close
బాబు ఇంటికే 

తండ్రీకుమారుల ప్రభుత్వం పోవడం ఖాయం 
అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకుంటున్నారు 
ఏపీ అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు 
కుమారుడి ఎదుగుదల కోసమే ఆయన పాకులాట 
అధికారం కోసం ఎవరితోనైనా జత కడతారు 
గుంటూరు ‘ప్రజా చైతన్య సభ’లో ఏపీ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రాభివృద్ధిని విస్మరించి తన కుమారుడు లోకేష్‌ రాజకీయ ఎదుగుదల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు తనకు తానే యూ టర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరులో ఆదివారం భాజపా ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రజా చైతన్య సభ’లో ప్రధాని మోదీ చంద్రబాబే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 
అబద్ధపు ప్రచారానికి స్వస్తి పలకదలుచుకున్నా 
ఏపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని, కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. ‘‘ఒక పెద్ద అబద్ధపు ప్రచారానికి గుంటూరు నుంచి స్వస్తి పలకదలుచుకున్నా. గడచిన 55 నెలల్లో ఏపీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎలాంటి లోటూ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఏపీని విభజించిన సమయంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అలాంటి పార్టీతో చంద్రబాబు జతకట్టారు. 
మా చిత్తశుద్ధికి నిదర్శనాలివి... 
విభజన చట్టంలో ఇచ్చిన ప్రతీ హామీపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందుకు నిదర్శనమే తిరుపతిలో ఐఐటీ, అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్‌ వంటి 11 ఉన్నత విద్యా సంస్థల్లో 10 ప్రారంభమయ్యాయి. విశాఖ-చెన్నె పారిశ్రామిక కారిడార్‌, మూడు విమానాశ్రయాల విస్తరణ, మెట్రో, అమరావతితో అనుసంధాన రవాణా ప్రాజెక్టులు, 8 భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో 6 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైపోయాయి. విభజన చట్టప్రకారం ఈ ప్రాజెక్టులను పదేళ్ల వ్యవధిలో ఏర్పాటు చేయొచ్చు. కానీ మేం అయిదేళ్లలోపే ఎక్కువశాతం పనులను ప్రారంభించాం. మీకు భరోసానిస్తున్నా.. ఏపీ అభివృద్ధికి మా వంతు కృషి చిత్తశుద్ధితో కొనసాగుతూనే ఉంటుంది. 
సీఎం సొంత ఆస్తులు పెంచుకునే యత్నం 
లోకేష్‌ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదని అన్నారు. అవును అది నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకూ తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కుమారుడు లోకేష్‌ ఎదుగుదల కోసమే ఆయన పాకులాడుతున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. 
ఎన్టీఆర్‌కు గౌరవం ఇస్తున్నారా! 
ప్రజలారా మీరే చెప్పండి.. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని తీసుకున్నాయన ఎన్టీఆర్‌ కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్‌కు గౌరవమిస్తున్నారా? సోదర సోదరీమణులారా మీకీ విషయం అర్థమవుతోంది. కానీ ఆయనలాంటి సీనియర్‌ నాయకుడికి ఎందుకు అర్థం కావడం లేదు! పార్టీ చరిత్రనే ఆయన మరిచిపోయేంతటి ఒత్తిడి ఏం వచ్చింది? ఇదంతా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దిల్లీలోని వంశపారంపర్య అహంకార కుటుంబంపై పోరాడేందుకే తెదేపా ఆవిర్భవించింది. కానీ.. ఈ రోజు ఆ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన తెదేపా అధినేత, అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. 
స్వార్థంతోనే మహా కూటమి క్లబ్‌లో.. 
దేశాన్ని ఎవరైతే ఇంతకాలం పొగలో మగ్గేలా వదిలేశారో వాళ్లు ఇప్పుడు దేశంలో అబద్ధాల పొగను వ్యాపింపజేయడంలో నిమగ్నమయ్యారు. మహా కూటమి పేరుతో ఆట ఆడుతున్నారు. ఇక్కడి ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. అభివృద్ధిని మరచిపోయిన ఆయన మోదీని తిట్టే పనిలో మునిగిపోయారు. మహా కూటమి క్లబ్‌లో మీ ముఖ్యమంత్రి చేరడానికి కారణం స్వార్థ రాజకీయాలను కాపాడుకునేందుకే. రాష్ట్రంలో తండ్రీ కొడుకుల అవినీతి ప్రభుత్వం పోవడం ఖాయం. ఆంధ్రలో అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత అది రానుంది. జై ఆంధ్రా.. జై ఆంధ్రా.. జై ఆంధ్రా.. భారత్‌ మాతాకి జై.. భారత్‌ మాతాకి జై’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు అని అంటూ ప్రసంగాన్ని ఆరంభించారు. 
రెండు ప్రాజెక్టులు జాతికి అంకితం 
అంతకు ముందు ప్రధాని చమురు ఉత్పత్తులకు సంబంధించిన విశాఖపట్నం ఎస్‌-1 వశిష్ట డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు, స్ట్రాటజిక్‌ క్రూడ్‌ ఆయిల్‌ స్టోరేజీ ఫెసిలిటీ ప్రాజెక్టులను ప్రారంభించారు. కృష్ణపట్నంలోని కోస్టల్‌ ఇన్‌స్టలేషన్‌కు శంకుస్థాపన చేశారు. ‘ప్రజా చైతన్య సభ’లో పాల్గొనేందుకు ముందు ఈ సభకు చేరువలోనే ఓ గదిలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 
హోరెత్తిన నిరసనలు 
ప్రధానమంత్రి మోదీ గుంటూరు పర్యటన సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. తెదేపా, ప్రత్యేక హోదా సాధన సమితి, సీపీఐ, సీపీఎం నాయకులు, రాష్ట్ర మంత్రులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో రోడ్లపై ధర్నాలు చేశారు. నల్ల చొక్కాలు, బెలూన్లు, మట్టి కుండలతో నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో నిరసనలు తెలిపారు. గుంటూరు నగరంలో తెదేపా నాయకులు మట్టి కుండల మీద మోదీ, జగన్‌, కేసీఆర్‌ అని రాసి వాటిని పగలగొట్టారు. సినీ నటుడు శివాజీ విజయవాడ దుర్గాఘాట్‌లో జలదీక్ష చేపట్టారు.

చంద్రబాబు సీనియరే

నాకు ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రికి ఏమైంది. ఆయన నా కంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది? ‘మీరు(చంద్రబాబు) సీనియర్‌, అందువల్లే మీకు గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. అవును మీరు సీనియర్‌... కూటములు, మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో..ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో.. ఆంధ్ర ప్రజల కలలను వమ్ము చేయడంలో.. నీరు గార్చడంలో... ఇలా అన్నింట్లో మీరు సీనియరే. నేనైతే ఈ విషయాల్లో సీనియర్‌ను కానే కాదు.

- గుంటూరు సభలో మోదీ

ఆంధ్ర ప్రజలారా మేల్కొనండి.. ఫొటోలు తీయించుకునేందుకు, పార్టీని బాగు చేసుకునేందుకే మీ సీఎం రేపు దిల్లీ వస్తున్నారు. మేం భాజపా కార్యకర్తల చందాలతో ఇక్కడ సభ నిర్వహిస్తే.. ఆయన మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకుని ఇదంతా చేస్తున్నారు. ఆ డబ్బుపై ప్రజలు ఆయన్ను నిలదీయాలి. ఈ ఖర్చులపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి ఆయన దిల్లీకి రావాలి.
- చంద్రబాబును ఉద్దేశించి మోదీ

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.