close

ప్రధానాంశాలు

మోగింది భేరి 

7 విడతల్లో 17వ లోక్‌సభ ఎన్నికలు 
ఏప్రిల్‌ 11న తొలిదశలోనే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకీ అదే రోజు 
22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో మే 19న చివరి దశ పోలింగ్‌ 
మే 23న ఓట్ల లెక్కింపు 
షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘం 
ప్రతి ఈవీఎంతో పాటు వీవీప్యాట్‌ల వినియోగం 
అమల్లోకి ఎన్నికల నిబంధనలు 
ఈనాడు - దిల్లీ

భారతావనిలో వేసవి తాపాన్ని మించిన రాజకీయ వేడి రాజుకుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారీ ఓట్ల పండగ వచ్చేసింది. 90 కోట్ల మంది భారతీయ ఓటర్లు దేశ విధానకర్తలను ఎన్నుకొని తదుపరి ఐదేళ్లకు జాతి భవితకు దిశానిర్దేశం చేయడానికి రంగం సిద్ధమయింది. సామాన్యుడు తన పాశుపతాస్త్రమైన ఓటును అమ్ములపొదిలో నుంచి బయటకు తీసే క్షణాలు వచ్చేశాయి. యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఈ సంరంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

దిహేడో లోక్‌సభకు ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలతో కలసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించడంలేదని స్పష్టంచేశారు. భద్రతా బలగాల లభ్యత దృష్ట్యా ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. సునీల్‌ అరోడా ప్రకటన ప్రకారం.. 
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 11న తొలి దశలోనే ఎన్నికలు జరుగనున్నాయి. 
మహారాష్ట్ర, ఒడిశాల్లో నాలుగు దశల్లో, అసోం, ఛత్తీస్‌గఢ్‌లో మూడుదశల్లో, రాజస్థాన్‌, కర్ణాటక, త్రిపురల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరుగనుంది. 
ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ర్యాండంగా వీవీప్యాట్‌లు లెక్కిస్తారు. లోక్‌సభ ఎన్నికలకయితే ఆ లోక్‌సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఒక పోలింగ్‌ కేంద్రంలోని వీవీప్యాట్‌లను లెక్కపెడతారు. ఇలాంటి పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని పలు రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ల వచ్చాయి. అయితే ‘ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌’కు చెందిన నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. 

తొలిసారి.. 
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఈవీఎంతోపాటు వీవీప్యాట్‌లు ఉపయోగించడం ఇదే తొలిసారి. బ్యాలెట్‌ యూనిట్‌పైన రాజకీయపార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతోపాటు, ఈసారి తొలిసారిగా సదరు వ్యక్తి ఫొటోకూడా ముద్రిస్తున్నారు. దీనివల్ల ఒకేపేరుతో విభిన్న పార్టీలనుంచి అభ్యర్థులున్నట్లయితే ఓటర్లు ఇబ్బందిపడకుండా తమకు నచ్చిన వారికి ఓటేయడానికి వీలు కలుగుతుంది. 
ట్విటర్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలన్నా ఈసారి మీడియా పర్యవేక్షణ కమిటీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. 
అభ్యర్థులు తమ నేర చరిత్రతోపాటు, విదేశీ ఆస్తులు, అప్పులు, అయిదేళ్ల ఐటీ రిటర్న్స్‌ కూడా దాఖలుచేయాలన్న నిబంధన ఈ ఎన్నికల నుంచే ప్రారంభం కానుంది. 
దశల్లో మార్పు 
ఒకేవిడతలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్య గత రెండు ఎన్నికల్లోనూ ఇదే విధంగా ఉంది. ఈసారి మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌ను ఏడు దశల్లోనూ నిర్వహించడం ఇదే తొలిసారి. 2009లో 5 దశల్లో ఎన్నికలునిర్వహించినప్పుడు రెండు రాష్ట్రాల్లో మాత్రమే అన్ని దశల్లోనూ నిర్వహించారు. 2014లో 9 దశల్లో నిర్వహించినప్పుడు ఏ రాష్ట్రంలోనూ అన్ని దశల్లోనూ ఎన్నిక నిర్వహించలేదు. గరిష్ఠంగా రెండురాష్ట్రాల్లో మాత్రమే ఆరు దశల్లో జరిపారు. జమ్మూకశ్మీర్‌లోని ఆరు స్థానాలకు గత మూడు విడతలుగా అయిదు దశల్లో పోలింగ్‌ జరుపుతూ వస్తున్నారు. ఈసారి కొత్తగా అక్కడి అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 3, 4, 5 దశల్లో ఎన్నికలు ప్రకటించి ఎన్నికల సంఘం కొత్త చరిత్ర సృష్టించింది. ఒడిశాకు 2009లో 3, 2014లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, ఈసారి 4 దశల షెడ్యూల్‌ప్రకటించారు. 

