close
జగన్‌, మమత, నవీన్‌, మాయా, అఖిలేశ్‌ అంతా మనతోనే

16 మంది ఎంపీలుంటే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం మనకే
  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌
  నర్సంపేట, తాండూరు, వికారాబాద్‌లో రోడ్‌షోలు, ములుగులో ప్రచార సభ

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, వికారాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి: ‘‘పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి, ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేశ్‌యాదవ్‌, మాయవతి.. ఇలా చాలామంది మనతోనే ఉన్నారు. మన మధ్యనే 150 సీట్లు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ప్రసుత్తం భాజపాకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్ల కంటే ఎక్కువగా వచ్చే పరిస్థితి లేదు. 16 మంది మన ఎంపీలు ఉంటే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం మన నాయకుడు కేసీఆర్‌కు ఉంటుంది’’ అని  తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. దిల్లీని శాసించేది తెలంగాణ గల్లీ కావాలని తెలిపారు. శనివారం మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నర్సంపేటలో నిర్వహించిన రోడ్‌షోలో, ములుగులో జరిగిన ప్రచార సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇద్దరు ఎంపీలతో దిల్లీ మెడలను వంచి తెలంగాణ తెచ్చిన మొనగాడు మన నాయకుడు కేసీఆర్‌ అని..అలాంటి నాయకుడికి 16 మంది ఎంపీలను అప్పగిస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. ‘రాష్ట్రంలో గోదావరిపై కాళేశ్వరం, దేవాదుల, కృష్ణానదిపై పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మించుకుంటున్నాం. వీటిలో ఒక్క ప్రాజెక్టుకూ మోదీ పైసా ఇవ్వలేదు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసుకుంటుంటే పలువురు ప్రముఖులు వచ్చి చూశారు. నర్సంపేటకు జాతీయ వాటర్‌మెన్‌గా ప్రసిద్ధుడైన రాజేందర్‌ సింగ్‌ వచ్చారు. ఇంటింటికీ నల్లా ద్వారా నీరందించే మిషన్‌భగీరథ కార్యక్రమాన్ని దేశ విదేశాల నుంచి ప్రముఖులు వచ్చి చూసి మెచ్చుకున్నారు. నీతి ఆయోగ్‌ సంస్థ వారు కూడా భగీరథ పనులను ప్రశంసించారు. కేసీఆర్‌ మంచి పనులు చేస్తున్నారని, ఇందుకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నరేంద్ర మోదీకి నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే మోదీ 24 పైసలు కూడా ఇవ్వలేదు’ అని కేటీఆర్‌ వివరించారు. దిల్లీ జుట్టు మన చేతిలో ఉంటే రూ. 24 వేల కోట్లే కాదు.. అవసరమైతే రూ.50 వేల కోట్లు మలుపుకొచ్చే సత్తా మన నాయకుడు కేసీఆర్‌కు ఉందన్నారు. కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఎత్తిపోతల పథకానికి రేపటి రోజున నిధులు రావాలంటే కేంద్రాన్ని యాచించడం కాదు.. శాసించాలని, ఇందుకు మన 16 మంది ఎంపీలను గెలిపించి దిల్లీకి పంపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తిచేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను కేంద్ర నిధులతోనే ఏర్పాటుచేయాలన్నా,  మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మన ఎంపీలు కూడా దిల్లీలో ఉండాలన్నారు. దిల్లీలో ఉండాల్సింది..చౌకీదార్‌.. టేకేదార్‌.. కాదు దేశానికి అసలుదారి.. ఇమాందారీ లాంటి కేసీఆర్‌ కావాలన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి చందూలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.