close

వానాకాలం నుంచి పంటల కాలనీలు 

ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ఏర్పాటు 
సీఎం కేసీఆర్‌ ఆదేశాలు 
వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సమీక్ష 
వరిసాగు పెరగకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచన 
ఈనాడు - హైదరాబాద్‌

 ప్రాంతాల్లో ఏయే పంటలు పండించడానికి అనువుగా ఉంటుందో గుర్తించి వాటి సాగుకోసం పంటల కాలనీల ఏర్పాటుకు వచ్చే జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ నుంచే శ్రీకారం చుట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖలకు ఆయన శనివారం సూచించారు. దీంతో ఈ రెండు శాఖల ముఖ్య కార్యదర్శి
పార్థసారథి వెంటనే సచివాలయానికి వచ్చిన ఉన్నతాధికారులతో పంటలకాలనీలు, ఆహారశుద్ధి అంశాలపై శనివారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు. వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, ఉద్యాన, మార్కెటింగ్‌, ఆహారశుద్ధి శాఖల సంచాలకులు వెంకట్రాంరెడ్డి, లక్ష్మీభాయి, భగవాన్‌ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ప్రజల ఆహార తలసరి వినియోగం ఆధారంగా ఏ పంటలకు కొరత ఉంటే వాటి ఉత్పత్తి తీరును పరిశీలించి సాగు పెంచేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పండిన పంటలకు శుద్ధి ద్వారా విలువ పెంచేందుకు స్వయం సహాయక సంఘాల వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసి తొలుత ఈ కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు. కొత్త సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే నీటి లభ్యత పెరుగుతుందని..దీనివల్ల వరి సాగు విస్తీర్ణం పెరగకుండా ఇతర పంటల సాగును ప్రోత్సహించాలని ఆయన సూచించారు.
 
ఉద్యాన పంటల లెక్కలు సేకరించాలి 
రాష్ట్రంలో సాగుచేసే పండ్ల తోటలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఉద్యాన పంటల లెక్కలను పక్కాగా సేకరించాలని పార్థసారథి ఆదేశించారు. జీడిమెట్లలోని ఉద్యానశాఖ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీఓఈ)లో జరిగిన ఉద్యాన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండ్లు, కూరగాయల తలసరి వినియోగం ఎంత అనే వివరాలతో పంటల దిగుబడి, సాగు లెక్కలను పోల్చాలన్నారు. వాటిని బట్టి రాష్ట్రంలో ఇంకా ఏ పంటలు ఎంత పండించాలో తెలుస్తుందన్నారు. సూక్ష్మసేద్య పథకం అమలుపైనా ఆయన సమీక్ష జరిపారు. ఈ పథకంలో ఏమైనా పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.