వ్యూహ ప్రతివ్యూహాలకు పదును 
రాజకీయ పార్టీల విమర్శలు, సామాజిక మాధ్యమాల హోరు పతాక స్థాయికి చేరిన తరుణంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు మహాసంగ్రామాన్ని తలపించబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, ఎస్‌పీ, ఆప్‌, సీపీఐలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒక అడుగు ముందుకేశాయి. పాలక ఎన్డీయే కూటమి మిత్రపక్షాలతో సర్దుబాట్లు పూర్తిచేసుకొని కదనరంగంలోకి దూకడానికి సిద్ధమైంది. 
మూడునాలుగు ప్రాంతీయపార్టీలు మినహాయించి దేశంలోని మిగిలిన అన్ని రాజకీయపక్షాలు భాజపా, భాజపాయేతర కూటములుగా ఏర్పడి ఎన్నికల సమరాంగణంలోకి దూకుతుండటం ఈసారి ప్రత్యేకత. 
ఎవరి లెక్కలు వారివి.. 
అభివృద్ధి, అసహనం, ఉపాధి, వ్యవసాయం, త్రిపుల్‌ తలాక్‌, పౌరసత్వం, రామమందిరం, శబరిమల, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు, పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు లాంటి అంశాలను ఎవరికివారు అనుకూలంగా మలచుకొని దిల్లీ గద్దెనెక్కడానికి సమాయత్తమవుతున్నారు. గత నవంబర్‌, డిసెంబర్‌లలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని గెలుచుకొని కాంగ్రెస్‌ ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమవుతుండగా పాక్‌లో నిర్వహించిన మెరుపుదాడులు తమకు అనుకూలిస్తాయన్న భావనతో ఎన్డీయే కూటమి కదనానికి సిద్ధమవుతోంది. అగ్రవర్ణాల పేదలకు 10% కోటా, రైతులకు నగదు బదిలీ వంటి అంశాలూ కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మోదీ మ్యాజిక్‌తో విపక్షాన్ని ఢీకొంటామని ఎన్డీయే చెబుతుండగా.. ఏకతాటిపై నిలిచి పాలక కూటమిని గద్దె దించుతామని విపక్షాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

గతం కంటే ఆలస్యంగా షెడ్యూల్‌

సారి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2009, 2014 కంటే ఆలస్యంగా వెలువడింది. 2009లో మార్చి 2న, 2014లో మార్చి 5న విడుదలైంది. మునుపటి లోక్‌సభకు గడువు మే 31వరకు ఉండగా ఈ లోక్‌సభకు జూన్‌ 3 వరకు గడువు ఉండటంవల్లే షెడ్యూల్‌ ఆలస్యంగా విడుదల చేసినట్లు అరోడా వివరణ ఇచ్చారు. 2009లో ఐదు దశల్లో, 2014లో తొమ్మిది దశల్లో ఎన్నికలు జరగ్గా ఈసారి వాటిని 7 దశలకు పరిమితం చేశారు. 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు 2009లో తొలి రెండు దశల్లోనే జరిగాయి. 2014లో 7, 8వ దశల్లో సాగాయి. ఈసారి మాత్రం తొలిదశలోనే ఉభయ రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలకు, ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ జరుగబోతోంది. 
2014 తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగనున్నాయి. 
సార్వత్రిక ఎన్నికలతోపాటు 12 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. ఇందులో ఒక్క తమిళనాడు నుంచే 18 స్థానాలున్నాయి. 
2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన తేదీకి ముందే పోలింగ్‌ జరగడంతో సాంకేతికంగా ఉమ్మడి రాష్ట్రం పేరిటే ఎన్నికలు జరిగాయి. ఈసారి అధికారికంగా రెండు రాష్ట్రాలపై వేరువేరుగా పోలింగ్‌ జరగబోతోంది. 
తొలిదశలో ఓటింగ్‌ పూర్తయ్యే రాష్ట్రాలు ఫలితాల కోసం దాదాపు నెలన్నరోజులు వేచి చూడాల్సి వస్తోంది.

వాజ్‌పేయి, కరుణానిధి, జయలలిత లేని ఎన్నికలివి

రాజకీయ దిగ్గజాలు వాజ్‌పేయి, కరుణానిధి, జయలలిత లాంటివారు భౌతికంగా లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో వారి ప్రభావం ఆయా పార్టీలు, రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. భాజపా కురువృద్ధుడు ఆడ్వాణీ వయోభారం రీత్యా ఎన్నికల నుంచి తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే ఆయన బరిలో లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తలపడటం ఇదే మొదటిసారి కానుంది. 
మరోవైపు కాంగ్రెస్‌లో తరం మారింది. అధ్యక్ష బాధ్యతలు తల్లి నుంచి స్వీకరించిన రాహుల్‌ గాంధీ తొలిసారి పార్టీ అధ్యక్షుడి హోదాలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ సన్నద్ధం

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలుకూడా ఇప్పటికే అభ్యర్థులను అనధికారికంగా ఖరారుచేసుకొని ప్రచార పర్వంలోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా నినాదంతో ఎన్డీయే నుంచి బయటికొచ్చి వైరిపక్షంతో జట్టుకట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో రెండు కూటములకు దూరంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో గోదాలోకి దిగుతున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.