close
కోర్టును అగౌరవపరిచే ఉద్దేశం లేదు 

ఉత్తర్వుల వక్రీకరణపై విచారం వ్యక్తం చేసిన రాహుల్‌

దిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుగా ఉటంకించానంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం విచారం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణలో రక్షణ శాఖ నుంచి అనధికారికంగా పొందిన పత్రాలను కూడా సాక్ష్యాలుగా ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే రాహుల్‌ మాత్రం ఎన్నికల ప్రచారంలో చౌకీదార్‌ నరేంద్ర మోదీయే దొంగ అంటూ సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. దీనిపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆధ్వర్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తాము మోదీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించడంతో ఆయన 26 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. ఎన్నికల వేడిలో తాను అలాంటి ప్రకటన చేశానని, దాన్ని ప్రత్యర్థులు దుర్వినియోగం చేశారని తెలిపారు. న్యాయస్థానం గౌరవాన్ని తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. భాజపా అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తుండడంతో దాన్ని అడ్డుకోవడానికే కేవలం రాజకీయపరంగా ఆ వ్యాఖ్య చేశానని తెలిపారు. ఆ సమయానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు చదవలేదని, మీడియాలో వార్తల ఆధారంగా హిందీలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆ మాటలన్నానని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను ప్రధాని కూడా వక్రీకరించారని, న్యాయస్థానం క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. 
అబద్ధాన్ని అంగీకరించినట్టే: భాజపా 
రఫేల్‌ వ్యవహారంలో మోదీపై చేసిన ఆరోపణలు అబద్ధాలేనని రాహుల్‌ అంగీకరించారని భాజపా అధికార ప్రతినిధి జి.వి.ఎల్‌.నరసింహారావు వ్యాఖ్యానించారు. కోర్టును అపఖ్యాతి పాల్జేయడానికి రాహుల్‌ ప్రయత్నించారని తేలిందని మీనాక్షి లేఖి అన్నారు. రాహుల్‌ సమర్పించిన ప్రమాణ పత్రానికి భాజపా వక్రభాష్యం చెబుతోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఖండించారు. ఒకే ఒక్క చౌకీదారే దొంగ అన్న తమ నినాదంలో మార్పు ఉండదని తెలిపారు. 
ప్రజా న్యాయస్థానంలో తేలుతుంది: రాహుల్‌ 
కమలం ముద్ర ఉన్న చౌకీదారే దొంగ అన్న విషయం ప్రజాన్యాయస్థానంలో తేలుతుందని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. పేదల సొమ్మును దోచుకొని ధనవంతులైన మిత్రులకు ఇచ్చినందుకు శిక్ష పడుతుందని తెలిపారు.

రఫేల్‌పై మోదీని నిలదీయండి 
అనిల్‌ అంబానీ మీకేమిచ్చాడని ప్రశ్నించండి: రాహుల్‌

అమేఠీ: ‘రూ.30 వేల కోట్ల రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అనిల్‌ అంబానీ కంపెనీకి మేలు చేసినందుకు ప్రతిఫలంగా మీకేం దక్కిందని ప్రధాని మోదీని నిలదీయండి’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం అమేఠీ పరిధిలో టిలోయిలో, బారాబంకీలో ఎన్నికల ప్రచారసభలోనూ రాహుల్‌ మాట్లాడారు. రఫేల్‌ కొనుగోలులో ఆయన (మోదీ) దొంగతనం బయటపడగానే మేమంతా కాపలాదారులమని ఆయన పల్లవి ఎత్తుకున్నారంటూ విమర్శించారు. ప్రధాని జీఎస్టీ తెచ్చి మీ జేబుల్లోంచి డబ్బులు తీసుకున్నారని, ఆ సొమ్ము మింగిన దొంగలు విదేశాలకు పోయి జల్సా చేస్తున్నారని మండిపడ్డారు. రోజూ 27 వేల మంది యువత ఉద్యోగాలు కోల్పోతుండటం మన చౌకీదార్‌ పనితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పంచాయతీల్లో యువతకు 10 లక్షల కొలువులు సృష్టిస్తాం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతాం’’ అని అన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.