూర్‌ సర్కార్‌’ (నిస్సహాయ ప్రభుత్వం) ఇవ్వాలని అనుకుంటున్నాయి. నరేంద్ర మోదీ తప్ప ఇంకెవ్వరూ దృఢమైన ప్రభుత్వాన్ని ఇవ్వలేరు. దేశం సుస్థిర అభివృద్ధి సాధించేందుకు, పార్టీ బలపడేందుకు ఇవే కీలక ఎన్నికలు’’ అని చెప్పారు. ఆ కూటమికి నాయకుడు లేరు, సిద్ధాంతాలు అసలే లేవని అన్నారు. కేవలం పదవీ కాంక్షే ఆ పార్టీలను ఏకం చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌లు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని అన్నారు.

పానిపట్టు యుద్ధంలాంటి ఎన్నికలు 
వచ్చే ఎన్నికలు మూడో పానిపట్టు యుద్ధంలాంటివని అమిత్‌ షా సరిపోల్చారు. ‘‘శివాజీ ఆధ్వర్యంలో మరాఠాలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన 131 యుద్ధాల్లో విజయం సాధించారు. పానిపట్‌లో జరిగిన ఒకే ఒక్క యుద్ధంలో అఫ్గాన్‌ల చేతిలో ఓడిపోయారు. ఇది కేవలం ఓటమి కాదు. దేశాన్ని బానిసత్వంలో ముంచిన పరాజయం. ఆ తరువాత 200 ఏళ్ల పాటు దేశం బ్రిటిషు పాలనలో మగ్గింది. అందువల్ల ఈ ఎన్నికలు కీలక యుద్ధంలాంటివి. దీర్ఘకాలిక ప్రభావం చూపేవి. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ సారి కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. 1987 నుంచి మోదీ నాకు తెలుసు. అప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోలేదు’’ అంటూ శ్రేణులకు కర్తవ్యబోధ చేశారు.

రామ మందిరానికి కాంగ్రెస్సే అడ్డు 
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీయే అడ్డంకిగా మారిందని అమిత్‌ షా0 ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకుండా అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. ‘‘అదే స్థలంలో త్వరగా మందిరం నిర్మించాలని భాజపా కోరుకుంటోంది’’ అని స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియను కాంగ్రెస్‌ అడ్డుకుంటోందన్నారు.

కల నెరవేరింది 
ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు జనరల్‌ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలన్నది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండు అని, ఆ కలను మోదీ నెరవేర్చారని చెప్పారు. ఎన్నో పార్టీలు దీనిని ఎన్నికల ప్రణాళికల్లో పెట్టినా అమలు చేయలేకపోయాయని అన్నారు. చిన్నవ్యాపారులకు జీఎస్టీలో మినహాయింపులు ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు.

ఉగ్రవాదం తగ్గింది 
మోదీ పాలనలో ఉగ్రవాదం తగ్గిందని షా అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దేశ భద్రతపై రాజీ పడ్డాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ పాలనలో దేశానికి రక్షణ లేదు. కానీ సీమాంతర ఉగ్రవాదాన్ని మోదీ ప్రభుత్వం సహించడం లేదు. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇచ్చాం’’ అని చెప్పారు. అమిత్‌ షా తన ప్రసంగంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. 


మోదీ సమక్షంలో ముస్లిం మహిళ వందేమాతరం ఆలాపన

ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సభ్యురాలు హీనా ఫరూకీ వందేమాతరం గీతాన్ని ఆలపించారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.