close
ఈ ప్రశ్నలకు బదులేది? 

అభియోగపత్రంపై న్యాయ విభాగం అభ్యంతరాలు 
మొదటికొచ్చిన 2016-ఎంసెట్‌ లీకేజీ వ్యవహారం 
మరోమారు దర్యాప్తునకు సిద్ధమవుతోన్న సీఐడీ 
అభియోగపత్రం దాఖలు ప్రక్రియ మరింత జాప్యం? 
ఈనాడు - హైదరాబాద్‌

ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారులు సేకరించిన ఆధారాలపై న్యాయ విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దాంతో సదరు అభ్యంతరాలకు తగ్గట్టుగా మరిన్ని ఆధారాలు సేకరించే క్రమంలో సీఐడీ అధికారులు మరోమారు దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసు నమోదై రెండేళ్లు పూర్తయినా ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఎంసెట్‌-2016 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వారణాసికి చెందిన ఆర్బీ సింగ్‌ ముఠా దిల్లీ కేంద్రంగా ఈ లీకేజీ వ్యవహారం నడిపించింది. ముద్రణ సంస్థ నుంచే దొంగచాటుగా ప్రశ్నపత్రాన్ని సేకరించి, దళారుల ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, డబ్బు చెల్లించిన విద్యార్థులకు తర్ఫీదు ఇప్పించింది. ఈ వ్యవహారం బయటపడటంతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు లీకేజీ బాధ్యులను గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 70 మందికి పైగానే అరెస్టు చేశారు. అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు రెండు నెలల క్రితం అభియోగపత్రం ముసాయిదా రూపొందించి న్యాయ విభాగం పరిశీలనకు పంపారు. దాన్ని అధ్యయనం చేసిన న్యాయ నిపుణులు ఇందులో పేర్కొన్న కొన్ని ఆధారాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఆధారాల మధ్య పొంతన కుదరడం లేదని, ఇలాగైతే కేసు నిలబడదని అభిప్రాయపడ్డారు. అభియోగపత్రం ముసాయిదా ప్రతిని తిప్పి పంపారు. ఫలితంగా ఎంసెట్‌ కేసులో అభియోగపత్రం దాఖలు ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 
న్యాయ నిపుణుల అభ్యంతరాలివీ 
ముద్రణ సంస్థలో పనిచేసే ఉద్యోగి ద్వారా ప్రశ్నపత్రం సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కమలేశ్‌కుమార్‌ సింగ్‌ గుండెపోటు కారణంగా సీఐడీ అదుపులో ఉండగానే చనిపోయాడు. విచారణ పూర్తికాక మునుపే చనిపోవడంతో అతను ప్రశ్నపత్రాన్ని ముద్రణ సంస్థ నుంచి ఎలా సేకరించారనే విషయంలో స్పష్టత లేదు. 
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌ ప్రశ్నపత్రం దిల్లీలోని ముద్రణ సంస్థలో ముద్రిస్తున్న విషయం ఆర్బీ సింగ్‌ ముఠాకు ఎలా తెలిసింది? 
జూన్‌లో పరీక్ష నిర్వహిస్తుండగా ఆ ముఠా ఫిబ్రవరి నుంచే లీకేజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో సిమ్‌ కార్డులు కొని దళారులకు ఇచ్చింది. ప్రశ్నపత్రం ఎక్కడ ముద్రిస్తున్నారనే విషయం అంత ముందుగా తెలుసుకోవడమే కాకుండా, అది కచ్చితంగా తమ చేతికి చిక్కుతుందని ఆర్బీ సింగ్‌ ముఠా నమ్మడానికి గల కారణాలేమిటి? 
ఆ ప్రశ్నలకు సమాధానమిచ్చే బలమైన ఆధారాలను సీఐడీ సేకరించలేదనే అభ్యంతరాలను న్యాయ విభాగం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.