close
యూబీఐలో రూ. 12 కోట్ల గల్లంతు

కరెన్సీ చెస్ట్‌ బ్రాంచి మేనేజర్‌ నిర్వాకం
కమీషన్‌ కోసం ప్రైవేటు వ్యాపారులకు నగదు ‘సర్దుబాటు’
బ్యాంకు వ్యానులోనే ‘రక్షణ’ కల్పించి మరీ తరలింపు
సొమ్ము తీసుకొని ఉడాయించిన ఆగంతకులు
ఆడిట్‌ జరగడంతో బయటపడిన మోసం
కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే

కరీంనగర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌లో భారీగా నగదు గల్లంతైంది.. యూబీఐ కరెన్సీ చెస్ట్‌ బ్రాంచి మేనేజర్‌ కమీషన్‌ కోసం కక్కుర్తి పడి రూ. 12 కోట్లను బయట వ్యక్తులకు ‘చేబదులు’ ఇచ్చి బొక్కబోర్లాపడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇక్కడి రాజీవ్‌చౌక్‌ సమీపంలో కరెన్సీ చెస్ట్‌ బ్రాంచి ఉంది. 27 బ్రాంచీల నుంచి నగదును ఇక్కడికి తరలిస్తుంటారు. మళ్లీ ఏ బ్రాంచీలో అవసరమైనా రెండు వ్యాన్లలో సెక్యూరిటీ గార్డుల భద్రత మధ్య డబ్బు తరలిస్తుంటారు. ఈ వ్యవహారమంతా మేనేజర్‌ అధీనంలో ఉంటుంది. ఇక్కడే మోసానికి తెరలేచింది. కరెన్సీ చెస్ట్‌ బ్రాంచి మేనేజర్‌ ఎ.ఎం.సురేశ్‌కుమార్‌ (53) హైదరాబాద్‌ నివాసి. ఆయనకు ముంబయి, జబల్‌పూర్‌కు చెందిన పలువురు ఫైనాన్స్‌ వ్యాపారులు, స్థిరాస్తి వ్యాపారులతో పరిచయాలు ఉన్నాయి. నగదు సర్దుబాటు చేస్తే కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని.. ప్రతిగా పెద్ద మొత్తంలో కమీషన్‌ ఇస్తామని కొందరు వ్యాపారులు ఆశపెట్టారు.

దీంతో కక్కుర్తిపడిన మేనేజర్‌.. తన అధీనంలో ఉన్న నగదు వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. జనవరి చివరి వారంలో ముంబయికి చెందిన వ్యక్తి రూ. 5 కోట్లు ఇస్తే రూ. 25 లక్షల కమీషన్‌ ఇస్తానని చెప్పడంతో డబ్బులు సర్దుబాటు చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆ మేరకు నగదు వ్యానులో నింపి ఇద్దరు సెక్యూరిటీ గార్డుల భద్రతతో హైదరాబాద్‌కు తరలించి అతడికి అప్పగించాడు. ఫిబ్రవరి మొదటివారంలో జబల్‌పూర్‌కు చెందిన కొందరికి రూ. 7 కోట్లు ఇవ్వడానికి అంగీకరించాడు. ఓ వ్యక్తి నేరుగా కరీంనగర్‌కే రాగా.. అతడికి వారంరోజుల్లో డబ్బు ‘సర్దుబాటు’ చేశాడు. బ్యాంకు నుంచి ఆ సొమ్మును వివిధ శాఖలకు పంపిస్తున్నట్లు నమోదు చేసి ఇలా కమీషన్‌ కోసం గుర్తుతెలియని వ్యక్తులకు అప్పగించాడు.

తనిఖీతో వెలుగులోకి..
రోజులు గడుస్తున్నా బదులు ఇచ్చిన సొమ్ము తిరిగి రాలేదు. సురేశ్‌కుమార్‌ వారికి ఫోన్‌ చేసినా స్పందన లేదు. ముంబయి వెళ్లి ఆరా తీయగా సొమ్ము తీసుకున్న వ్యక్తులు విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. త్వరలో తిరిగి వస్తారని తెలియడంతో చేసేదిలేక కరీంనగర్‌ చేరుకున్నాడు. ఇంతలో బ్రాంచిలో ఆడిట్‌ తేదీలు ఖరారయ్యాయి.
ఈనెల 11న మానకొండూర్‌ బ్యాంకు మేనేజర్‌ ఆడిట్‌ జరపగా రూ. 12 కోట్లు గల్లంతైనట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాడు. వారి ఆదేశాల మేరకు గురువారం కరీంనగర్‌లోని ఒకటో ఠాణాకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

సీబీఐ దృష్టికి తీసుకువెళ్లిన కమిషనర్‌
భారీ మొత్తంలో నగదు గల్లంతైనట్లు తెలియడంతో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి చీఫ్‌ మేనేజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భారీ మొత్తంలో నగదు గల్లంతు కావడం, బ్యాంకు ఉద్యోగుల హస్తం ఉండడంతో ఆయన ఈ విషయాన్ని సీబీఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.