close
శ్రీలంకలో ఎమర్జెన్సీ 

పేలుళ్లలో ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు 
అంతర్జాతీయ ఉగ్రవాదుల ప్రమేయంపై అనుమానాలు 
ముష్కరులు స్థానికులే! 
ఇది దేశీయ ముఠా కుట్రే 
24 మంది అనుమానితుల అరెస్టు 
290కి చేరిన మృతుల సంఖ్య 
వారిలో 8 మంది భారతీయులు

కొలంబో: శ్రీలంకను కుదిపేసిన ఎనిమిది వరుస బాంబు పేలుళ్లలో ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని అధికారులు తేల్చారు. ఆదివారం ఈస్టర్‌ పర్వదినాన జరిగిన ