close

పట్టణ భూములకూ పట్టాలు? 

యాజమాన్య హక్కు కల్పించేందుకు కసరత్తు 
పురపాలకశాఖతో రెవెన్యూ శాఖ చర్చలు 
డబుల్‌ రిజిస్ట్రేషన్‌ లాంటి అక్రమాలకు అడ్డుకట్ట

ఈనాడు, హైదరాబాద్‌: పట్టణాల్లో భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ దస్త్రాలే హక్కు పత్రాలుగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి భూమిపై యాజమాన్య హక్కు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయింది. నగరాలు, పట్టణాల్లో సర్వే నెంబర్లు ఉన్నప్పటికీ యాజమాన్య పత్రం (టైటిల్‌) స్థానంలో రిజిస్ట్రేషన్‌ పత్రాలే ఆధారాలుగా చలామణి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మైదాన ప్రాంతాల్లోని భూములకు కూడా పట్టాలు తయారు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పురపాలకశాఖ ఇప్పటికే అమలు చేస్తున్న జీపీఎస్‌ ఆధారిత ఆస్తుల గుర్తింపు విధానం సహకారంతో భూములకు కూడా యాజమాన్య గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు. 
రెవెన్యూ శాఖ కసరత్తు 
రాష్ట్రంలో 2016లో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ)లో రెవెన్యూ శాఖ 30 జిల్లాల పరిధిÅలోని 2.58 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల దస్త్రాల పరిశీలన చేపట్టింది. ఆధునికీకరించిన దస్త్రాల సమాచారాన్ని ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసింది. అనంతరం అన్నదాతలకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. పకడ్బందీ సాంకేతికతతో రూపొందించిన పట్టా పాసు పుస్తకాలను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. గ్రామీణ ప్రాంతంలో విజయవంతమైన ఎల్‌ఆర్‌యూపీని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా నిర్వహించి భూ యాజమాన్య హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ విషయమై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్లు, భూమి కొలతలు-దస్త్రాల నిర్వహణ శాఖ, పురపాలక, జీహెచ్‌ఎంసీలను ఆదేశించారు. దాంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు బెంగళూరులో పర్యటించిఅక్కడ అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి వచ్చారు. 
మార్గదర్శిగా పురపాలక శాఖ 
దేశంలోనే మొదటిసారిగా జియోట్యాగింగ్‌ ఆధారిత పన్ను వసూలు విధానాన్ని అమలు చేస్తున్న  తెలంగాణ పురపాలక శాఖ అనుసరించిన విధానం రెవెన్యూ శాఖకు కలిసి రానుంది. రాష్ట్రంలోని 72 పట్టణాల్లోని 12.50 లక్షల భవనాల నుంచి పురపాలక శాఖ పన్నులు వసూలు చేస్తోంది. దీనికోసం ఏడాదిన్నర క్రితం పురపాలక శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ టీకే శ్రీదేవి నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ సహకారంతో పురపాలక సంఘాల్లోని ఆస్తుల ఛాయాచిత్రాలు (జీఐఎస్‌), వాటికి జియో ట్యాగింగ్‌ను పూర్తి   చేసేందుకు కార్యాచరణను చేపట్టారు. మూడు నెలల కాలంలో అన్ని పురపాలికల్లో జియో రిఫరెన్స్‌ విధానాన్ని రూపొందించారు. ప్రతి వాణిజ్య, నివాస భవనాలకు ప్రత్యేమైన కోడ్‌ను కేటాయించి పూర్తి సమాచారాన్ని (డేటా బేస్‌) సిద్ధం చేశారు. వీటన్నింటితో ఒక యాప్‌ను రూపొందించిన ఆ శాఖ ప్రతి ఆస్తి తాలూకు చిరునామాను కచ్చితంగా నిర్దేశిస్తోంది. ప్రస్తుతం భూముల హద్దులు, సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ పురపాలక శాఖ వద్ద ఉన్న జియో ట్యాగింగ్‌ను వినియోగించుకోనుంది. ఈ మేరకు ఇటీవలే పురపాలక, రెవెన్యూ శాఖల మధ్య కీలక చర్చలు జరిగాయి. 
జియో ట్యాగింగ్‌తో సులువు 
పట్టణ ప్రాంతాల్లోనూ భూములకు హక్కులు కల్పిస్తే ప్రజలకు యాజమాన్య హక్కులు, భూమికి రక్షణ లభిస్తాయని పురపాలకశాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. పురపాలక శాఖ చేపట్టిన జియో ట్యాగింగ్‌ విధానంతో 27 శాతం ఆదాయం పెరిగిందన్నారు. భూమి హక్కులు కూడా కల్పిస్తే మరింత రక్షణ చేకూరుతుందని వివరించారు. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) విజయవంతం కావడంతో పట్టణ ప్రాంతాల్లో భూ యాజమాన్య హక్కుల కల్పన సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు ఎల్‌ఆర్‌యూపీ డైరెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. 
ఉపయోగాలివీ 
భూ యాజమాన్య హక్కుతో మైదాన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ దస్తావేజులతోపాటు చట్టబద్ధంగా భూమికి హక్కులు లభిస్తాయి. దీంతో భూములకు గుర్తింపుతోపాటు విలువ పెరుగుతుంది. 
డబుల్‌ రిజిస్ట్రేషన్‌ లాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. రెవెన్యూ కార్యాలయంలోనూ భూమి హక్కుల దస్త్రాల నిర్వహణ కొనసాగుతుంది. 
జియోట్యాగింగ్‌తో భూమిని అనుసంధానించడం వల్ల సరిహద్దుల ఆక్రమణలు, యజమాన్యం పేర్ల తొలగింపు లాంటివాటికి చోటు ఉండదు. 
ప్రభుత్వమే చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వడం వల్ల సామాన్యులకు రెవెన్యూ భూ చట్టాల మేరకు జారీచేసే భూ ధ్రువీకరణ పత్రం అదనపు బలంగా మారుతుంది. 
పరిశ్రమలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించడం సులువవుతుంది. ఆయా సంస్థలు కూడా భూమి ఆధారంగా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. 
ప్రభుత్వం కేటాయిస్తున్న భూములు ఒక్కోసారి వివాదాస్పదం అవుతున్నాయి. యాజమాన్య హక్కుల కల్పన పూర్తయితే మైదాన ప్రాంతాల్లో ఏ భూమి ఎవరిదనేది స్పష్టత వస్తుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.