close
ఉసురు తీసిన వర్షాలు 

వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృతి 
హైదరాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం 
ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్‌లైట్ల టవర్‌ 
పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు 
తడిసిన ధాన్యం, రాలిన మామిడి 
రాష్ట్రంలో నేడు, రేపు వానలు 
ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే- చేగుంట, బయ్యారం, మహబూబ్‌నగర్‌, మహదేవ్‌పూర్‌

కాల వర్షాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌ సహా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు పిడుగుపాటుకు బలవ్వడం గమనార్హం. హైదరాబాద్‌లో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గోడ కూలి మరణించారు. ఈదురుగాలులతో కూడిన వర్షం, పలు ప్రాంతాల్లో వడగళ్లు, పిడుగులు ప్రజలను వణికించాయి. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాత అతలాకుతలమయ్యాడు. వివిధ జిల్లాల్లో వరి ధాన్యం తడిసి దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. మరోపక్క మామిడి కాయలు రాలిపోవడం, చెట్లు కూలిపోవడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర, కొత్తకోట, జడ్చర్ల మార్కెట్లలో ధాన్యం బస్తాలు తడిశాయి. భూత్పూర్‌ మండలంలో పెద్దసంఖ్యలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఈదురు గాలులకు పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మహదేవపూర్‌, కాళేశ్వరం, అంబట్‌పల్లిలో భారీ గాలులు వీచడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షం కారణంగా మేడిగడ్డ బ్యారేజి పనులకు అంతరాయం కలిగింది. కూలీలు, యంత్రాలు ఉండే ప్రదేశాల్లో షెడ్డు కూలిపోయింది. అక్కడి సామగ్రి గాలికి ఎగిరిపోయింది. అంబట్‌పల్లిలో మిర్చి పంటకు తీవ్రంగా నష్టం జరిగినట్లు రైతులు చెప్పారు. మహుముత్తారం, పలిమెల మండలాల్లో కూడా పంట నష్టం వాటిల్లింది. 

రాజధానిని వణికించిన ఈదురు గాలులు 
హైదరాబాద్‌ నగరాన్ని సోమవారం సాయంత్రం ఈదురు గాలులు వణికించాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీచడంతో భారీ వృక్షాలు, హోర్డింగ్‌లు కూలిపోయాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి నగరం అతాలకుతలమైంది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్లు, ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ షెడ్లు కూలడంతో సందర్శకులు, స్టాల్స్‌ నిర్వాహకులు ప్రాణాలరచేత పెట్టుకుని పరుగులు తీశారు. కూకట్‌పల్లి, గాంధీనగర్‌, వెంగళరావు పార్కు, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్‌లు కూలిపోవడంతో లక్డీకాపూల్‌, మాసాబ్‌ట్యాంక్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. నాచారం మల్లాపూర్‌ హెచ్‌బీకాలనీలో రాళ్ల వర్షం కురిసింది. బోడుప్పల్‌ దేవేంద్రనగర్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కూలిపోయింది. బంజారాహిల్స్‌ నందినగర్‌లో భారీ వృక్షం నేలకొరగడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సైదాబాద్‌ వినయ్‌నగర్‌ ప్రధాన రహదారిపై పెనుగాలులకు వృక్షం కూలింది. ఈదురు గాలులకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడు, అయిదు, ఆరు, ఏడు అంతస్తుల్లో అద్దాలు విరిగిపోయాయి. 

నేడు, రేపు వర్షాలు 
రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓమాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతం వద్ద హిందూ సముద్రాన్ని ఆనుకుని ఉన్నచోట ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. అది 27వ తేదీకల్లా వాయుగుండంగా మారి తమిళనాడు తీరం వైపు పయనిస్తుందని అంచనా. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని ఆయన వివరించారు. 25 నుంచి రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నాయి. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకూ 191 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా లింగాపూర్‌లో 17.5 మిల్లీమీటర్ల(మి.మీ.) వాన పడింది. పరకాల 15.8, పెద్దేముల్‌ 15.5, గొల్లపల్లి 12.5, శ్రీవెంకటాపూర్‌ 13, అనంతసాగర్‌ 10, ఒడ్డెమాను 14, మాదన్నపూర్‌ 5, రేగొండ 4.5, కొత్తగూడ 3.8, వడ్డెపల్లి, బొరంపల్లిల్లో 3.5 మి.మీ.ల వర్షం కురిసింది. 

ఆరుగురిని బలిగొన్న అకాల వర్షం 
అకాల వర్షాలకు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఆరుగురు బలయ్యారు. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో టవర్‌ కూలి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, మలక్‌పేటలో ఇంటి పైకప్పు కూలి నవనీత్‌రాజ్‌ అనే బాలుడు  ఇద్దరు మృతి చెందగా వివిధ జిల్లాల్లో పిడుగుల బారిన పడి ముగ్గురు, గోడ కూలి ఒకరు మరణించారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం సుద్దరేవుకు చెందిన రైతు పూనెం అప్పయ్య(40) తన బొబ్బర పంటకు కాపలాగా వెళ్లి పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంటలో పశువులకు గడ్డి కోసేందుకు వెళ్లిన గోపి (30) అనే యువకుడు పిడుగుపడి మరణించాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచర్లలో కప్పల కుమారస్వామి(36)పై పిడుగుపాటుకు బలయ్యాడు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షంతో కోళ్లఫారం గోడ కూలి మొల్క కృష్ణ (25) అనే యవకుడు మరణించాడు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.