close
అధ్యయనం తర్వాతే మార్పులు 

పలు దేశాలు అనుసరిస్తున్న విధానాల పరిశీలన 
రెవెన్యూ కొత్త చట్టం రూపకల్పనకు కసరత్తు 
సీఎస్‌ ఆధ్వర్యంలో అధికారులు, నిపుణులతో కమిటీ 
ఈనాడు - హైదరాబాద్‌

రెవెన్యూ చట్టంలో మార్పులు తెచ్చేందుకు సంకల్పించిన ప్రభుత్వం దీనికోసం ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేపట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) స్థానంలో కంక్లూజివ్‌ టైటిల్‌ చట్టం తీసుకొచ్చేందుకు ఇప్పటికే కొంత కసరత్తు చేసిన అధికారులు దీనిపై మరింత అధ్యయనం చేసేందుకు ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వ్యవసాయ భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు 2017 సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు క్షేత్రస్థాయిలో భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) నిర్వహించారు. అనంతరం నవీకరించిన దస్త్రాలను ఆన్‌లైన్‌ చేసి ధరణి పోర్టల్‌కు మార్చారు. పోర్టల్‌లోని సమాచారం ఆధారంగా టైటిల్‌ గ్యారంటీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఇంకా ఏయే సంస్కరణలు తేవాలనే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ 
రెవెన్యూ కొత్త చట్టం, అమలు విధివిధానాలను తయారు చేసేందుకు అవసరమైన రూట్‌మ్యాప్‌ను రూపొందించనున్నారు. దీనికన్నా ముందు చట్టం రూపురేఖలపై ముసాయిదా(డ్రాఫ్ట్‌) రూపకల్పనకు ఇప్పటికే టైటిల్‌ చట్టాలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు టైటిల్‌ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా, స్విట్జర్లాండ్‌తోపాటు సాంకేతికంగా అభివృద్ధి చెందిన పలు దేశాల్లోనూ అమల్లో ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి, సాంకేతిక సంస్థల బాధ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయశాఖకు చెందిన అధికారితోపాటు ప్రభుత్వ సలహాదారు, పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు(కలెక్టర్‌లు కూడా), రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న నిపుణలను కూడా కమిటీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 
ప్రత్యామ్నాయ ఆలోచనలు 
కొత్త చట్టం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తుండగా ఎలాంటి విధానాలను ఆకళింపు చేసుకోవాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్న అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. కంక్లూజివ్‌ టైటిల్‌ యాక్ట్‌ తీసుకొస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భూముల పరిస్థితులు ఎంత వరకు అనుకూలంగా ఉంటాయి, ధరణి పోర్టల్లో ఉన్న సమాచారంతో ఎంత వరకు చట్టాన్ని అమలు చేయొచ్చని సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఒక వేళ స్పష్టత ఉన్న భూములకు మాత్రమే టైటిల్‌ను అమలు చేసి మిగిలిన భూములకు కాలక్రమంలో వర్తింపచేసేలా విధానాలు అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అసలు రాష్ట్రంలో ఉన్న భూముల పరిస్థితి ఏంటి? వివాదాలు, ఇతర సమస్యలతో స్పష్టత రానివి ఎన్ని ఉన్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలనే కోణంలోనూ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముసాయిదాను రూపొందించే పని చేపట్టి దానికి సమాంతరంగా భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.