close

ప్రధానాంశాలు

వందలాది ఇంజినీర్లు ..వేలాది ఈవీఎంలు 

ఇందూరుపైనే అందరి దృష్టి 
అధికారులు, సామగ్రి తరలింపునకు హెలికాప్టర్‌ ఏర్పాటుచేసిన ప్రభుత్వం 
మాక్‌ పోలింగ్‌ నిర్వహణపై సందిగ్ధత 
18 గంటలు పడుతుందని అంచనా 
కొనసాగుతున్న రైతుల నిరసనలు 
ఎన్నిక వాయిదా కోరుతూ నేడు హైకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటన 
ఈనాడు, నిజామాబాద్‌, హైదరాబాద్‌

దేశంలోనే భారీగా అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్‌లో ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగానే జరుగుతున్నాయి. వేలాది ఈవీఎంలు.. వందలాదిమంది ఇంజినీర్లు రంగంలోకి దిగారు. దిల్లీ నుంచి ప్రత్యేక అధికారులు వచ్చారు. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారి రాకపోకలకు ప్రత్యేకంగా హెలికాప్టర్‌ కూడా ఏర్పాటుచేసింది. 
గడువు తక్కువగా ఉండటంతో భారత ఎన్నికల సంఘం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. 25,000 వరకు ఎం-3 రకం ఈవీఎంలను ఇక్కడకు తరలించింది. వాటి పరిశీలనకు వందలాది మంది ఇంజినీర్లను వివిధ రాష్ట్రాల నుంచి రప్పించింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం బుధవారం హెలికాప్టర్‌లో ఇక్కడకు చేరుకుంది. మరోవైపు మద్దతు ధర కోసం ఇక్కడ బరిలో నిలిచిన రైతులు ఎన్నికల గుర్తులపై అవగాహన కోసం తమకు తగినంత సమయం ఇవ్వాలని చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం ఉప కమిషనర్‌ సుదీప్‌ జైన్‌, ప్రోగ్రాం కన్సల్టెంట్‌ నిఖిల్‌ కుమార్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ప్రధాన అధికారి జ్యోతి బుద్ధప్రసాద్‌, నిజామాబాద్‌ ఎన్నికల ప్రత్యేకాధికారి రాహుల్‌ బొజ్జా ఏర్పాట్ల పరిశీలనకు బుధవారం ఇక్కడికి వచ్చారు. వేల సంఖ్యలో వినియోగించే ఈవీఎంల తనిఖీ ఏర్పాట్లను తిలకించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి 750 మంది ఇంజినీర్లు వచ్చారు. వారికి, ఉద్యోగులకు శిక్షణ అందించేందుకు దిల్లీ నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పించారు. వీరు ఈవీఎంలను సిద్ధం చేసే పనులు ముగిసే వరకు ఇక్కడే ఉంటారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్‌ అధికారి ఎం.ఆర్‌.ఎం.రావుకు ఉన్నతాధికారులు సూచించారు. నియోజకవర్గంలో చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో సూచనలు చేశారు. 

ఇదో రికార్డు కానుంది.. 
నిజామాబాద్‌ ఎన్నిక ఒక రికార్డు కానుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉప కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఎం-2 రకం ఈవీఎంలను ఉపయోగించి 4 బ్యాలెట్‌ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు జరిగాయని చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎం-3 రకం ఈవీఎంలతో 12 బ్యాలెట్‌ యూనిట్ల ద్వారా ఇక్కడ ఎన్నిక నిర్వహించబోతున్నామని వివరించారు. దీనినొక సవాల్‌గా తీసుకుని ఈ చరిత్రాత్మక క్రతువులో భాగస్వాములు కావాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. 
నలుగురు అధికారుల నియామకం 
ఈ స్థానంలో ఎన్నికలకు నలుగురు అధికారులను ప్రత్యేకంగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్‌.శారదాదేవి, వి.లీల, టీఏవీ నాగలక్ష్మి, బి.కిషన్‌రావులను నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అనుబంధంగా సేవలందించేందుకు నియమించారు. 
యుద్ధప్రాతిపదికన ఈవీఎంల తనిఖీ 
- రజత్‌కుమార్‌, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి 
నిజామాబాద్‌ నియోజకవర్గానికి అవసరమైన కంట్రోల్‌, బ్యాలెట్‌ యంత్రాలను రప్పిస్తున్నామని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం సుమారు 2,000 యంత్రాల తనిఖీ ప్రక్రియ పూర్తయిందని, యుద్ధ ప్రాతిపదికన వాటిని తనిఖీ చేస్తున్నామని చెప్పారు. ఒక్కో యంత్రం తనిఖీకి కనీసం 5, 6 గంటల సమయం పడుతుందన్నారు. ఆదివారంలోగా తనిఖీ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు ఎలాంటి ఆస్కారం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 
పోటీలో ఉన్న రైతుల నిరసన 
నిజామాబాద్‌ బరిలో నిలిచిన పలువురు రైతులు బుధవారం ఈవీఎంల పరిశీలన కేంద్రం వద్ద నిరసన తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల పరిశీలన ఉంటుందని ఇక్కడకు పిలిచారని, కాని తమకు ఇక్కడ సరైన ఏర్పాట్లే చేయలేదని వాపోయారు. ఈవీఎంలపై తమకు సందేహాలున్నాయని, బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలు జరపాలని కోరారు. తమ గుర్తులను ప్రచారం చేసుకోడానికి గడువు తక్కువగా ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. అక్కడ బైఠాయించిన కొందరికి పోలీసులు సర్దిచెప్పి లోపలకు తీసుకెళ్లారు. 

