close
ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి

దిల్లీ: ఉగ్రదాడిని దేశాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు ఖండించారు. దారుణంపై దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆపన్నహస్తం అందించడానికి ముందుకొచ్చారు. మారణకాండను ఖండించిన దేశాల్లో అమెరికా, బ్రిటన్‌, రష్యా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, బహ్రెయిన్‌, ఖతర్‌ తదితర దేశాలు ఉన్నాయి. ‘‘చర్చిలు, హోటళ్లపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు అమెరికా ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఎలాంటి సాయానికైనా మేం సిద్ధం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దాడులు భయానకమని బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు పవిత్ర దినమైన ఈస్టర్‌ పండుగ రోజున విధ్వంసకరమైన బాంబుపేలుళ్లు జరగడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనీ గుటరెస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేరస్థులను శ్రీలంక ప్రభుత్వం వీలైనంత త్వరగా చట్టం ముందు నిలుపుతుందని ఆకాంక్షించారు.

ఖండించిన తమిళపార్టీలు

చెన్నై: శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లను తమిళపార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. తమిళులు కూడా ఎక్కువగా నష్టపోయారని నాయకులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రార్థనలు చేయడానికి గుమికూడిన అమాయకప్రజలపై ఉగ్రవాదులు పిరికితనంతో బాంబుపేలుళ్లు జరిపారని అధికార అన్నాడీఎంకే విమర్శించింది. పేలుళ్లు వర్ణించలేని బాధకు కారణమయ్యాయని, నిర్దయగా చేసిన దాడులను తలచుకుంటుంటేనే ఎవరి శరీరమైనా భయంతో వణుకుతోందని వ్యాఖ్యానించింది. తమిళ క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. బాధితులకు బాధను ఓర్చుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని పార్టీ అగ్రనాయకులు ఒ.పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సెయింట్‌ ఆంటోనీ చర్చి పరిసర ప్రాంతాల్లో తమిళులు ఎక్కువగా జీవిస్తున్నారని అన్నాడీఎంకే అధినేత వైకో తెలిపారు. పేలుళ్లకు కారణమైన నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. పేలుళ్లు పిరికిపందల పనేనని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగమ్‌ నాయకుడు టి.టి.వి.దినకరన్‌ అభివర్ణించారు. అనాగరికమైన ఇలాంటి చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. అందరినీ ప్రేమించమని ప్రబోధించిన జీసస్‌ పునరుత్థానం రోజైన ఈస్టర్‌ను స్మరించుకుంటూ జరుపుకుంటున్న పండుగనాడు పేలుళ్లు జరగడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు పీఎంకే అధినేత ఎస్‌.రామదాస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంకలో చిక్కుకుపోయిన తమిళులు సహా భారతీయులందర్నీ క్షేమంగా మనదేశానికి తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నా గుండె పగిలింది: స్టాలిన్‌

పండుగరోజు ఉగ్రవాదుల మారణకాండ గురించి తెలిసి తన గుండె బద్దలైపోయిందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ పేర్కొన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈస్టర్‌రోజున దాడులతో ఈలం తమిళులు, మైనార్టీలలో శాశ్వత భయం నెలకొందన్నారు.
 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.