close
ఫుల్‌కోర్టు జోక్యం అవసరం 

తనపై ఆరోపణలను తనే విచారించుకోవడం తగదు 
‘సీజేఐ’ని తప్పుబట్టిన న్యాయవాద సంఘాలు

దిల్లీ: తనపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి వ్యవహరించిన తీరును అత్యున్నత న్యాయస్థానానికి చెందిన రెండు న్యాయవాదుల సంఘాలు తప్పుబట్టాయి. విధానపరంగా అవ్యవస్థ చోటు చేసుకుందని, చట్ట నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నాయి. ఆరోపణలపై చట్టప్రకారం దర్యాప్తు జరపడానికి ‘‘ఫుల్‌ కోర్టు’’ జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డు అసోసియేషన్‌ (ఎస్‌సీఏఓఆర్‌ఏ), సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) కోరాయి. ఆరోపణలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌, సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియాలో వచ్చిన సమాచారాన్ని తన తరువాతి సమావేశంలో పరిశీలించడానికి ఫుల్‌కోర్టు సేకరించాలని ‘ఎస్‌సీబీఏ’ ఓ ప్రకటనలో పేర్కొంది. జస్టిస్‌ రంజన్‌గొగొయి గత ఏడాది అక్టోబరులో తనను రెండుసార్లు లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఆరోపించడంతో.. ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జస్టిస్‌ అరుణ్‌మిశ్ర, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్‌ 20న విచారించిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థ స్వతంత్రత బలోపేతం అవ్వాలన్నా, ‘సీజీఐ’పై ఆరోపణల్లో నిజానిజాలు తెలియాలన్నా నిష్పాక్షిక దర్యాప్తు ఒక్కటే మార్గమని సీనియర్‌ అడ్వొకేట్‌, ప్రముఖ న్యాయనిపుణుడు రాకేశ్‌ ద్వివేది పేర్కొన్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సీజేఐ’కి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) మద్దతుగా నిలవడాన్ని విమర్శిస్తూ గౌతం భాటియా, ఆశిష్‌ గోయల్‌ అనే ఇద్దరు సుప్రీంకోర్టు అడ్వొకేట్లు సోమవారం బీసీఐ ఛైర్‌పర్సన్‌ మనన్‌కుమార్‌ మిశ్రకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అంతర్గత కమిటీతో దర్యాప్తు చేయించాలన్నారు. కానీ ‘సీజేఐ’ తన పరిపాలన అధికారాలతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారని, అందులో ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారని.. ఇదంతా న్యాయవ్యవస్థను అవహేళన చేయడమేనని అభిప్రాయపడ్డారు. 
‘సీజేఐ’కి మద్దతు 
‘సీజేఐ’ జస్టిస్‌ రంజన్‌గొగొయికి సుప్రీంకోర్టు ఉద్యోగుల సంక్షేమ సంఘం మద్దతుగా నిలిచింది. న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చేలా చేసిన ‘‘తప్పుడు, కల్పిత, నిరాధార ఆరోపణలు’’ను ఖండిస్తున్నట్లు సంఘం సోమవారం విడుదల చేసిన తీర్మానంలో పేర్కొంది. అఖిలభారత అసోం విద్యార్థుల సంఘం (ఏఏఎస్‌యూ) కూడా ‘సీజేఐ’కు మద్దతుగా నిలిచింది. ‘సీజేఐ’పై వచ్చిన లైంగిక ఆరోపణలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ స్పందించాలని కోరుతూ దిల్లీకి చెందిన ‘‘ప్రగతిశీల్‌ మహిళా సంఘటన్‌’’ అనే మహిళా సంస్థకు చెందిన మహిళలు సుప్రీంకోర్టు ఎదుట ఆందోళన నిర్వహించారు. సీజేఐ తరువాత సీనియర్‌ న్యాయమూర్తులు నిష్పాక్షిక, నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపేలా ఆదేశించాలని డిమాండు చేశారు. 
అన్ని ధర్మాసనాల్లో కోర్టు ప్రక్రియ ఆలస్యం 
సుప్రీంకోర్టులోని అన్ని ధర్మాసనాల్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన విచారణ ప్రక్రియ 15 నిముషాలు ఆలస్యమై 10.45 గంటలకు ప్రారంభమైంది. కొందరు న్యాయమూర్తులు ‘సీజేఐ’పై వచ్చిన ఆరోపణలపై సమావేశం కానున్నారని, అందుకే కోర్టుప్రక్రియ ప్రారంభం కాలేదని వార్తలు వినవచ్చాయి. 
ముఖ్యమైన కేసుల విచారణ వాయిదా 
ఏప్రిల్‌ 23 నుంచి ‘సీజేఐ’ అధ్యక్షతన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చేపట్టాల్సిన ముఖ్యమైన కేసుల విచారణ నిరవధికంగా వాయిదా పడినట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సోమవారం తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.