close

అంచనాలకు మించి స్పందన 

ఓటు హక్కు నమోదు, సవరణలకు వెల్లువలా దరఖాస్తులు 
ఈ నెల 25 వరకు అవకాశం 
20న పోలింగ్‌ కేంద్రాల్లోనూ.. 
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని ఈసీ లేఖ 
ఈనాడు - హైదరాబాద్‌

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల జాబితా సవరణను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. ఓటు హక్కు నమోదుకు సంబంధించి రాష్ట్రంలో అధికారుల అంచనాలకు మించి స్పందన లభిస్తోంది. ఓటర్ల జాబితా సవరణకు, ఓటు హక్కు నమోదుకు ఈ నెల 25వ తేదీతో గడువు ముగియనుంది. ఓటర్ల నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల నమోదు గడువు పొడిగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ఓటు హక్కు నమోదుకు గడువు ముగిసినా ఏడాది పొడవునా ఎప్పుడైనా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 
12 లక్షలకుపైగా దరఖాస్తులు 
ఓటర్ల నమోదు కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. గడిచిన పది రోజుల నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో అత్యధికంగా కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించినవే ఉన్నాయి. శాసనసభ ఎన్నికల ముందు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా సుమారు 35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మళ్లీ కొద్ది రోజులకే చేపట్టిన సవరణకు ఇంత భారీగా స్పందన రావటం విశేషం. ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉన్నందున మరో పది లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ    ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే  దరఖాస్తులు భారీగా వస్తున్నట్లు తెలుస్తోంది. 
ఆన్‌లైన్‌లో అవస్థలు 
ఆన్‌లైన్‌ ద్వారా ఓటు హక్కు నమోదులో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటికి రెండు దఫాలు నమోదు చేయాల్సి వస్తోంది. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే దరఖాస్తు ఎన్నికల సంఘానికి అందినట్లు, దాని స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా 12 అంకెలతో నంబరు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి నంబరు రావటం లేదు. దరఖాస్తు ఎన్నికల సంఘానికి చేరిందా? లేదా? అని దరఖాస్తుదారులు అయోమయంలో పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ దరఖాస్తు చేస్తున్నారు. వెబ్‌సైట్‌ సకాలంలో స్పందించకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
గతంలో చేసినవి ఇంకా అపరిష్కృతంగానే.. 
శాసనసభ ఎన్నికల ముందు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నట్లుగానే చూపుతున్నాయి. ఓటరు నమోదు సందర్భంగా ఇచ్చిన నంబరుతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే ఆమోదం పొందినట్లు కనిపిస్తోన్నా ఓటర్ల జాబితాలో మాత్రం పేరు కనిపించటం లేదు. కొన్ని దరఖాస్తులు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నట్లు చూపిస్తోంది. జాబితాలో పేరు లేనందున మరోదఫా దరఖాస్తు చేయాలా? వేచి ఉండాలా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
పోలింగు కేంద్రాల వద్ద నమోదుకు అవకాశం.. 
ఓటర్ల నమోదులో భాగంగా వచ్చే ఆదివారం (20న) ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలతో పోలింగ్‌కేంద్రం స్థాయి అధికారులు (బీఎల్‌వో) అన్ని పోలింగు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. ఆ జాబితాలో పేరు ఉందా? లేదా? అన్నది ఓటర్లు తనిఖీ చేసుకోవచ్చు. ఓటు లేదని గుర్తించిన పక్షంలో అక్కడికక్కడే దరఖాస్తు చేసేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం ఈ నెల 23న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఓటర్ల జాబితా సవరణపై అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం,   రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ఇటీవల సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల కారణంగా ఓటర్ల జాబితాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని, సవరణకు గడువు పొడిగించాలని ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. దీంతో ఓటర్ల నమోదు గడువును పొడిగించాలని అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.