close
సదస్సులు రోడ్లపై పెట్టుకోవాలా? 

పాలన నిరంతర ప్రక్రియ 
మోదీ, కేసీఆర్‌ల సమీక్షల్ని అడ్డుకోరేం? 
వైకాపాపై ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజం 
మోదీ మళ్లీ ప్రధాని కావడం అసాధ్యమని వ్యాఖ్య 
ఈనాడు - అమరావతి

పేదల సంక్షేమం, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ, కరవు సహాయక చర్యలకూ వైకాపా అడ్డంకులు సృష్టిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పరిపాలన నిరంతర ప్రక్రియని, ఎలా ఆపుతారని ప్రశ్నించారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో ప్రజా సమస్యలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడారు. ‘ఈ సదస్సుకూ ఆటంకాలు సృష్టించేందుకు కోడికత్తి పార్టీ ప్రయత్నించింది. అంటే ముఖ్యమంత్రి రోడ్లపై సదస్సులు పెట్టుకోవాలా? తెలంగాణలో జరిగే అధికారిక సమావేశాల్ని, ప్రధాని సదస్సుల్నీ వారు ఎందుకు అడ్డుకోరు’ అని వైకాపాపై మండిపడ్డారు. ‘ఒక పక్క భాజపా, తెరాస, వైకాపాల అప్రజాస్వామిక పోకడలపైనా, మరోపక్క ప్రజా సమస్యలపైనా పోరాడుతున్నాం. ఫలితాలు వెలువడేంతవరకు అప్రమత్తంగా ఉండాలి’ అని సీఎం సూచించారు. ఈ ఎన్నికల్లో తెదేపా నూటికి వెయ్యిశాతం గెలవబోతోందని, ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం అసాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులు, తాగునీటి ఎద్దడి, అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంతోపాటు, ఇటీవల ఎన్నికలు జరిగిన విధానం, ఈవీఎంలు మొరాయించడం, తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై దాడుల వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థులతో ఆయన సమీక్షలు జరిపారు. ఉదయం 11.30 గంటలకు సమావేశం మొదలు కాగా... అర్ధరాత్రి వరకూ సమీక్షలు కొనసాగాయి. ‘ఎన్నికలు అయిపోయాయని అనుకోవద్దు. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. మీరంతా రాబోయే నెల రోజులు నియోజకవర్గాల్లో తిరగాలి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించి వారికి ప్రభుత్వపరంగా సహకారం అందేలా చూడాలి’ అని పార్టీ అభ్యర్థులు, నాయకులకు సీఎం సూచించారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, చలివేంద్రాలు నిర్వహించాలని, పశుగ్రాసం కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. 
ఇంత దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు 
‘1975 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇంత దుర్మార్గ రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ను లక్ష్యంగా పెట్టుకుని భాజపా నాయకులు అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో వైకాపా విపరీతంగా డబ్బులు వెదజల్లింది. కానీ డబ్బు, హింస, దౌర్జన్యం ఏదీ పని చేయలేదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో సీబీఎన్‌ ఆర్మీ బలమైన శక్తిగా బయటకు వచ్చింది.  కుప్పంలోనే 3,200 మంది పని చేశారు. రాష్ట్రం మొత్తం మీద 70-80వేల మంది పనిచేశారు’ అని పేర్కొన్నారు. మోదీపై వ్యతిరేకత దేశవ్యాప్తంగా ప్రస్ఫుటంగా కనిపిస్తోందని, కర్ణాటక, తమిళనాడుల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడూ ఆ విషయాన్ని తాను గ్రహించానని తెలిపారు. 
ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండండి 
ఓట్ల లెక్కింపు సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి రౌండ్‌లోనూ అవసరాన్ని బట్టి అప్పటికప్పుడే ఫిర్యాదు చేయాలని చంద్రబాబు అభ్యర్థులకు సూచించారు. ఏజెంట్లు చివరి ఓటు లెక్కించేవరకు ఓపికగా ఉండాలని చెప్పారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.