close
మీ ఎంపీగా ఎవరుండాలె?

ఎమ్మెల్యేల నుంచి సీఎం అభిప్రాయసేకరణ
   స్వయంగా ఫోన్లు
   నేడు, రేపు ఎంపీలు, అభ్యర్థులతో భేటీ
కాంగ్రెస్‌ జాబితా ఆలస్యమయితే తెరాస అభ్యర్థులకు సంకేతాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస తరఫున పార్లమెంటుకు పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికలో శాసనసభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా టికెట్ల ఖరారుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. మూడు రోజులుగా శాసనసభ్యుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గురువారం రాత్రి కూడా పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. కొంత మంది ఎమ్మెల్యేలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశమై అభిప్రాయాలను తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 16 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెరాస అభ్యర్థుల ఎంపికకు విస్తృత కసరత్తు చేస్తోంది. కేసీఆర్‌ ఇప్పటికే సర్వేలు కూడా చేయించారు. తాజాగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని వారు ప్రతిపాదించిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పార్టీ బలానికి తోడు అభ్యర్థులు కూడా గట్టి వారై ఉండాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతలు పోటీకి నిలిస్తే, వారికి దీటైన అభ్యర్థులనే బరిలోకి దింపాలన్నది వ్యూహం.

ఎక్కడేంటి..?
చేవెళ్ల కోసం రంజిత్‌రెడ్డి పేరును ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. మల్కాజిగిరి నియోజకవర్గం అభ్యర్థిత్వానికి ఎక్కువ మంది నవీన్‌రావు పేరు చెప్పగా మంత్రి మల్లారెడ్డి తన అల్లుడైన రాజశేఖర్‌రెడ్డి పేరు సూచించారని తెలిసింది. సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి తన తనయుడైన సాయికిరణ్‌యాదవ్‌ పేరును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీపై అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా ఎంఎస్‌ ఔషధ సంస్థ యాజమాని సత్యనారాయణరెడ్డి సోదరుడైన శ్రీనివాస్‌రెడ్డిని ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లాలోనూ ప్రస్తుతం ఎంపీకి టికెట్‌ అనుమానంగా మారడంతో అక్కడ మరో అభ్యర్థి ఎంపికకు అధిష్ఠానం సన్నాహాలు చేసింది. ఒక ఎమ్మెల్యే తమకు బంధువైన వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఒక సీనియర్‌ ఎమ్మెల్యే తన కూతురికి గాకుండా ప్రస్తుత ఎంపీ సీతారామ్‌నాయక్‌కే టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎంపీ వివేక్‌ టికెట్‌ కోసం ఆరాటపడుతున్నారు. ఆయనపైనా సీఎం అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు వివేక్‌కు ప్రత్యామ్నాయంగా నేతకాని వెంకటేశ్‌ పేరును తెరమీదికి తెచ్చారు.

ఖరారైన పేర్లు...

ఇప్పటి వరకు సర్వేలు, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ఆధారంగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), నగేశ్‌ (ఆదిలాబాద్‌) బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి) పేర్లను ఖరారు చేశారు. టికెట్లు ఖరారయిన ఎంపీలతో సీఎం శుక్రవారం భేటీ కానున్నట్లు తెలిసింది. శనివారం మిగిలిన ఎంపీలు, కొత్త ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ జాబితా విడుదలయితే తెరాస జాబితాను కూడా విడుదల చేసే వీలుంది.  కాంగ్రెస్‌ జాబితా ఆలస్యమయితే తెరాస అభ్యర్థులకు ముందస్తు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.