close

50% వీవీప్యాట్‌లు లెక్కించాల్సిందే

వీవీప్యాట్‌ల గణనపై విపక్షాల సమైక్య గళం
ఎన్నికల సంఘం స్పందించాలి
లేదంటే సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేస్తాం
రూ.9వేల కోట్లు ఖర్చుపెట్టి లెక్కించకపోతే ఏం లాభం?
చంద్రబాబు నేతృత్వంలో దిల్లీలో ప్రతిపక్షాల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో గెలిచేది మేమే. ఈవీఎంలపై పోరాడుతుంటే నేను ఓడిపోతాననే భయంతోనే ఇలాంటివి చేస్తున్నానని ఆరోపిస్తున్నారు. తెదేపా గెలుపుపై నాకు ఎలాంటి అనుమానం లేదు. 200 శాతం కాదు వెయ్యి శాతం గెలిచేది మేమే. పారదర్శక వ్యవస్థ కోసమే మా పోరాటం.
- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు - దిల్లీ

న్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు, రాజకీయ పార్టీలకు విశ్వాసం కల్పించడానికి వీలుగా కనీసం 50% వీవీప్యాట్‌లను లెక్కించాల్సిందేనని 23 భాజపాయేతర పక్షాలు డిమాండు చేశాయి. దేశంలో ఈనెల 11వ తేదీన జరిగిన తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని 50% వీవీప్యాట్‌లను లెక్కించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం నేత నీలోత్పల్‌ బసు, ఎస్పీ నేత సురేంద్రసింగ్‌ నాగర్‌, జేడీఎస్‌ నేతలు స్పష్టం చేశారు. ఆదివారమిక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశమై 50% వీవీప్యాట్‌ల లెక్కింపు కోసం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలుచేసే అంశంపై చర్చించిన నేతలు అనంతరం అక్కడే జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశానికి కొన్ని పార్టీల నేతలే హాజరైనప్పటికీ తమ డిమాండుకు మొత్తం 23 పార్టీలు మద్దతిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటికీ దేశవ్యాప్తంగా పారదర్శక వ్యవస్థ తీసుకురావడం కోసమే తానీ పోరాటం మొదలుపెట్టానన్నారు.

18 దేశాల్లోనే ఈవీఎంలు
‘ప్రపంచంలోని 191 దేశాల్లో కేవలం 18 దేశాలే ఈవీఎంలకు వెళ్లాయి. జర్మనీలాంటి అభివృద్ధి చెందిన దేశం 2005-09 మధ్యకాలంలో ఈవీఎంలను ఉపయోగించి తర్వాత ఉపసంహరించుకుంది. నెదర్లాండ్స్‌ 1990-2007 మధ్యకాలంలో వీటిని ఉపయోగించి తర్వాత పేపర్‌ బ్యాలెట్‌కు వెళ్లింది. ఐర్లాండ్‌ 2002-04 మధ్యకాలంలో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి తర్వాత బ్యాలెట్‌కే పరిమితమైంది. ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి, పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓట్లు వేసుకోవడానికి, దూరం నుంచి కంట్రోల్‌ యూనిట్లను నియంత్రించడానికి, సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ను మార్చడానికి అవకాశం ఉందన్న ప్రమాదాన్ని గుర్తించే ఆ దేశాలు ఈవీఎంల వినియోగాన్ని మానుకున్నాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

పార్లమెంటుకూ తెలీదు
‘ఈవీఎంల వినియోగంలో ఎలాంటి ప్రక్రియ దాగి ఉందన్న విషయం పార్లమెంటుకు తెలియదు. పోగ్రామింగ్‌లో తప్పులు జరగడానికి, యంత్రం పని చేయకుండా పోవడానికి, మోసపూరితంగా ట్యాంపరింగ్‌ చేయడానికి అవకాశాలున్నట్లు ప్రముఖ శాస్త్రవేత్తలు, వృత్తి నిపుణులు అంగీకరించారు. సాంకేతికతను ఉపయోగించుకుని ఎన్నికల ప్రక్రియను ఎలా దుర్వినియోగం చేయొచ్చన్న విషయాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయటపడ్డాయి. ఇలాంటి అనుమానాలను నివృత్తిచేసి ప్రజలకు నమ్మకం కల్గించాలంటే 50% వీవీప్యాట్‌లను లెక్కించాలి’ అని బాబు డిమాండు చేశారు.

