close
తెలంగాణకు 29 టీఎంసీలు

కృష్ణా జలాల కేటాయింపు
  ఏపీకి 17.50 టీఎంసీలు
  సాగర్‌లో 505 అడుగుల వరకు తోడుకోవచ్చు
  కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 29 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17.50 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. గురువారం హైదరాబాద్‌లో బోర్డు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ ఆర్‌కే జైన్‌ నేతృత్వంలో సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులు సమావేశమయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో అందుబాటులో ఉన్న నీళ్లపై చర్చించి తాగునీటి అవసరాల కోసం కనీస నీటి నిల్వ సామర్థ్యానికి (డెడ్‌ స్టోరేజీ) దిగువ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఈనెల 11 నాటికి శ్రీశైలంలో 827.40 అడుగుల వద్ద 46.98 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయం నుంచి 800 అడుగుల దిగువ నుంచి 18 టీఎంసీలు తీసుకోవాలని నిర్ణయించగా ప్రాజెక్టులో 28.97 టీఎంసీలు నిల్వ ఉండనున్నాయి. నాగార్జున సాగర్‌లో 524.2 అడుగుల వద్ద 157.05 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఈ జలాశయంలో 505 అడుగుల నుంచి 33.71 టీఎంసీలు వినియోగించుకోనుండగా మరో 123.33 టీఎంసీలు నిల్వ ఉండనున్నాయి. మొత్తంగా ఈ రెండు జలాశయాల్లో 51.71 టీఎంసీల జలాలు వినియోగానికి అందుబాటులో ఉన్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

ఆగస్టు వరకు తాగునీటికి కేటాయింపులు
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి మిషన్‌ భగీరథ అవసరాలకు ఆగస్టు వరకు తెలంగాణకు 8.5 టీఎంసీలు కేటాయించారు. సాగర్‌ కింద యాసంగి పంటలకు చివరి తడులకు ఎడమ కాల్వ కింద 9 టీఎంసీలు కేటాయించారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు వరకు కేటాయింపులు చేశారు.

మరికొన్ని నిర్ణయాలు
* సాగర్‌లో కనీసం 510 అడుగుల వరకు నీటి నిల్వ ఉండేలా చివరి వరకు రెండు రాష్ట్రాలు ప్రయత్నించాలి.
* ఏపీకి ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసే సమయంలో పాలేరు జలాశయానికి (తెలంగాణ) నీటి విడుదలను సమన్వయం చేసుకోవాలి.
* సాగర్‌ నుంచి విద్యుత్తు ఉత్పత్తి అనంతరమే నీటిని విడుదల చేస్తే ప్రయోజనం పొందొచ్చు. జెన్‌కోకు విద్యుత్తు డిమాండ్‌ లేకుంటే గేట్ల నుంచి నీటిని విడుదల చేసుకోవచ్చు.
* కృష్ణా డెల్టా అవసరాలకు శుక్రవారం నుంచే రోజుకు పదివేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలి.

తెలంగాణ అవసరాలకు

* శ్రీశైలం నుంచి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మిషన్‌ భగీరథకు: 3.5 టీఎంసీలు

నాగార్జున సాగర్‌ నుంచి..
* మిషన్‌ భగీరథ అవసరాలకు: 5 టీఎంసీలు
* హైదరాబాద్‌ నగర అవసరాలకు:  8.5 టీఎంసీలు
* ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద చెరువులకు: 3 టీఎంసీలు
* నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద యాసంగి పంటలను కాపాడేందుకు: 9 టీఎంసీలు

ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు

* శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు: 3 టీఎంసీలు

నాగార్జున సాగర్‌ నుంచి..
* కుడి కాల్వకు:   8 టీఎంసీలు
* ఎడమ కాల్వకు: 3 టీఎంసీలు
* కృష్ణా డెల్టాకు:  3.5 టీఎంసీలు

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.