close

ప్రధానాంశాలు

పాలించే అర్హత మోదీకి లేదు 

ఆయన మహా నటుడు.. అబద్ధాల పుట్ట 
మోదీ, అమిత్‌షాలు భయంకరమైన వ్యక్తులు 
హామీలు అమలు చేయాలని అడిగితే వ్యక్తిగత దాడి చేస్తున్నారు 
దిల్లీ ‘ధర్మ పోరాట సభ’లో నిప్పులు చెరిగిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 
అన్ని పార్టీల సంఘీభావంతో భవిష్యత్తుపై నమ్మకం కుదిరిందని వెల్లడి 
ఈనాడు, దిల్లీ

‘‘పాలించే వారికి అహంకారం ఉండకూడదు. అందరికీ సమన్యాయం చేయాలి. రాజధర్మాన్ని ఉల్లంఘించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై కక్ష పెంచుకున్నారు. ఇలాంటి వారికి దేశాన్ని పరిపాలించే అర్హత ఏమాత్రం లేదు’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలో చెప్పిన 18 పెండింగ్‌ అంశాల పరిష్కారం కోసం దిల్లీలోని ఏపీ భవన్‌లో సోమవారం నిర్వహించిన 12వ ధర్మపోరాట దీక్ష ప్రారంభం, ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ వైఖరిని తూర్పారబట్టారు. ‘‘తెలుగు వాడెప్పుడూ ఆత్మగౌరవంతో బతుకుతాడు. అది దెబ్బతినే పరిస్థితి వస్తే బొబ్బిలి పులిలా తయారవుతాడు. మోదీ, అమిత్‌షా దానిని గుర్తుపెట్టుకుంటే మంచిది. మేం ఏకాకులం కాదు. అయిదుకోట్ల మంది ఉమ్మడిగా మీకు గుణపాఠం చెబుతాం’’ అని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 
నిలదీయాలి.. తిరగబడాలి 
‘‘రాష్ట్రానికి కేంద్ర సర్కారు చేసిన అన్యాయంపై పోరాడటానికి వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం. పాలకులు ధర్మాన్ని పాటించనప్పుడు, ఒక రాష్ట్రం, ప్రాంతం పట్ల కక్ష చూపి అన్యాయం చేసినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చలిలో ధర్మపోరాట దీక్ష చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని అంతా నిలదీయాలి. హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లినందున ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం ఉండదన్న కారణంతో కొత్త రాష్ట్ర ఆర్థిక మనుగడ కోసం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో అన్ని పార్టీలూ డిమాండ్‌ చేయడంతో మన్మోహన్‌సింగ్‌ అయిదేళ్లు హోదా ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న అరుణ్‌జైట్లీ హోదాకు అనుకూలంగా డిమాండ్‌ చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆనాడు అడిగారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు అమలు చేయడంలేదు? 
ధర్మ సంస్థాపన వేదిక ఏపీ భవన్‌ 
ఏపీకి జరిగిన అన్యాయాలపై గతంలో ఎన్టీఆర్‌, నేను ఇదే ఏపీ భవన్‌ వేదికగా ఉద్యమాలు మొదలుపెట్టాం. ఎన్టీఆర్‌ ఇక్కడే నేషనల్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఇక్కడే ప్రాణం పోసుకొంది. ధర్మ సంస్థాపనలో ఏపీ భవన్‌ కీలక వేదికగా నిలుస్తూ వస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు, ఏపీ విభజన హామీలన్నీ నెరవేరుస్తామని మోదీ చెప్పడం వల్లే మేం ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాం. పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని మరిచినప్పుడు దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మనమీద ఉంటుంది. మోదీ ధర్మాన్ని మరిచారు. పరిపాలించే అర్హత ఆయనకు లేదు. 
ఇష్టానుసారం చేస్తామంటే ఆటలు సాగవు 
