close
మీరే ఎంచుకోండి.. గెలిపించుకోండి 

డీసీసీలకు అభ్యర్థుల ఎంపిక అధికారం 
పార్టీ ఫిరాయిస్తే ఓటరు లేదా పార్టీ చర్యలు తీసుకోవచ్చు 
అభ్యర్థుల నుంచి అఫిడవిట్‌ తీసుకోవాలని నిబంధన 
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై పీసీసీ కీలక భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీఎసీ ఎన్నికల్లో టికెట్లను ఇచ్చే అధికారాన్ని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)లకు అప్పగించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బలమైన అభ్యర్థులు, గెలిచే అవకాశాలు ఉన్నవారిని ఎంపిక చేసి వారికి బీ-ఫారంలు అందచేసే బాధ్యతను డీసీసీ అధ్యక్షులకు ఇచ్చింది. గాంధీభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 32 డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్‌ తరఫున ఏ-ఫారంలు అందచేశారు. ఏ-ఫారంలు అందుకున్న డీసీసీ అధ్యక్షులు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారంలు ఇవ్వనున్నారు. ఏ-ఫారంలను డీసీసీ అధ్యక్షులు సోమవారం జిల్లా ఎన్నికల అధికారులకు అందచేయాల్సి ఉంటుంది. 
ప్రమాణపత్రం తీసుకోవాలి 
మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి అభ్యర్థులకు బీ-ఫారంలు అందచేస్తారు. పార్టీ తరఫున అభ్యర్థిగా ఎంపికై బీ-ఫారం అందుకునే వారి నుంచి విధిగా రూ.20 స్టాంపు పేపర్‌తో ప్రమాణపత్రం (అఫిడవిట్‌) తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులకు స్పష్టం చేశారు. ప్రమాణపత్రం నమూనాను డీసీసీ అధ్యక్షులకు అందచేశారు. కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేల్లో పది మంది ఇప్పటికే తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించి పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ ఎన్నికల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ బీ-ఫారం తీసుకున్నవారి వద్ద నుంచి ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమని, పార్టీ విప్‌లు, ఆదేశాలను ధిక్కరించేది లేదని ప్రమాణపత్రం (అఫిడవిట్‌) తీసుకోనున్నారు. 
గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమావేశమై జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాం, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలతోపాటు గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో వివాదాలుంటే స్థానికంగానే పరిష్కరించుకోవాలని తప్పనిసరి అయితేనే పీసీసీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపికతోపాటు ఇతర అంశాల్లో డీసీసీలకు పీసీసీ నియమించిన సమన్వయకర్తలు తోడ్పాటును అందిస్తారని తెలిపారు. సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్‌ నేత జానారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, కె.కుసుమకుమార్‌, డీసీసీ అధ్యక్షులు, జిల్లా సమన్వయకర్తలు పాల్గొన్నారు. 
మరో ముగ్గురు సమన్వయకర్తలు 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఇన్‌ఛార్జిగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను నియమించారు. రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పీసీసీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డిని, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.జగదీశ్వరరావు, ఆదిలాబాద్‌కు అధికార ప్రతినిధి బండి నర్సాగౌడ్‌ను నియమించారు. 
ప్రమాణ పత్రంలో పేర్కొన్న అంశాలు 
ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తాను. 
జడ్పీ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ల ఎన్నికల్లో కాంగ్రెస్‌ మార్గదర్శకాల మేరకు ఓటు వేస్తాను. 
పదవీకాలంలో కాంగ్రెస్‌ నిర్ణయాలను గౌరవించని పక్షంలో పార్టీ తీసుకునే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు లేదంటే రెండింటికి బాధ్యుడవుతాను. 
జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్‌పర్సన్‌ ఎన్నికల్లో పార్టీ మారను, ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వను. 
పార్టీ జారీ చేసే విప్‌లు, నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను. పదవీకాలంలో ఏఐసీసీ, టీపీసీసీ తీసుకునే అన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను. 
ప్రజా సేవకుడిగా రాతపూర్వకంగా అంగీకరిస్తున్న అంశాలను ఉల్లంఘిస్తే పార్టీ తీసుకునే చర్యలకు బాధ్యుడిగా ఉంటా. పార్టీ మారినా, ఆదేశాలు ధిక్కరించినా విశ్వాసఘాతుక చర్యలుగా భావించి ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో ఓటర్లు నాపై సివిల్‌, క్రిమినల్‌చర్యలు తీసుకునేందుకుకట్టుబడి ఉంటాను.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.