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం 
గుర్తులు ఎలా ఉంటాయో చెప్పలేదని, వాటిపై ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం లేనందున ఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు రైతులు తెలిపారు. హైకోర్టులో గురువారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై హైదరాబాద్‌లో ఓ న్యాయవాదిని (గతంలో ప్రభుత్వంపై పలు అంశాలపై కేసు వేసిన) కలిసినట్లు రైతులు తెలిపారు.

మాక్‌పోలింగ్‌కే 18 గంటలు? 

రాయికల్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ బరిలో 185 మంది అభ్యర్థులు ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎం-3 ఈవీఎంలను యూ ఆకారంలో ఉంచి ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేసింది. పోలింగ్‌ రోజున ఏజెంట్ల సమక్షంలో అభ్యర్థులకు ఈవీఎంల పని తీరుపై మాక్‌పోలింగ్‌ నిర్వహించాలనేది నిబంధన. సాధారణంగా ఎన్నికల రోజు ఉదయం 6 గంటలకు మాక్‌పోల్‌ నిర్వహించి తర్వాత 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహిస్తుంటారు. కాని నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో 185 మంది అభ్యర్థులు ఉండటంతో మాక్‌పోల్‌ నిర్వహణ సందిగ్ధంగా మారింది. మాక్‌పోల్‌లో ఒక్కో అభ్యర్థికి సుమారు 50 ఓట్లు వేసి పరిశీలిస్తారు. ఒక్కో ఓటుకు వీవీప్యాట్‌ నుంచి 7 సెకన్లకు స్లిప్‌ వస్తుంది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో ఓటు వేసినా 185 మందికి సుమారు 22 నిమిషాలు పడుతుంది. అలాంటిది ఒక్కో అభ్యర్థికి 50 ఓట్లు చొప్పున వేసి పరిశీలిస్తే 18 గంటల సమయం పడుతుంది. మాక్‌ పోలింగ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

నమూనా పోలింగ్‌ కేంద్రం నేడు ప్రారంభం

జగిత్యాల, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ బరిలో అభ్యర్థులు ఎక్కువమంది ఉన్న నేపథ్యంలో ఓటర్లను చైతన్య పరిచేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ జగిత్యాల, కోరుట్లలో నమూనా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్ల అవగాహన కోసం అభ్యర్థుల జాబితా, పోలింగ్‌ కేంద్రంలోపలి నమూనా చిత్రం ప్రదర్శించారు. ఏజెంట్లు, ఓటర్‌ స్లిప్‌ జారీ కేంద్రం ఏర్పాటు చేశారు. గదిలోపల ప్రిసైడింగ్‌ అధికారి, కంట్రోల్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి, వెబ్‌కాస్టింగ్‌ మరో పక్కన ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసి అందులో ‘యు’ ఆకారంలో 12 ఓటింగ్‌ యంత్రాలు, వీవీ ప్యాట్‌ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌, ఆర్డీవో జి.నరేందర్‌ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తుండగా నిజామాబాద్‌ లోక్‌సభ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ బుధవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఇలాంటి నమూనా పోలింగ్‌ కేంద్రాలను మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కవిత అన్నారు. వీలైతే ఓటింగ్‌ యంత్రాలకు నంబర్లు వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఆమె చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.