close

ఆలోక్‌ వర్మ గుడ్‌బై 

వాదన వినకుండానే బదిలీ చేశారు 
  సహజ న్యాయ సూత్రాలను విస్మరించారు 
  దర్యాప్తు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా చర్యలా? 
  సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆక్రోశం 
  పదవీ విరమణ పొందినట్లు పరిగణించాలని కేంద్రానికి లేఖ

సహజ న్యాయ సూత్రాలను విస్మరించారు. సీబీఐ డైరెక్టర్‌ హోదా నుంచి నన్ను తప్పించడం కోసం ప్రక్రియ మొత్తాన్ని తలకిందులు చేశారు. సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న ఒక ఫిర్యాదుదారుడు (అస్థానా) చేసిన ఆరోపణల ఆధారంగా నాకు వ్యతిరేకంగా సీవీసీ నివేదిక తయారైంది. అత్యున్నత స్థాయి కమిటీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. సీవీసీ విచారణను పర్యవేక్షిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.పట్నాయక్‌ ఎదుట ఆ ఫిర్యాదుదారుడు హాజరు కాలేదు. పైగా సీవీసీ నివేదికలోని నిర్ధారణలు తనవి కావని జస్టిస్‌ పట్నాయక్‌ కూడా స్పష్టం చేశారు.

- కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖలో వర్మ

 

 

 

 

దిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ తాను ఇక ప్రభుత్వ సర్వీసులో కొనసాగబోనని తేల్చిచెప్పారు. తనను తప్పించిన తీరును ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియను విమర్శిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.  అత్యున్నత స్థాయి కమిటీ తీరును అందులో ఆక్షేపించారు. ప్రభుత్వం బదిలీ చేసిన విధంగా అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. తాను పదవీ విరమణ పొందినట్లుగా పరిగణించాలని కోరారు. దీన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన వర్మది అరుణాచల్‌ ప్రదేశ్‌-గోవా-మిజోరాం కేంద్ర పాలిత ప్రాంత (ఏజీఎంయూటీ) క్యాడర్‌. సీబీఐ డైరెక్టర్‌గా ఆయన పదవీకాలం ఈ నెల 31తో ముగియాల్సి ఉంది.

ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు అధికారులను గత అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రధాని, విపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ మాత్రమే ఆయన భవితవ్యాన్ని తేల్చాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్‌ పదవిని వర్మ మళ్లీ చేపట్టారు. అయితే ఆయనను తప్పించాలని అత్యున్నత స్థాయి కమిటీ గురువారం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేసింది. కొత్త బాధ్యతలు చేపట్టకుండానే వైదొలగాలని నిర్ణయించుకున్న వర్మ ఈమేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

ప్రభుత్వ తీరుకు ఇది తార్కాణం 
వ్యవస్థలే ప్రజాస్వామ్యానికి బలమైన చిహ్నాలని వర్మ పేర్కొన్నారు. భారత్‌లో నేడున్న అత్యంత ముఖ్యమైన సంస్థల్లో సీబీఐ కూడా ఒకటన్నారు. ‘‘గురువారం అత్యున్నత స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయం సీబీఐతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం. ఇది అందరూ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం’’ అని చెప్పారు. నాలుగు దశాబ్దాల సర్వీసులో తనది మచ్చలేని రికార్డన్నారు. తాను 2017 జులై 31నే పదవీ విరమణ పొందినట్లు వర్మ తెలిపారు. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల స్థిర పదవీకాలం ఉన్నందువల్లే తాను సర్వీసులో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల 31న ఆ పదవీకాలం ముగుస్తుందన్నారు. అయితే తాను సీబీఐ డైరెక్టర్‌ పదవిలో లేనని, అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల విభాగానికి డైరెక్టర్‌ పదవి చేపట్టడానికి ఇప్పటికే పదవీ విరమణ వయసును దాటిపోయినట్లు చెప్పారు. ‘అందువల్ల శుక్రవారం నుంచి నేను పదవీ విరమణ చెందినట్లు భావించండి’ అని కేంద్రాన్ని కోరారు. తనపట్ల శత్రుభావన  ప్రదర్శిస్తున్న ఒక వ్యక్తి చేసిన తప్పుడు, నిరాధార ఆరోపణల ఆధారంగా తనను బదిలీ చేశారని వర్మ అంతకుముందు ఒక వార్తా సంస్థతో అన్నారు. అత్యున్నత స్థాయి వ్యక్తుల అవినీతి కేసులను పర్యవేక్షించే సీబీఐ స్వతంత్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘వెలుపలి ప్రభావాలు లేకుండా అది పనిచేయాలి. సంస్థ నిబద్ధతను కాపాడేందుకు నేను కృషి చేయగా, దాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. నన్ను సెలవుపై పంపుతూ అక్టోబర్‌ 23న కేంద్రం, సీవీసీ జారీ చేసిన ఉత్తర్వులే దీనికి నిదర్శనం’’ అని ఆరోపించారు.

వర్మ చేసిన బదిలీలు రద్దు 
దిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా పునర్‌నియామకం పొందాక ఆలోక్‌ వర్మ చేపట్టిన బదిలీలను ఆ దర్యాప్తు సంస్థ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు రద్దు చేశారు. బదిలీలకు సంబంధించి ఈ నెల 8వ తేదీ నాటి స్థితిని పునరుద్ధరిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వర్మ.. అంతకు ముందు నాగేశ్వరరావు చేసిన అన్ని బదిలీలను రద్దు చేశారు. మరోవైపు సంస్థలో జాయింట్‌ డైరెక్టర్‌ హోదా కలిగిన నలుగురు అధికారులను కూడా ఆయన బదిలీ చేశారు. సీబీఐ అధికార ప్రతినిధిగా నితిన్‌ వాకాంకర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అభిషేక్‌ దయాళ్‌.. ప్రచురణ విభాగానికి బదిలీ అయ్యారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.