close
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా 

ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం 
మూల్యాంకనంలో పొరపాట్ల నివారణకు మరిన్ని కఠిన చర్యలు 
పునఃపరిశీలనలో మార్కులు పెరిగితే రుసుం వెనక్కి ఇచ్చే ఆలోచన 
‘ఈనాడు’ ముఖాముఖిలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి 
ఈనాడు - హైదరాబాద్‌

‘మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఏ ఒక్క విద్యార్థీ అనుకోకూడదు. అందుకు దోష రహిత మూల్యాంకనం కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాం’ అంటున్నారు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి. మూల్యాంకనంలో తప్పు చేస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, తప్పామని ఎవరూ కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని...అన్నిటి కంటే జీవితం ఎంతో విలువైనదని ఆయన విద్యార్థులకు సూచించారు. ఇంటర్‌ ఫలితాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆయన సోమవారం ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 
మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. దీనివల్ల మూల్యాంకనంపై నమ్మకం సన్నగిల్లదా? 
ఏటా మాదిరిగానే ఈసారీ మూల్యాంకనం జరిపాం. జవాబుపత్రాలను అనర్హులతో దిద్దించలేదు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థులతో చెలగాటం ఆడటం తగదు. ఏమైనా అలాంటివి జరిగినట్లు మా దృష్టికి తెస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అప్రమత్తంగా ఉండాలని...నిర్లక్ష్యం చూపకుండా ఉండేందుకు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి తక్కువ వచ్చినట్లయితే మూల్యాంకనం చేసిన అధ్యాపకుడికి(10 మార్కులకు మించి వ్యత్యాసం ఉంటే) రూ.5 వేల జరిమానా విధిస్తున్నాం. ఈ విధానం ఎన్నో సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. మూల్యాంకనంలో పొరపాట్లను తగ్గించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. 
ఇంటర్‌ బోర్డు తప్పు చేసి పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోమంటున్నారు? ఇది అన్యాయం కాదా? 
మొత్తం 9.70 లక్షల మంది విద్యార్థులు. ఒక్కో విద్యార్థివి ఆరు జవాబుపత్రాలు. అంటే దాదాపు 60 లక్షల జవాబుపత్రాలను దిద్దాలి. మానవ తప్పిదాలు జరగకుండా ఉండేందుకే జరిమానా విధిస్తున్నాం. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాం. పునఃలెక్కింపునకు ఒక్కో పేపర్‌కు రూ.100, పునఃపరిశీలనకు రూ.600 రుసుంగా చెల్లించాలి. ఆ రుసుంను దాదాపు 15 సంవత్సరాల క్రితం నిర్ణయించాం. ఇప్పుడు దాన్ని తగ్గించాలని, తీసేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. దానివల్ల లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వారికి సకాలంలో స్కాన్‌ చేసిన పత్రాలను అందించడం సాధ్యం కాదు. విద్యార్థులు ఈనెల 25వ తేదీ వరకు బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది మార్చి ఫలితాలకు 17,491, 2017 మార్చిలో 16,680 మంది పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు పునఃలెక్కింపునకు దరఖాస్తు చేశారు. ఈసారి ఇప్పటివరకు 4,400 దరఖాస్తులొచ్చాయి. 
ఫలితాల ప్రక్రియపై టెండర్‌ దక్కించుకున్న గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థకు తగిన నైపుణ్యం లేదని.. అర్హతలు లేకున్నా ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా? 
ఇప్పటివరకు వాటిని ఆరోపణలు గానీ భావిస్తున్నాం. తగిన నైపుణ్యం ఉందా? లేదా? సాఫ్ట్‌వేర్‌ సక్రమంగా రూపొందించారా? లేదా? ఫలితాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయా? తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకే ముగ్గురు నిపుణులతో కమిటీ నియమించాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చాక బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటాం. 
ఫలితాల తేదీని ముందుగా ప్రకటించకపోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఏటా గందరగోళం నెలకొంటోంది. ముందుగా తేదీ వెల్లడి అసాధ్యమా? 
ఫలితాల తేదీని కచ్చితంగా ఫలానా రోజు విడుదల చేస్తామని చెప్పడం కుదరదు. ఒక వేళ ముందుగా ప్రకటిస్తే అనుకోని అవాంతరాలు ఎదురైతే ఇబ్బందవుతుంది. కాకపోతే వచ్చే ఏడాది నుంచి సుమారు ఏ తేదీ తర్వాత విడుదల చేస్తాయో వెల్లడిస్తాం. ఒకటీ రెండు రోజులు ఆలస్యమైతే వచ్చే నష్టమేమీ లేదు.

తప్పామని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 
ఆత్మహత్యలు బాధాకరం.ప్రతి ఒక్కరూ ప్రయత్నలోపం లేకుండా 100 శాతం కృషిచేయాలి. జీవితంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్‌లో తప్పితే మళ్లీ పరీక్ష రాసి విజేతగా నిలవాలి. ఒకవేళ ఇంటర్‌బోర్డు తప్పు వల్ల తప్పితే దాన్ని సరిచేసుకోవచ్చు. ఇతరులు ఏమనుకుంటారో? కుటుంబ సభ్యులు ఏమంటారోనని అఘాయిత్యాలకు పాల్పడవద్దు. అప్పుడు పూడ్చలేని నష్టం జరుగుతుంది. ఆసక్తి ఉన్న కోర్సులను చదువుకుంటామని పెద్దల్ని ఒప్పించండి. పెద్దలు కూడా పిల్లలపై ఇష్టం లేని కోర్సులను, గ్రూపులను ఎంచుకోమని ఒత్తిడి చేయొద్దని నా మనవి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.