close
లోక్‌సభపై గురి 

నెలాఖరుకల్లా అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్‌ కసరత్తు 
15లోపు జిల్లా కమిటీల ఏర్పాటు 
అభ్యర్థుల ఎంపికపై చర్చించండి 
పీసీసీ కమిటీలు, డీసీసీ అధ్యక్షులకు ముఖ్యనేతల దిశానిర్దేశం 
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కసరత్తును కాంగ్రెస్‌ వేగవంతం చేసింది. ఈ నెలాఖరుకు అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. సార్వత్రిక పోరే లక్ష్యంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను పూర్తి సన్నద్ధం చేస్తోంది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ ప్రచార (క్యాంపెయిన్‌) కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, డీసీసీ అధ్యక్షులతో పార్టీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికలకు అన్ని కమిటీలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సూచించింది. ఈ సమావేశాల్లో ఏఐసీసీ ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌, సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్‌, కమిటీల బాధ్యులు  విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మధుయాస్కీ, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎవరైతే బాగుంటుందో సూచించాలని పీసీసీ ముఖ్యనేతలు డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులనుద్దేశించి కుంతియా మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఈ నెల 15లోపు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 21 మంది కంటే తక్కువ మందితో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని.. జెంబో కమిటీలు వద్దని సూచించారు. ఈ నెల 13లోపు బ్లాక్‌, మండల, బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు చాలా మంది సమావేశానికి ఆలస్యంగా రావడంపై కుంతియా అసహనం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షులు వనమా వెంకటేశ్వరరావు (భ¡ద్రాద్రి కొత్తగూడెం), భరత్‌చంద్రారెడ్డి (మహబూబాబాద్‌),  కొమురయ్య (పెద్దపల్లి), శంకర్‌నాయక్‌ (నల్గొండ) సమావేశానికి గైర్హాజరయ్యారు. 

పోటీపై అధిష్ఠానానిదే తుదినిర్ణయం 
డీసీసీ అధ్యక్షులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని.. ఇది ఏఐసీసీ నిర్ణయమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్‌ తన అభ్యర్థిత్వంపై అడిగినట్లు సమాచారం. ఈ అంశంలో పార్టీ అధిష్ఠానానిదే తుదినిర్ణయమని ఉత్తమ్‌ బదులిచ్చారు. 
15 నుంచి సమీక్షలు 
ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. ఈలోపు ఆయా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా డీసీసీలు సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని డీసీసీ అధ్యక్షులకు సూచించింది. 
నెలాఖరుకు అభ్యర్థుల ప్రకటన: భట్టి 
ఈ నెలాఖరుకు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అప్పటికి పొత్తులపై కూడా పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్రంలో పొత్తులపై చర్చించి తెలియజేస్తామని.. ఆ తర్వాత అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 
రాహుల్‌, ప్రియాంకలతో భారీ సభ 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పక్కా రోడ్‌ మ్యాప్‌ రూపొందించుకొని ముందుకువెళ్లాలని ప్రచార, పబ్లిసిటీ కమిటీ సమావేశాల్లో నిర్ణయించారు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీలను ఆహ్వానించాలనే అంశంపైనా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక ఉండాలని అనుకున్నారు.

ఒక్కరోజే వందకుపైగా దరఖాస్తులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో గాంధీభవన్‌లో సందడి నెలకొంది. ఆశావహులు అనుచగణంతో వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి కుంతియా, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, గాంధీభవన్‌ ఇంఛార్జి కుమార్‌రావులకు దరఖాస్తులు అందచేస్తున్నారు. తొలిరోజు ఆదివారం 30 వరకు దరఖాస్తులు రాగా.. రెండో రోజైన సోమవారం వందకుపైగా దరఖాస్తులు అందాయి. మంగళవారమూ గడువు ఉండటంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సోమవారం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ ఎంపీ టికెట్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మం పార్లమెంటు సీటుకు దరఖాస్తు చేసుకున్నారు.  ఇప్పటి వరకు అత్యధికంగా మహబూబాబాద్‌ నుంచి 20, నాగర్‌కర్నూల్‌ నుంచి 15 దరఖాస్తులు అందాయి.  
సోమవారం దరఖాస్తు చేసుకున్న వారు  
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గోపగాని వెంకటనారాయణగౌడ్‌ 
ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌రెడ్డి 
కరీంనగర్‌- నేరెళ్ల శారద, రేగులపాటి రమ్యారావు 
సికింద్రాబాద్‌- అంజన్‌కుమార్‌ యాదవ్,‌ ఇందిరా శోభన్‌ 
వరంగల్‌- దొమ్మాటి సాంబయ్య, అద్దంకి దయాకర్‌, మానవతారాయ్‌ 
పెద్దపల్లి- అద్దంకి దయాకర్‌ 
నాగర్‌కర్నూల్‌- మల్లు రమేష్‌, బొల్లు కిషన్‌, మానవతారాయ్‌  
మహబూబాబాద్‌- ప్రొ.భట్టు రమేష్‌నాయక్‌, సూర్య నాయక్‌  
మల్కాజిగిరి- సత్యం శ్రీరంగం 
భువనగిరి- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.