close

అదనపు టీఎంసీ ఖర్చు రూ.15వేల కోట్లు! 

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు అదనంగా 15 పంపులు, మోటార్లు 
ఎల్లంపల్లి నుంచి వరదకాలువ వరకు మూడు ప్రత్యామ్నాయాలు 
ఖరారు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీ 
ఈనాడు - హైదరాబాద్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని మళ్లించడానికి సుమారు రూ.15వేల కోట్ల వ్యయమయ్యే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. సంబంధిత ఇంజినీర్లు ఇచ్చిన ప్రతిపాదనలను ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించిన తర్వాత నీటిపారుదల శాఖ తుది నిర్ణయానికి రానుంది. ఎల్లంపల్లి నుంచి శ్రీరామసాగర్‌ వరదకాలువ వరకు అదనంగా నీటిని మళ్లించే పనులకు మూడు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేశారు. ఇందులో ఒకదానిని ఖరారు చేయనున్నారు. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజి నుంచి లిప్టు ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు, తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించే రిజర్వాయర్లు, కాలువల ద్వారా ఆయకట్టుకు సరఫరా చేస్తారు. ఎల్లంపల్లి నుంచి సొరంగమార్గాలు, పంపుహౌస్‌ల ద్వారా శ్రీరామసాగర్‌ వరదకాలువకు నీటిని పంపి మధ్యమానేరుకు మళ్లిస్తారు. మధ్యమానేరుకు రాకముందే ఒక టీఎంసీ నీటిని శ్రీరామసాగర్‌కు మళ్లించేలా పునరుజ్జీవ పథకాన్ని గత ఏడాది ప్రభుత్వం చేపట్టింది. కాళేశ్వరం ఆయకట్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేటప్పటికి మధ్యమానేరు నుంచి రోజూ ఒక టీఎంసీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరో టీఎంసీ అవసరం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నిర్మించే పంపుహౌస్‌ల వద్ద మూడు టీఎంసీల సామర్థ్యానికి తగ్గట్లుగా సివిల్‌ పనులను చేపట్టింది. మరో టీఎంసీకి తగ్గట్లుగా పంపులు, మోటార్లను అమర్చాల్సి ఉంటుంది. మూడు పంపుహౌస్‌ల వద్ద 15 పంపులు, మోటార్లు అమర్చాలి. దీంతోపాటు అక్కడ పార్కులు, రోడ్లు, నిర్వహణ సిబ్బందికి గృహాలు.. ఇలా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వీటన్నిటినీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మూడు చోట్ల పంపులు, మోటార్లు కాకుండానే సుమారు రూ.1500 కోట్ల వరకు ఖర్చవుతుందన్నది ప్రాథమిక అంచనా. 15 పంపులు, మోటార్లకు అయ్యే ఖర్చు అదనం. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు ప్రస్తుతం సొరంగమార్గాలు, రెండు చోట్ల భారీ పంపుహౌస్‌ల నిర్మాణాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రతిపాదనల్లో మొదటిది ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ (మైరాంబాగు) నుంచి పత్తిపాక వద్ద రిజర్వాయర్‌ నిర్మించి నీటిని మళ్లించడం, తర్వాత వరద కాలువకు పంపడం. ఇందులో సొరంగమార్గం, పైపులైన్‌ కూడా ఉంది. పత్తిపాక రిజర్వాయర్‌ నుంచి వయాడక్ట్‌ ద్వారా వరదకాలువకు మళ్లించడం, పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణం లేకుండానే సొరంగమార్గం, పైపులైన్‌ ద్వారా మళ్లించడం ఇలా మొత్తం మూడు ప్రత్యామ్నాయాలపై సంబంధిత ఇంజినీర్లు అధ్యయనం చేశారు. వీటిని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ఇంజినీర్లు కూడా పరిశీలించినట్లు తెలిసింది. ఈ మూడు ప్రత్యామ్నాయాల అంచనా రూ.పదివేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఈ మూడింటినీ పరిశీలించి ఓ ప్రత్యామ్నాయాన్ని ఖరారు చేయనుంది. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. మొత్తం మీద మేడిగడ్డ నుంచి అదనంగా మరో టీఎంసీ నీటిని మళ్లించే పనులకు సుమారు రూ.15వేల కోట్లు అయ్యే అవకాశం ఉందని అంచనా. 
కాళేశ్వరం ఎత్తిపోతల సీఈకి ఈఎన్‌సీగా సిఫార్సు 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చీఫ్‌ ఇంజినీర్‌గా మేడిగడ్డ నుంచి మధ్యమానేరు వరకు పనులను పర్యవేక్షిస్తున్న వెంకటేశ్వర్లుకు ఇ.ఎన్‌.సిగా పదోన్నతి కల్పించడానికి నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మిడ్‌మానేరు నుంచి మిగిలిన పనులన్నీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న హరిరాం పర్యవేక్షిస్తున్నారు. రిజర్వాయర్ల, ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులు, పలు పంపుహౌస్‌లు, సొరంగమార్గాలు ఈయన పర్యవేక్షణలో ఉన్నాయి. శ్రీరామసాగర్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లాలో ఆయకట్టుకు నీటిని ఇచ్చేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన పనులను గోదావరి కమిషనర్‌ మధుసూదనరావు పర్యవేక్షిస్తున్నారు. మేడిగడ్డ నుంచి మధ్యమానేరు వరకు జరిగే పనులను పర్యవేక్షిస్తున్న చీఫ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వర్లు మార్చి ఆఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా పదోన్నతి కల్పించడంతోపాటు సర్వీసు పొడిగించే ఆలోచనలో నీటిపారుదల శాఖ ఉన్నట్లు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.