close

‘కారు’లోనే పంకా!

తెరాస, వైకాపా కలిసి మనపై దాడి
  తెదేపా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
  టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు గడియారాలు పంపించారు. ఆ ప్యాకెట్లపై కారు గుర్తు ముద్రించి ఉంది. దానిపై ఫ్యాను గుర్తున్న స్టిక్కర్లు అంటించి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు కాదు.. తెరాస, వైకాపా బంధానికి చాలా ఆధారాలున్నాయి’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌పై తెరాస నాయకులు కక్ష కట్టారు. పట్టిసీమ నీటిలోనూ వాటా అడుగుతున్నారు. నిజానికి పట్టిసీమ వారికి సంబంధం లేని విషయం. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ప్రతి దాంట్లో అడ్డుపుల్లలేసి ఇబ్బంది పెడతారు. కేసుల్లో ఇరుక్కున్న జగన్‌ కేసీఆర్‌కు దాసోహం అంటారు. ఎందుకంటే ఆయన జుట్టు వాళ్ల చేతుల్లో ఉంది’ అని విమర్శించారు. గురువారం ఉదయం తెదేపా కార్యకర్తలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘భాజపా, వైకాపా లాలూచీ టైమ్స్‌ నౌ స్టింగ్‌ ఆపరేషన్‌లో బయటపడింది. జగన్‌ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఏమవుతాడో చూసుకోండి అంటూ బెదిరిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఎన్నికల సమయంలో వైకాపా మైండ్‌గేమ్‌ ఆడుతోంది. సీట్లు రాని వారిని, చిన్న చిన్న ఇబ్బందులున్న వాళ్లను ఆశ చూపి తీసుకెళ్లి మోసం చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. టెలివిజన్‌ ప్రకటనలు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కుట్రలను ఛేదించడంలో తెదేపా కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘రాష్ట్రంలో సాంకేతికతను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నాం.. కోటి కుటుంబాలకు పసుపు కుంకుమ ద్వారా రూ.20వేల చొప్పున లబ్ధి చేకూర్చాం..’ అని చంద్రబాబు వివరించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.