close

దెబ్బ తీసిన మబ్బుల ప్రయాణం 

కమ్మేసిన పొగ మంచు 
మార్గం కనిపించక 16 వాహనాలు ఢీ 
జాతీయరహదారి-44 పై ఘటన.. ఐదుగురికి గాయాలు 
ఈనాడు - హైదరాబాద్‌

రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోందని, ప్రయాణాలు చేయవద్దని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సూచించింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నా మంచు అధికంగా కురుస్తోంది. కర్ణాటక నుంచి విదర్భ, మధ్యప్రదేశ్‌ల మీదుగా రాజస్థాన్‌ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. ఉత్తర కోస్తాంధ్ర నుంచి విదర్భ వరకూ ‘తుపాను వ్యతిరేక గాలులు’న్నాయి. బంగాళాఖాతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలులు విదర్భ వద్ద నుంచి వంపు తిరుగుతున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాత్రిపూట భూమి వాతావరణం బాగా చల్లబడుతోంది. దీనివల్ల గాలిలో తేమ నీటి బిందువుల్లా మారి మంచులా కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తేమ 90 శాతాన్ని మించుతోంది. దీంతో పొగమంచు అధికంగా కురుస్తోంది. 
హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున విపరీతంగా పొగమంచు కమ్ముకోవడానికి తేమ శాతం భారీగా పెరగడమే కారణమని ఆయన వివరించారు. ఇదే తరహా వాతావరణం ఆది, సోమవారాల్లో కూడా కొనసాగుతుందని తెలిపారు. శనివారం ఉదయం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 14, మెదక్‌లో 15, నల్గొండలో 16, హైదరాబాద్‌లో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఢీకొన్న వాహనాలు 

నందిగామ, న్యూస్‌టుడే: దట్టంగా కురుస్తున్న పొగమంచుతో వాహనదారులు భీతిల్లుతున్నారు. జాతీయ రహదారులపై కనులు చించుకున్నా కానరాని పరిస్థితి నెలకొంటోంది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ఢీకొంటూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం జరిగిన ఇలాంటి ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధి జాతీయరహదారి-44పై ఉదయం వేళ 16 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న వాహనదారులకు పొగమంచు వల్ల తమ ముందు వెళ్తున్నవి కనిపించలేదు. కిలోమీటరులోపు 6 చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఒకదానినొకటి ఢీకొనడంతో 4 కార్లు, 4 బస్సులు, 4 లారీలు, 2 ఆటోలు, లారీక్రేన్‌, మినీవ్యాన్‌ దెబ్బతిన్నాయి. 12 వాహనాలకు భారీగా, నాలుగు వాహనాలకు పాక్షికంగా నష్టం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు,  బస్సులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. మరోవైపు శంషాబాద్‌ పరిధిలోని అమ్మపల్లి ఆలయ సమీపంలో బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

హిమగిరి కాదు.. యాదగిరి

సంక్రాంతికి ముందస్తు మంచు తెరలు కమ్ముకోవడంతో శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రం హిమగిరిలా మారింది. ఉదయం 7 గంటల నుంచి 9:30గంటల మధ్య పొగ మంచు దట్టంగా వ్యాపించడంతో ఆలయదారులు కనిపించక యాత్రికులు ఇబ్బందులకు గురయ్యారు. కనుమదారులు.. ఆలయ వీధులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురాలు ఇలా సాక్షాత్కరించాయి.

-న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.