close

సైకిల్‌, ఏనుగు కలిసి సవారీ 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల పొత్తు 
చెరి 38 లోక్‌సభ స్థానాల్లో పోటీ 
కాంగ్రెస్‌కు చోటీయని ఇరు పార్టీలు 
నిర్ణయాన్ని వెల్లడించిన అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి

లఖ్‌నవూ, దిల్లీ: ఒకప్పటి బద్ధశత్రువులు చేతులు కలిపారు. సైకిల్‌, ఏనుగు కలిసి సవారీ చేయనున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లు ప్రకటించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, చెరి 38 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ కూటమిలో కాంగ్రెస్‌కు చోటీయకుండా దూరం పెట్టడం గమనార్హం. 
లఖ్‌నవూలోని ఓ విలాసవంతమైన  హోటల్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెండు పార్టీల అధ్యక్షులు అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి పొత్తు కుదిరిన విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోనప్పటికీ రాహుల్‌, సోనియాలు పోటీ చేసే అమేథీ, రాయ్‌బరేలీల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని తెలిపారు. మరో రెండు స్థానాలను చిన్న భాగస్వాములకు కేటాయిస్తామని చెప్పారు. ఆ పార్టీలు ఏవన్నది ప్రకటించకపోయినప్పటికీ అజిత్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ వంటి పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంది. 

కాషాయ పార్టీని కుమ్మేస్తాం 
తమ కూటమి భాజపాను ఓడిస్తుందన్న దృఢ విశ్వాసం ఉందని అఖిలేశ్‌, మాయావతి చెప్పారు. ఉపఎన్నికల్లో ఓడించామని, రానున్న ఎన్నికల్లోనూ కాషాయ పార్టీని కుమ్మేస్తామని తెలిపారు. ‘‘ఈ విలేకరుల సమావేశం తరువాత గురుశిష్యులు నరేంద్ర మోదీ, అమిత్‌ షాలకు నిద్ర పట్టదు’’ అని వ్యాఖ్యానించారు. బోఫోర్స్‌తో కాంగ్రెస్‌ పతనమయిందని, రఫేల్‌తో భాజపాకూ అదే గతి పడుతుందని అన్నారు. ఈవీఎంలను దుర్వినియోగం చేయకుండా ఉంటే.. రామమందిరం పేరుతో రెచ్చగొట్టకుండా ఉంటే తమదే విజయమని మాయావతి తెలిపారు. 

