close

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

రేపటి నుంచి ప్రారంభం
   విద్యార్థులకు ‘ఐదు నిమిషాల’ వెసులుబాటు
   ఉదయం 9.35 దాటితే ప్రవేశం నిలిపివేత
   ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం
   వెబ్‌సైట్‌ హాల్‌టికెట్‌తోనూ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెల 16న ప్రారంభమై ఏప్రిల్‌ 3 వరకు జరగనున్న పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష ప్రారంభమైన తరువాత.. ఐదు నిమిషాల పాటు కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామని, 9.35 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5.52 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, పరీక్షలకు 2,563 పరీక్ష కేంద్రాలు నిర్ణయించామని వివరించారు. హాల్‌టికెట్‌ చూపి, పరీక్ష కేంద్రాల వరకు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ఈ మేరకు ఆర్టీసీ అనుమతించిందని వెల్లడించారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ సుధాకర్‌తో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 2తో పరీక్షలు ముగియాల్సి ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈ నెల 22న జరగాల్సిన ఇంగ్లిష్‌ పేపర్‌-2 పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షల సమయంలో విద్యుత్‌ కోతలు లేకుండా విద్యుత్‌శాఖను అప్రమత్తం చేశామన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్‌ఎం, ఆశా ఉద్యోగితో పాటు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా పెట్టామన్నారు. పరీక్షలు జరుగుతున్నంత వరకు చుట్టూ జిరాక్స్‌ దుకాణాలను మూసివేయిస్తామని, 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్‌రూమ్‌ పనిచేస్తుందన్నారు.

వెబ్‌ హాల్‌టికెట్‌కూ అనుమతి..
విద్యార్థులహాల్‌టికెట్లు ‌www.bse.telangana.gov.in వెబ్‌సైట్లో పొందుపరిచామని చెప్పారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు అందకుంటే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించకోని 340 పాఠశాలల్లోని విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తూ హాల్‌టికెట్లు ఇచ్చామన్నారు. ఈ పాఠశాలలకు అగ్నిమాపక అనుమతులు పొందడం ఇబ్బందిగా మారడంతో గుర్తింపు పునరుద్ధరణ సమస్యలు తలెత్తాయన్నారు. పరీక్ష కేంద్రం నుంచి 8 కి.మీ దూరంలో పోలీస్‌స్టేషన్‌, ట్రెజరీ కార్యాలయం ఉన్నవాటిని ఏ కేటగిరీగా, ఈ రెండింటిలో ఏదో ఒకటే ఉంటే బీ కేటగిరీగా, ఈ రెండూ లేని వాటిని సీ కేటగిరీగా గుర్తించామని పేర్కొన్నారు. సీ కేటగిరీ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. రాష్ట్రంలోని 116 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని విజయ్‌కుమార్‌ తెలిపారు. కొందరు విద్యార్థులు జవాబుపత్రాల్లో నినాదాలు, సూచనలు, అభ్యర్థనలు రాస్తుంటారని, ఇలా చేయకూడదని హెచ్చరించారు. ఓఎంఆర్‌షీటును పరిశీలించి, ఆ పత్రం తమదే అని నిర్ధరించుకున్న తరువాత జవాబులు రాయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో చూసుకోవాలని కోరారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.