close

టెండర్డు ఓటుతో చెమటలు 

అది ఎక్కడ పడితే అక్కడ మళ్లీ పోలింగ్‌ 
పంచాయతీ ఎన్నికల్లో  కఠిన నిబంధన 
ఒకరి ఓటును వేరొకరు వేయకుండా చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులను ఇప్పుడు టెండర్డు ఓటు చెమటలు పట్టిస్తోంది. తన ఓటును వేరొకరు వేసేశారంటూ ఎవరైనా ముందుకొచ్చి టెండర్డు ఓటును కనుక వేసినట్లయితే.. అక్కడ తిరిగి పోలింగ్‌ను నిర్వహించే పరిస్థితి ఏర్పడబోతోంది. నకిలీ ఓటర్ల బెడదను తప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ).. ఇప్పుడు టెండర్డు ఓటుకు ప్రాధాన్యం ఇవ్వదలచింది. నిజమైన ఓటరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేసరికే అతని ఓటును వేరొకరు వేసే దృష్టాంతాలు కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకొంటూనే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో నిజమైన ఓటర్లు నిరాశతో వెనుతిరుగుతుంటారు. వారికి ‘టెండర్డు’ అనే పేరుతో గల ఓటును వేసే అవకాశం ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపు సమయంలో దానిని పరిగణనలోకి తీసుకోరు. కనుక వాటిపై ఓటర్లకు ఆసక్తి ఉండదు. టెండర్డు ఓటు గురించి విస్తృత ప్రచారం కల్పించాలంటూ ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారుల (కలెక్టర్లు)కు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ అవెక్కడా అమలుకు నోచుకోలేదు. కానీ ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడనుంది. 
0.1 శాతం టెండర్డు ఓట్లు పడ్డా లెక్కింపు నిలుపుదల 
ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో మొత్తం పోలైన ఓట్లలో టెండర్డు ఓట్లు 0.1 శాతం కంటే ఎక్కువగా కనుక ఉంటే అక్కడి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోనుంది. ఎస్‌ఈసీ తాజా మార్గదర్శకాల ప్రకారం.. పోలింగ్‌ అంతా అయ్యాక.. టెండర్డు ఓట్ల విషయాన్ని అక్కడి అధికారులు జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఎస్‌ఈసీకి తెలియజేస్తారు. ఎస్‌ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు అందేంత వరకు అక్కడి బ్యాలెట్‌ పెట్టెలను తెరవడం, ఓట్లను లెక్కించడం చేయకూడదు. జిల్లా ఎన్నికల అధికారి నివేదికను ఎస్‌ఈసీ పరిశీలించి.. అవసరమనుకుంటే మరింత సమాచారాన్ని రాబట్టి.. తిరిగి పోలింగ్‌ను నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వొచ్చు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.