close

ఆ భయం మోదీకే 

ఏ ఎండకా గొడుగు పట్టడం ఆయన నైజం 
వెన్నుపోటు గురించి ప్రధాని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే 
కోల్‌కతా సభ తర్వాత ఆయనకు కునుకులేదు 
ఓటమిని ఎదుర్కొనే గుండెదిటవు మోదీలో పెరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా 
ఘాటైన పదజాలంతో చంద్రబాబు బహిరంగ లేఖ 
దిల్లీలో ధర్మపోరాట దీక్ష నేడు

ఈనాడు- అమరావతి, విజయవాడ: నరేంద్ర మోదీ అసమర్థ ప్రధాని.. దేశానికి పెద్ద దిష్టిబొమ్మ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రూ.లక్ష కోట్ల అవినీతిపరుడని 2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ని మీరు తిట్టి, ఇప్పుడు మీ ఒడిలోనే కూర్చోబెట్టుకున్నారు. గతంలో మీరు నిందించిన కేసీఆర్‌నే ఇప్పుడు పరిణతి గల నాయకుడని పొడుగుతున్నారు. గతంలో నీతీశ్‌కుమార్‌ని ఎన్ని మాటలన్నారు? ఇప్పుడు ఆయన ఉన్నది మీ ఒడిలో కాదా?’ అని మండిపడ్డారు. ‘వెన్నుపోటు గురించి, ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడటం దివాలాకోరుతనం. మీరే పోటు పొడిచారో ఆడ్వాణీ కన్నీళ్లు, మురళీమనోహర్‌ జోషీ ముఖమే చెబుతాయి. వాజ్‌పేయీ ఆత్మ ఎంత ఘోషిస్తోందో లౌకిక, ప్రజాస్వామ్య వాదులందరికీ తెలిసిందే. కర్ణాటక, గోవా, మణిపూర్‌లో మీ ఆధ్వర్యంలో జరిగిన ఫిరాయింపులు, ప్రలోభాల పర్వాన్ని దేశం మొత్తం చూసింది. ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే’’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు సభలో మోదీ తనపై చేసిన విమర్శలకు ఘాటుగా బదులిస్తూ చంద్రబాబు ఆదివారం ఒక బహిరంగ లేఖ రాశారు. 
మీ పాలనా దుర్నీతికి నిరసనలే నిదర్శనం 
‘‘ప్రధానిగా ఉన్నవారు రాజధర్మం కలిగి ఉండాలి. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడగలగాలి. మీలా ఎక్కడ అడుగుపెడితే అక్కడ నిరసనలు ఎదుర్కొనే దుస్థితి అత్యున్నత పదవిలో ఉన్నవారికి కలగరాదు. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికైనా వస్తే... ఏదైనా వరం ప్రకటిస్తారని అక్కడి ప్రజలు ఆశిస్తారు. మీ సభకు హాజరైన పదుల సంఖ్యలోని ప్రజల్ని కూడా మీ పర్యటన తీవ్ర నిరాశపరిచింది. ఒక రాష్ట్రానికి ప్రధాని వస్తే అక్కడి ముఖ్యమంత్రిని సంప్రదించకుండా, ఆహ్వాన ప్రకటనల్లో పేరు వేయకుండా అవమానించే దుష్ట సంస్కృతి, కుసంస్కారం మీ గుంటూరు పర్యటన బయటపెట్టింది. మీ నమ్మిన బంటు జగన్‌ అండదండలతో గుంటూరులో మీరు జరిపిన సభ ఏ మేరకు ఫలప్రదమైందన్న వివరాల్లోకి నేను వెళ్లదలచుకోలేదు. మీ ప్రసంగం మొత్తంలో రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల గురించిగానీ, అప్పటి ప్రధాని మన్మోహన్‌ ఇచ్చిన హామీల గురించిగానీ ప్రస్తావించకపోవడమే మీ పలాయనవాదానికి నిదర్శనం. ప్యాకేజీ గురించి ప్రస్తావించిన మీరు, ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదో ఎందుకు చెప్పలేకపోయారు? 

