close

ఒప్పుకో... తప్పుకో... 

పంచాయతీల్లో నేతల బుజ్జగింపులు 
వెనక్కు తగ్గాలంటూ  ఒత్తిళ్లు 
తొలి విడత ఉపసంహరణలు నేడే

ఈనాడు, హైదరాబాద్‌: పంచాయతీ బరిలో నిలిచేందుకు ఆశావహులు చేయని ప్రయత్నమంటూ లేదు. కొందరు రూ.లక్షలు ఎరవేసి ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే, నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను మరికొందరు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో ఒత్తిడి తెచ్చి ఇంకొందరు సఫలమయ్యారు. పోరులో నిలిచిన వారు వెనక్కు తగ్గాలంటే, ఆదివారం ఒక్కటే మిగిలి ఉంది. దీంతో ఎన్నోరకాల వ్యవహారాలు సాగుతున్నాయి. గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో పోటీచేసే అర్హుల జాబితాలు ఆదివారం సాయంత్రానికి ఖరారు కానున్నాయి. నామపత్రాలు ఉపసంహరించుకునే అవకాశం ఆ లోపే ఉంది. 
మెదక్‌ జిల్లాలో ఓ మండలంలోని పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కోసం, ఒక వ్యక్తి రెండెకరాల పొలాన్ని రాసిచ్చారు. తీరా నామినేషన్ల రోజు ఓ వ్యక్తి పోటీకి రావడంతో, కథ అడ్డం తిరిగింది. ఇప్పటికీ మంతనాలు కొనసాగుతున్నాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో చివరి రోజు ఓ వ్యక్తి నామినేషన్‌ పత్రాలు సమర్పించకుండా కొందరు దాడి చేశారు. సదరు బాధితుడు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే జిల్లాలో పలుచోట్ల నామినేషన్ల ఉపసంహరణకు అనేక ఒత్తిళ్లు వస్తున్నాయి. 
తొలి విడతలో 4,468 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి దాఖలైన 39,616 నామినేషన్లలో ...పలుచోట్ల పదుల సంఖ్యలో పోటీదారులు ఉన్నారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందినవారు ఎన్నోచోట్ల పోటీపడుతున్నారు. బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు రంగంలోకి దిగారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు జగ్గారెడ్డి సమావేశాలు ఏర్పాటుచేసి, పార్టీకి చెందినవారిని బుజ్జగించే ప్రయత్నాలు సాగించారు. మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో వివిధ చోట్ల తెరాస ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉన్నవారిని పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.