close

ప్రతి శాఖలో ఫిర్యాదుల విభాగం

పంచాయతీ నుంచి సచివాలయం వరకు అత్యుత్తమ సేవలే లక్ష్యం
జవాబుదారీగా యంత్రాంగం
పురపాలక చట్టం కోసం త్వరలో శాసనసభ సమావేశం
  గవర్నర్‌తో భేటీలో సీఎం కేసీఆర్‌
  మూడు గంటల పాటు చర్చలు
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ ప్రజల కోణంలో పాలనా సంస్కరణలను చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అత్యుత్తమ సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని వివరించారు. ‘ప్రతి శాఖలోనూ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తాం. ఎవరైనా లంచాలు అడిగినా, సేవలు సరిగా అందించకున్నా సత్వర చర్యలు ఉంటాయి. దళారులు, లంచాల బెడద లేకుండా ప్రజలు నేరుగా సేవలు పొందేలా చేస్తాం. పౌరసేవలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. అనుమతులు, ఇతర అంశాలకు సంబంధించి ఏ మాత్రం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. పాలనాపరమైన ఆటంకాలు లేకుండా అధికారిక వ్యవస్థలోనూ మార్పులు చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో ఆరుగురు అధికారుల బృందానికే అన్ని బాధ్యతలు అప్పగించి, వారి ద్వారా సేవలందిస్తాం’ అని వివరించారు. ముఖ్యమంత్రి ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో చేపట్టనున్న పాలనా సంస్కరణల గురించి కేసీఆర్‌ ఆయనతో చర్చించారు. ‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలు చేపట్టాలని భావించాం. అధికారుల కొరత, ఇతర సమస్యలకు తోడు కొత్త జిల్లాలను ప్రారంభించడం వంటి కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు సమయం ఆసన్నమయింది. ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించడానికి వీలుగా కొత్త చట్టాలు చేయడంతో పాటు విధానాల్లో మార్పులకు పూనుకుంటున్నాం. రెవెన్యూ శాఖ  ప్రజలందరికీ సంబంధం ఉండేది. ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ, సత్వర రిజిస్ట్రేషన్‌ వంటివి చేపట్టాం. ఇవి సంపూర్ణం కాలేదు. ఇంకా క్షేత్ర స్థాయి సమస్యలున్నాయి. ప్రధానంగా లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఒక్క రెవెన్యూయే గాక రాష్ట్రంలోని ఏ ఒక్క శాఖలోనూ అవినీతి ఉండరాదు. దీనికి అనుగుణంగా కొత్త చట్టాలు రూపొందించాలని నిర్ణయించాం. పట్టణాలకు, నగరాలకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్యమైంది. దీనిలోనూ ఎన్నో సమస్యలున్నాయి. ప్రజలకు సేవలు, అనుమతులు, అభివృద్ధికి సంబంధించిన వాటికి జవాబుదారీ తనం ఉండాలి. ఇందుకోసం కొత్త పురపాలక చట్టాన్ని తేవాలనుకుంటున్నాం. దీనిపైనా కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ, పురపాలక చట్టాలు దేశంలోనే ఆదర్శమైనవిగా పేరు పొందేలా వాటిని రూపొందిస్తున్నాం.

ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని శాసనసభ సమావేశాలు!
పురపాలక బిల్లు రూపొందించిన తర్వాత ఆమోదం కోసం సత్వరమే శాసనసభ సమావేశాలను నిర్వహించాలనే యోచన ఉంది. దీని కోసం ఎన్నికల సంఘం అనుమతి కోరతాం. ఎన్నికల నియామావళి అమల్లో ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నాం’’ అని సీఎం గవర్నర్‌కు వివరించారు. సీఎం ఆలోచనల వెల్లడి సందర్భంగా గవర్నర్‌ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ తదితర చోట్ల పోలింగ్‌ శాతాలు తక్కువగా నమోదవడం ఇతర అంశాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సీఎం భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం రాత్రి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ను ఆయన నివాసంలో కలిశారు. గంట సేపు వీరి మధ్య సమావేశం జరిగింది. హైకోర్టు వసతులు, సౌకర్యాలు, న్యాయమూర్తుల నియామకాల వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. సీఎం మర్యాదపూర్వకంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారని అధికారవర్గాలు వెల్లడించాయి.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.