ఓటుహక్కు కోసం రెండు సార్లు తిరగాల్సి వచ్చింది
‘ఏపీ ఎన్నికల్లో ప్రతిచోటా సమస్యలొచ్చాయి. 20-30% వీవీప్యాట్లు పని చేయలేదు. వాటిని సరి చేయడానికి 2 నుంచి 6 గంటల సమయం పట్టింది.  సీఈవో కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి 2 సార్లు తిరగాల్సి వచ్చింది. తెల్లవారుజాము 4.30 గంటలవరకు ఓటింగ్‌ నిర్వహించడం ఏ ప్రజాస్వామ్యం. కొందరు ఓటర్లు 10 నుంచి 12 గంటలపాటు ఓట్ల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో విసిగి వేసారిన మహిళలు ఈసీని శపించారు. వీవీప్యాట్‌ స్లిప్‌ 7 సెకన్లపాటు కనిపిస్తుందని ఈసీఐ చెప్పినా వాస్తవంగా అక్కడ 3 సెకన్లే కనిపించింది. మేం దీని గురించి శనివారం ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్‌ అరోడా దగ్గర ప్రస్తావిస్తే సమాధానం లేదు.’ అని బాబు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ముందు ఈసీ అబద్ధాలు
‘వీవీప్యాట్‌ల లెక్కింపునకు గరిష్ఠంగా 24 గంటలకు మించి సమయం పట్టకపోయినా ఈసీఐ 6 రోజులు పడుతుందని సుప్రీంకోర్టు ముందు అబద్ధమాడింది. అందుకే 23 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి 50% వీవీప్యాట్‌ల లెక్కింపును డిమాండు చేస్తున్నాయి. 50% తర్వాత ఏమైనా తేడాలొస్తే 100% వీవీప్యాట్‌లను లెక్కించాలి. ప్రస్తుతం ఒక్కో కౌంటింగ్‌ సెంటర్లో 14 నుంచి 16 టేబుళ్లుంటాయి కాబట్టి 3 గంటల్లో 50% వీవీప్యాట్‌లను లెక్కించొచ్చు. అయినా సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం ఎందుకు అబద్ధం చెప్పిందో అర్థం కావడం లేదు. మేం 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నాం. వీవీప్యాట్‌ల కోసం పోరాడి సాధించాం. 5 వీవీప్యాట్‌లను లెక్కించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో మేం సంతృప్తి చెందలేదు. అందువల్ల మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాం’. అని చంద్రబాబు వెల్లడించారు. ఆయన ఏపీలో ఎన్నికల జరిగిన తీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

విశ్వాసం కలిగేవరకు వీవీప్యాట్‌లను లెక్కించాలి
- అభిషేక్‌ సింఘ్వీ, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి
ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం కలిగించేంత స్థాయిలో వీవీప్యాట్‌లను లెక్కించాలి. 50% లెక్కించాలంటే 6 రోజుల సమయం పడుతుందన్న ఎన్నికల సంఘం వాదన హాస్యాస్పదం. గతంలో బ్యాలెట్‌ పేపర్‌ ఉన్నప్పుడు 10, 12 గంటల్లో లెక్కింపు పూర్తయ్యేది. వీవీప్యాట్‌ అనివార్యమని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాని ప్రకారం తొలుత 20, 30% ఈవీఎంలకే వీవీప్యాట్‌లను ఏర్పాటు చేశారు. తర్వాత పార్టీల పోరాట ఫలితంగా నాలుగేళ్లలో ఆ సంఖ్య 100%కి చేరింది.