దిల్లీని మించిన నగరంగా అమరావతి 
అమరావతిని రూ.1,500 కోట్లతో హెరిటేజ్‌ నగరంగా చేస్తారా? ఆ డబ్బుతో ఒక భవనంగానీ, భూగర్భ డ్రెయినేజిగానీ పూర్తికావు. మీ సహకారం లేకపోయినా ఈ రోజున అనేక విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు వచ్చాయంటే అది మా సామర్థ్యమే. రూ.40 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. మీ కళ్లముందే రాబోయే ఐదేళ్లలో మీరన్నట్టే దిల్లీని మించిన రాజధానిగా అమరావతిని నిర్మిస్తా. 
నా కుమారుడికి మీ సర్టిఫికెట్లు అవసరం లేదు 
మీ వ్యాఖ్యలతో ‘సన్‌రైజ్‌ స్టేట్‌’ని అవమానించడం ద్వారా రాష్ట్ర ప్రజల గుండెల్లో మరోసారి గాయం చేశారు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కియా మోటార్స్‌ని నేను సాధించడం మీకు కంటగింపైంది. నా కుమారుడి గురించి మీరేవో స్థాయి తక్కువ వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడికి స్టాన్‌ఫోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. మీ సర్టిఫికెట్‌ అవసరం లేదు. రూ.40 వేల కోట్ల విలువైన యుద్ధవిమానాల తయారీ కాంట్రాక్ట్‌ను ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం కంటే పెద్ద అవినీతి ఏముంటుంది? మోదీ సిగ్గు లేకుండా అసత్యాలు మాట్లాడారు. మీ వ్యాఖ్యలు వైకాపా పంపిన స్క్రిప్ట్‌ అని అందరికీ తెలుసు. మోదీని తిట్టడానికే తెదేపా మహాకూటమిలో చేరిందన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఓ సీనియర్‌ నాయకుడిగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చాను. నాది కాదు.. మోదీదే యూటర్న్‌. నేను మామకు వెన్నుపోటు పొడిచానంటూ.. ప్రధాని హోదా మరిచి మాట్లాడారు. ఆనాడు పార్టీని కాపాడుకునేందుకు నాతోపాటుఅందరూ ఎన్టీఆర్‌తో విభేదించాల్సి వచ్చింది. 
కేసీఆర్‌, జగన్‌ తప్ప అంతా ఎదురు తిరుగుతున్నారు 
మోదీ చేస్తున్న అన్యాయంపై జగన్‌, కేసీఆర్‌ తప్ప దేశంలోని మిగతా రాజకీయ పార్టీల నాయకులు ఎదురు తిరుగుతున్నారు. కాంగ్రెస్‌తో కలవడమే కాదు.. దేశాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. 11న దిల్లీకి వస్తున్నాం. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలకు దిక్కులేదా అని అడుగుతాం. నన్ను లోకేష్‌ తండ్రి అంటూ మోదీ సంబోధిస్తున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు కాబట్టి.. నేను కూడా యశోదాబెన్‌ భర్త నరేంద్ర మోదీ అంటాను. ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా వదిలేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

మీరు చెప్పకపోయినా సీనియర్‌నే

మోదీ గారూ, మీరు చెప్పినా, చెప్పకపోయినా నేను సీనియర్‌నే. మీ ఎగతాళి, ఎద్దేవా వ్యాఖ్యలే భాజపా పతనానికి బీజాలు వేశాయని తెలుసుకోండి. గుంటూరును ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్‌గా పేర్కొన్న మీరు, అందులో మీ ఘనత ఎంతో చెబితే బాగుండేది. మీవద్ద పాలన నేర్చుకునే దుస్థితిలో లేను. ఇప్పుడు ఆయన చెబుతున్న పథకాలన్నీ నేను 19 ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టాను. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని గాలికి వదిలేసి తెదేపా పునర్నిర్మాణం చేసుకుంటున్నానని ఎద్దేవా చేయడం మీ సంకుచిత ధోరణికి రుజువు. ఇప్పుడు మీరు చేయాల్సింది భాజపా పోస్ట్‌మార్టం గానీ, వేరే పార్టీలది కాదు.

పూర్తికాని ప్రాజెక్టుల ప్రారంభమా?

మన్మోహన్‌ హయాంలో ప్రారంభించిన చమురు నిల్వ కేంద్రాలు మీరే నెలకొల్పినట్టు చెప్పి, అవి 2016కే పూర్తి కావాల్సి ఉన్నా, నిధులివ్వకుండా 2018 వరకు జాప్యం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు.. ఇంకా పూర్తి కూడా కాని కేంద్రాలను ప్రారంభించినట్టు నమ్మించడం ద్రోహం కాదా? మీరు శంకుస్థాపన చేసిన చమురు నిల్వ కేంద్రం పూర్తయ్యేటప్పటికి మీ అడ్రస్‌ కేరాఫ్‌ గుజరాత్‌ అని తెలిసే చేసింది నిజం కాదా? నా రాష్ట్రం మీద, కుటుంబం మీద మీరు చేసిన వ్యాఖ్యల్ని దిష్టి చుక్కలుగానే భావిస్తాను. కాకపోతే మీరే మరీ ఈ దేశానికి దిష్టిబొమ్మగా మారారనేది నా బాధ.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.