కాంగ్రెస్‌ ఓట్లు మాకు బదిలీ కావు: మాయావతి 
కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోకపోవడానికి గల కారణాలను మాయావతి వివరించారు. గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. తమ ఓట్లు ఆ పార్టీకి బదిలీ అవుతున్నా, వారి ఓట్లు తమకు రావని చెప్పారు. ఎస్పీ-బీఎస్పీల మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందని తెలిపారు. ‘‘మాది సహజసిద్ధమైన పొత్తు. ఎన్నికల తరువాత కూడా కొనసాగుతుంది’’ అని వివరించారు. తాము గతంలో కలిసి పోటీ చేసి విజయాలు సాధించామని అన్నారు. అఖిలేశ్‌ బాబాయి శివపాల్‌ యాదవ్‌ను భాజపా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆయన ఇటీవల ప్రారంభించిన ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా (పీఎస్‌పీఎల్‌)ను భాజపాయే నడిపిస్తోందని అన్నారు. ఆయనపై వెచ్చిస్తున్న డబ్బు మురికికాలువలో కలిసినట్టేనని వ్యాఖ్యానించారు. 1995లో తనపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేసిన అంశాన్ని దేశ ప్రయోజనాల దృష్ట్యా పక్కనపెట్టానని చెప్పారు. 
ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధానిని ఇస్తే సంతోషమే: అఖిలేశ్‌ 
ప్రధాని అభ్యర్థిగా మాయావతిని సమర్థిస్తారా అన్న ప్రశ్నకు అఖిలేశ్‌ సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘‘నేను ఎవరికి మద్దతిస్తానో మీకు తెలుసు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎంతో మంది ప్రధానులను ఇచ్చింది. మరోసారి ఇస్తే సంతోషమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మాయావతి గౌరవం నా గౌరవం. ఆమెను అవమానపరిస్తే నన్ను అవమానపరిచినటే్టే’’ అని అంటూ శ్రేణులకు సందేశం పంపారు. 
ఉనికి కోసమే పొత్తు: భాజపా 
ఉనికి కోసమే ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. దీనివల్ల ఉత్తర్‌ప్రదేశ్‌కుగానీ, దేశానికిగానీ ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. మోదీ వ్యతిరేకత అన్న ఒక్క అంశం ఆధారంగానే పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. 
నేడు కాంగ్రెస్‌ సమావేశం 
ఎస్పీ-బీఎస్పీల పొత్తు ప్రకటన వెలువడిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం లఖ్‌నవూలో సమావేశం కానున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌, పీసీసీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌, ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లకుండా ఆ పార్టీలు పెద్ద ప్రమాదకరమైన తప్పిదాన్ని చేశాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, నిరంకుశ భాజపాను ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకం కావాల్సి ఉందని అన్నారు. పొత్తుపై ఇదే చివరి మాట కాకపోవచ్చని, ఎన్నికలు సమీపించే కొద్దీ విస్తృత కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉందని సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. ఒంటరి పోరుకూ సిద్ధమేనని చెప్పారు. 
ఇతర పార్టీల స్పందనలు 
కూటమిలో తమకు చోటు దక్కుతుందని రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) ఆశాభావం వ్యక్తం చేసింది. కూటమి ఏర్పాటును పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా స్వాగతించారు. ఇది ప్రతిపక్షాల ఐక్యతకు ఆటంకం కాబోదని రాజా అన్నారు. ఈ పొత్తును శివసేన ఖండించింది. దీనివల్ల మహాకూటమి ఏర్పాటు ప్రశ్నార్థకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. శివపాల్‌ యాదవ్‌ను భాజపా నడిపిస్తోందంటూ మాయావతి చేసిన వ్యాఖ్యను పీఎస్‌పీఎల్‌ అధికార ప్రతినిధి సి.పి.రాయ్‌ ఖండించారు. భాజపాతో పొత్తు పెట్టుకున్నది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. అధికారంలో ఉండగా మాయావతి పెట్టించిన కేసులను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలెవరూ మరచిపోలేదని చెప్పారు. తమ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలుపుతుందని అన్నారు.

పొత్తు ప్రస్థానం ఇలా...

రామమందిరం ఉద్యమంతో విజయపథంలో ఉన్న భాజపాకు ఎస్పీ-బీఎస్పీల కూటమి అడ్డుకట్ట వేసింది. 1993లో ఆ రెండు పార్టీల వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌, కాన్షీరాంలు పొత్తుపెట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 67, ఎస్పీకి 109.. మొత్తం 167 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 
1995లో మీరాబాయి మార్గ్‌ అతిథి గృహంలో మాయావతి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తుండగా ఎస్పీ కార్యకర్తలు ఆమెపై దాడి చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఆమెను కాపాడలేకపోయారు. అక్కడికి వచ్చిన భాజపా ఎమ్మెల్యే బ్రహ్మదత్‌ ద్వివేదీ ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాంతో ఆమె భాజపాకు మద్దతు ఇచ్చారు. 1996లో ఆ రెండు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
మళ్లీ ఎస్పీతో పొత్తు కోసం కాన్షీరాం ప్రయత్నించినా మాయావతి అంగీకరించలేదు. 23 ఏళ్ల తరువాత పొత్తు కుదిరింది. 
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీకి అయిదు స్థానాలు రాగా, బీఎస్పీ ఖాతా తెరవలేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలకు చెరి 22 శాతం ఓట్లు వచ్చాయి. 
రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పుర్‌, ఫూల్‌పుర్‌ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అప్పటి నుంచి రెండు పార్టీల్లో పొత్తుపై ఆసక్తి నెలకొంది. 
యూపీలో 22 శాతం మంది దళితులు, 45 శాతం మంది ఓబీసీలు, 19 శాతం మంది ముస్లింలు ఉన్నారు. రెండు పార్టీలూ తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముస్లిం ఓట్లు చీలకుండా ఉంటాయని, ఇది ఫలితాలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.