ఎవరికి ఓటు వేసిందీ తెలియడం లేదు
- కపిల్‌ సిబల్‌, కాంగ్రెస్‌ నేత
మాకు ఓటర్ల మీద నమ్మకం ఉంది తప్పితే మిషన్ల మీద కాదు. ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తికి తాను ఎవరికి ఓటేసిందీ తెలియడం లేదు. కౌంటింగ్‌లో తన ఓటు లెక్కించారా? లేదా? అన్నది కూడా అంతు చిక్కడం లేదు. ఈ రోజుల్లో 20-30% ఈవీఎం యంత్రాలు పనిచేయడం లేదు. అందువల్ల ప్రజలు తెల్లవారుజాము వరకు ఓటేయాల్సి వస్తోంది. ఒకరికి ఓటేస్తే అది వేరేవాళ్లకు వెళ్తున్న విషయం బిజ్నోర్‌లో బయటపడింది. 75% ఓటర్లు వీవీప్యాట్‌లను లెక్కించాలని డిమాండ్‌ చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుపుల్ల వేస్తోంది.

ఫ్రిజ్‌లు, టీవీలూ  చెడిపోవటంలేదే.. ఈవీఎంలే ఎందుకు?
- అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి
ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేదు. మేం ప్రచారానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఇదే చెబుతున్నారు. ప్రజలకు విశ్వాసంలేని ఇలాంటి వ్యవస్థ ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ రోజు దేశంలోని అన్ని పార్టీల నేతలు, ప్రజలు 50% వీవీప్యాట్‌లను లెక్కించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్క భాజపా తప్ప మిగతా పార్టీలన్నీ ఇదే డిమాండుతో ఉన్నాయి. దేశంలో ప్రజలు రోజు కొన్ని లక్షల ఫ్రిజ్‌లు, టీవీలు కొనుగోలు చేస్తుంటారు. అందులో ఎప్పుడైనా 20-30% చెడిపోయిన సందర్భాలున్నాయా? ఉంటే ఆ కంపెనీ మూసుకోవాల్సిందే. ఈవీఎంలను ఉద్దేశపూర్వకంగా చెడగొట్టి ప్రతిపక్షాలకు ఓట్లు పడకుండా చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ అనుమానాలున్నాయి
- సురేంద్రసింగ్‌ నాగర్‌, ఎస్పీ నేత
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తొలిదశ పోలింగ్‌ సమయంలో సామాన్య ఓటరు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌లలో ఓటింగ్‌ ముద్ర 7 సెకన్లపాటు కనిపించాల్సి ఉన్నా మెరుపు వేగంతో అది కనుమరుగవుతున్నట్లు ఓటర్లు చెప్పారు.

10 రోజులైతే ఏం?: జేడీఎస్‌
వీవీప్యాట్‌ల లెక్కింపునకు 5 రోజుల సమయం పడుతుందని ఈసీఐ చెబుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు 5 రోజులు కాకపోతే 10 రోజుల సమయం తీసుకుంటే వచ్చే నష్టమేంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తేడాలు
- సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ ప్రధాన కార్యదర్శి
ఏపీలో 800 బూత్‌లలో ఈవీఎంల సమస్యలొచ్చాయి. తెలంగాణలో 300 బూత్‌లలో ఇలాంటి సమస్య వచ్చింది. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య చాలా తేడా వచ్చింది. చాలాచోట్ల గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే ఈ ఓట్ల తేడా ఎక్కువ ఉంది. దీనికి 50% వీవీప్యాట్‌లను లెక్కించడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదు.

పారదర్శకత కోసం తప్పదు
- నీలోత్పల్‌ బసు, సీపీఎం
ఈనెల 11న జరిగిన తొలి దశ ఎన్నికల్లో తలెత్తిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని 50% వీవీప్యాట్‌లను తప్పనిసరిగా లెక్కించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనగలడంతోపాటు, పారదర్శకత వస్తుంది.


కన్నడనాట నేడు చంద్రబాబు ప్రచారం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ మిత్రపక్షాల అభ్యర్థి, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామి తరఫున మండ్యలో ఆయన ప్రచారం చేస్తారు. మండ్య జిల్లా పాండవపురలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి,  దివంగత కన్నడ నటుడు అంబరీశ్‌ సతీమణి సుమలత పోటీ చేస్తున్నారు. సుమలతకు భాజపా భేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.