close

రాష్ట్రాల హక్కులను హరిస్తే ఊరుకోం 

రాష్ట్రంలో కేసుకు ఎన్‌ఐయేకి ఏం సంబంధం 
కోర్టుకూ వెళ్తాం 
జాతీయ అంశంగా చేస్తాం 
మోదీపై చంద్రబాబు ధ్వజం 
జగన్‌ కేసును ఎన్‌ఐయేకి అప్పగించడాన్ని నిరసిస్తూ లేఖ

ఈనాడు అమరావతి: జగన్‌ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐయేకి (జాతీయ దర్యాప్తు సంస్థ) అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా నిరసించారు. జగన్‌ను కాపాడటానికి మోదీ ప్రభుత్వం తప్పుడు విధానాలను అనుసరిస్తోందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రం హక్కుల జోలికొస్తే సహించబోమని, అధికారాలను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్లి పోరాడతామని గట్టిగా హెచ్చరించారు. కేంద్రంపై లేఖల యుద్ధానికి తెరతీశారు. అందులో భాగంగా శనివారం జగన్‌ కేసును ఎన్‌ఐయేకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఘాటుగా లేఖ రాశారు. త్వరలో జయప్రకాశ్‌ నారాయణ నివేదిలోని అంశాలను అమలు చేయాలని కోరుతూ మరో లేఖ రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 
కోర్టుకెళ్తాం.. 
కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సమాఖ్య, సార్వభౌమ స్ఫూర్తిని కాలరాసేలా ఉంది. దీనికి నిరసనగానే ప్రధానికి లేఖ రాశా. దీనిపై కోర్టుకూ వెళతాం. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎన్‌ఐయేని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటారా? జగన్‌పై కేసుని ఎన్‌ఐయేకి అప్పగిస్తారా? అసలు ఈ కేసుకీ, ఎన్‌ఐయేకీ ఏం సంబంధం? కేంద్రం వచ్చి రాష్ట్రాల్లో పంచాయితీలు పెడతామంటే ఊరుకోం. ఇది కేవలం ఏపీకి సంబంధించిన వ్యవహారం కాదు. 29 రాష్ట్రాలకు సంబంధించిన అంశం. దీన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెడతాం. కేంద్రం అధికారాలేంటో, రాష్ట్రం అధికారాలేంటో నిగ్గు తేలుస్తాం. 
జేపీ కమిటీ నివేదికపై కేంద్రానికి లేఖ.. 
మేం భాజపాతో విభేదించి బయటకు వచ్చింది ప్రత్యేక హోదా సహా విభజన హామీలు, ప్రత్యేక చట్టంలో పొందుపరిచిన అంశాల్ని సాధించుకోవడానికే. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఒక నిపుణుల కమిటీని వేసి రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.75వేల కోట్లు రావాలని తేల్చారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కూడా రూ.75వేల కోట్లు రావాలని తేల్చింది. అది మా పార్టీనో, ప్రభుత్వ అధినేతగా నేను చెప్పిన మాటో కాదు. తటస్థులుగా ఉన్న మేధావులు చెప్పిన మాట. వారిపై గౌరవం ఉంటే ప్రధాని ఆ నివేదికనైనా అమలు చేయాలి. దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నా. రాష్ట్రంపై ప్రధాని అంత కక్షతో వ్యవహరిస్తుంటే ఇక్కడి భాజపా నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదు. 
మోదీకి రాసిన లేఖలో ఏముందంటే... 
‘విశాఖపట్నం విమానాశ్రయంలో వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసును ఎన్‌ఐయేకి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకునేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా, అభ్యంతరాలనైనా అడగకుండా ఈ కేసును ఎన్‌ఐయేకి ఎలా అప్పగిస్తారు? ఈ కేసులో ‘ద సప్రెషన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ యాక్ట్స్‌ ఎగైనెస్ట్‌ సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌- 1982 సెక్షన్‌ 3ఏ (1) (ఏ) ఎంత మాత్రమూ వర్తించదు. జగన్‌పై జరిగిన దాడికి, విమానయాన భద్రతకు సంబంధం లేదు. ఇది వ్యక్తిపై జరిగిన దాడి. ప్రజ్ఞా సింగ్‌ చందర్‌పాల్‌ సింగ్‌ వర్సెస్‌ ఎన్‌ఐయే కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత చర్య ఉంది. 2014 మేలో చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి చెందగా 14మంది గాయాలపాలయ్యారు. ఈ కేసును ఎన్‌ఐయేకు అప్పగించాలన్న కేంద్ర ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే నాడు తమిళనాడు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆ కేసును ఇవ్వలేదు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా జగన్‌పై జరిగిన దాడిని జాతీయ స్థాయి కేసుగా చూపిస్తూ అప్పగించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు అందిన 24 గంటల వ్యవధిలోనే జగన్‌పై జరిగిన దాడి కేసులో ఎన్‌ఐయే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అదే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటన కేసు నమోదులో మాత్రం చాలా జాప్యం చేశారు. ఎన్‌ఐయే-2008 చట్టం ప్రకారం.. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నేరాలు, స్మగ్లింగ్‌, మాదక ద్రవ్యాలు, నకిలీ నోట్ల సరఫరా తదితర అంశాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు బాధ్యతలను మాత్రమే ఆ సంస్థ చేపట్టాలి. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు. 
ఐకానిక్‌ వంతెనకు శంకుస్థాపన 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు. తొలుత రూ.1387 కోట్లతో నిర్మిస్తున్న ఐకానిక్‌ వంతెనకు, రూ.745.65 కోట్లతో రాజధాని తాగునీటి అవసరాలకు నిర్మించే నీటిశుద్ధి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.