close

అవసరమైతే ఇతర చర్యలు

అజార్‌పై ప్రతిపాదనను చైనా అడ్డుకోవడంపై ఇతర సభ్య దేశాల అసంతృప్తి
ఐరాస భద్రతా మండలిలో వాడివేడిగా చర్చలు

వాషింగ్టన్‌, బీజింగ్‌: ‘జైష్‌ ఎ మహమ్మద్‌’ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించకుండా అడ్డుకున్న చైనా వైఖరిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో ఇతర సభ్య దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే వైఖరి కొనసాగితే బాధ్యతాయుతమైన సభ్యదేశాలుగా అజార్‌ అంశంలో ‘ఇతర చర్యలు’ తీసుకోవాల్సి వస్తుందని అసాధారణ రీతిలో గట్టిగా హెచ్చరించాయి. చైనా వైఖరి దక్షిణాసియాలో ప్రాంతీయ సుస్థిరతకు విఘాతమని అభిప్రాయపడ్డాయి. ఈ వివరాలు మీడియాకు వెల్లడించిన ఓ దేశ రాయబారి తమ పేరు బయటపెట్టడానికి, యూఎన్‌ ఆంక్షల కమిటీలో ఏం చర్చించిందీ పూర్తి వివరాలు వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను రక్షించడానికి తరచూ చైనాపై ఆధారపడుతోందని పాకిస్థాన్‌ను మరో దేశ రాయబారి తప్పుబట్టారు. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థగా ‘జైష్‌ ఎ మహ్మద్‌’ను ప్రకటించిందని, అలాంటి సంస్థ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోవడం సమర్థనీయం కాదన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత ఫిబ్రవరి 27న అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సంయుక్తంగా ‘యూఎన్‌ఎస్‌సీ’లో ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు చైనా బుధవారం మోకాలడ్డింది. ప్రతిపాదనను క్షుణ్నంగా పరిశీలించడానికి తమకు సమయం కావాలని కోరింది. వాస్తవానికి అభ్యంతరం వ్యక్తం చేయడానికి బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉంది. సరిగ్గా గంటముందు చైనా మోకాలడ్డింది. దీంతో మరో ఆరు నెలలవరకు దీన్ని యూఎన్‌ఎస్‌సీలో ప్రవేశపెట్టడం కుదరదు. ఈ తరువాత కూడా ఏ సభ్యదేశమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మరో మూడునెలల వరకు పొడిగిస్తారు.

అజార్‌ అంతర్జాతీయ ఉగ్రవాదే: అమెరికా

అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్‌ పల్లాడినో అన్నారు. తన చర్యను చైనా సమర్థించుకుంది. ‘‘క్షుణ్నంగా, లోతుగా పరిశీలన’’ చేయడానికి తమకు సమయం చిక్కుతుందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూకాంగ్‌ అన్నారు. భారత్‌-పాక్‌లు చర్చలు జరిపి అందరికీ అంగీకారయోగ్యమైన నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుందన్నారు.

జిన్‌పింగ్‌కు మోదీ భయపడ్డారు
- రాహుల్‌గాంధీ

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ముందు ప్రధాని మోదీ బలహీనుడిగా మారి, భయపడ్డారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. జైష్‌ ఎ మహ్మద్‌ మసూద్‌ అజార్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అన్న ముద్ర వేయడానికి ఐక్యరాజ్య సమితిలో చైనా అడ్డుకోవడంపై స్పందించిన రాహుల్‌.. చైనాతో మోదీ జరిపిన దౌత్యం ఏమయిందని ప్రశ్నించారు. ‘‘జిన్‌పింగ్‌తో గుజరాత్‌లో ఊయల ఊగారు. దిల్లీలో ఆలింగనం చేసుకున్నారు. చైనాలో తల వంచారు. ఇంతవరకు మోదీ ఎందుకు పెదవి విప్పలేదు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

పండగ చేసుకుంటున్న రాహుల్‌
- మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

మసూద్‌ అజార్‌ విషయంలో చైనా వైఖరిని చూసి దేశ ప్రజలంతా బాధపడుతుంటే రాహుల్‌ గాంధీ మాత్రం పండగ చేసుకుంటున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విమర్శించారు. ‘‘రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు మసూద్‌కు అనుకూలంగా ఉన్నాయి. పాకిస్థాన్‌ పత్రికల్లో ఇవే పతాక శీర్షికలు అవుతాయి’’ అని వ్యాఖ్యానించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.