close

నేడు కాంగ్రెస్‌ తొలి జాబితాపై స్పష్టత

రాహుల్‌ నేతృత్వంలో భేటీ కానున్న సీఈసీ

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 17 నియోజకవర్గాలకు సంబంధించి రెండు, మూడు పేర్లతో స్క్రీనింగ్‌ కమిటీ జాబితా తయారు చేసింది. మరోమారు కసరత్తు చేసి కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి నివేదించనుంది. సాయంత్రం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సీఈసీ భేటీ కానుంది. ఇందులో కనీసం పది నుంచి పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి శుక్రవారం రాత్రికి లేదా శనివారం ఉదయం అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గాలకు తెరాస అభ్యర్థులను ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా రెండో విడతలో ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలను బరిలో దింపాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించింది. కానీ ఎమ్మెల్యేలు తెరాసలోకి వరుస కడుతుండడంతో భవిష్యత్తు పరిణామాల దృష్ట్యా వారిని బరిలో దింపడంపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్కను మహబూబాబాద్‌ నుంచి బరిలో దింపే అంశంపై నిర్ణయానికి రాలేదని సమాచారం.

నమ్ముకున్నొళ్లకే టికెట్లు ఇవ్వండి
‘ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకొని పని చేస్తున్నాం... గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీకి సేవ చేస్తున్నాం. ఈ దఫా పార్టీని నమ్ముకున్నోళ్లకే టికెట్లు ఇవ్వాలని పలువురు ఆశావహులు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాకు వినతిపత్రం ఇచ్చారు. ఆదిలాబాద్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరేశ్‌ జాదవ్‌, జహీరాబాద్‌ టికెట్‌ ఆశిస్తున్న సతీశ్‌మాదిగ,  సుభాష్‌రెడ్డి, వరంగల్‌ స్థానాన్ని కొరుకుంటున్న మానవతారాయ్‌.. కుంతియాను కలిసి విజ్ఞప్తి చేశారు.

రాహుల్‌తో నేడు రేవంత్‌ భేటీ
పీసీసీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్‌గాంధీ, కె.సి.వేణుగోపాల్‌లతో శుక్రవారం భేటీ కానున్నారు. గురువారం దిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలను కలిసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని వారికి వివరించినట్లు తెలిసింది. రాహుల్‌తో భేటీ అనంతరమే మల్కాజిగిరి నుంచి ఆయన బరిలో దిగే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.