అధికారం ఉంది కదా అని పాలకులు ఇష్టానుసారం చేస్తామంటే మీ ఆటలు సాగవని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని బతకకూడదని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌. మోదీ అహంభావంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రకటిస్తే ప్రజలు క్షమిస్తారు. లేకుంటే ఏపీ ప్రజలు శాశ్వతంగా భాజపాను, మోదీని బహిష్కరించే పరిస్థితి వస్తుంది. 
మోదీని మించిన నటుడు దేశంలో లేరు 
మొత్తం 18 డిమాండ్లు నెరవేర్చాలని అడుగుతుంటే ప్రధాని వ్యక్తిగత విమర్శలు చేశారు. అదే పని మనం చేస్తే ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటారు. మేం దిల్లీకి ఫొటోల కోసం వచ్చినట్లు విమర్శించారు. మీకంటే మించిన నటుడు భారతదేశంలో ఎవ్వరూ లేరు. మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం. దేవెగౌడ ప్రధానిగా తక్కువ సమయంలోనే మంచి విధానాలు తీసుకొచ్చి దశ-దిశ నిర్దేశం చేశారు. మీకు(భాజపాకి) పూర్తి మెజార్టీ ఇస్తే అయిదేళ్లలో ఏం ఒరగబెట్టారో దేశానికి జవాబివ్వాలి. 2011 సెప్టెంబరులో శాంతి, సామరస్యం, ఐకమత్యం కోసం మోదీ చేసిన 3 రోజుల ప్రభుత్వ ప్రాయోజిత దీక్షకు రూ.1.67 కోట్లు ఖర్చుపెట్టారు. ఆ సొమ్ము ప్రభుత్వానిది అవునా? కాదా? చెప్పాలి. రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు రావాల్సి ఉందని అడిగితే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని దోపిడీ దొంగలకు తాళం తీసి విదేశాలకు పంపుతున్నారు. రఫేల్‌ విమానాల ధర మూడురెట్లు పెంచారు. 
కొత్త రాష్ట్రం క్షేమం కోసమే ఆరోజు తగ్గాను 
పుట్టిన బిడ్డలాంటి రాష్ట్రాన్ని సరిగా చూసుకోకపోతే నష్టపోతామని ఆరోజు తగ్గాను. ఎవ్వరికీ హోదా ఇవ్వడంలేదు అందువల్ల అంతే సమాన ప్యాకేజి ఇస్తామంటే సరే అన్నాను. మనకు ఇవ్వని హోదాను వేరే రాష్ట్రాలకు కొనసాగించడంతో వెంటనే నిలదీశాను. అప్పటినుంచి పోరాడుతున్నాం. కేంద్రం ఇచ్చిన డబ్బులకు లెక్కలన్నీ చెప్పాం. నీతి ఆయోగ్‌ కూడా మనకు డబ్బు ఇమ్మని చెప్పినా పీఎంఓ అడ్డుపడింది. 
అమరావతిలో అతి పెద్ద సభ 
ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం ధర్మపోరాట దీక్షలు మొదలుపెట్టాం. చివరగా అమరావతిలో భారతదేశం ఎప్పుడూ చూడనంత అతిపెద్ద సభ పెట్టాలనుకుంటున్నాం. ఈరోజు దీక్షలో భాగస్వాములై సంఘీభావం తెలిపిన వారందరికీ అయిదు కోట్ల ఆంధ్రుల తరఫున కృతజ్ఞతలు. దేశమంతా మనకు సంఘీభావం తెలిపినట్లయింది. ఎన్డీయే భాగస్వామ పక్షమైన శివసేన కూడా వచ్చి సంఘీభావం ప్రకటించడం గొప్ప విజయం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రతి నేతా గట్టిగా చెప్పారు. దీనివల్ల మాకు భవిష్యత్తుపై నమ్మకం కలిగింది. మనం ఏకాకులం కాదన్న ధైర్యం వచ్చింది. ఇది ఏపీ సాధించిన గొప్ప నైతిక విజయం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

నేడు రాష్ట్రపతి వద్దకు చంద్రబాబు బృందం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. విభజన చట్టంలోని 18 అంశాల అమలును కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కలవనుంది. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని మొదట నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్‌ కేవలం 11 మందికే అవకాశమివ్వడంతో ఆ మేరకే నేతలను తీసుకొని వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నుంచి ప్రదర్శనగా బయలుదేరి రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.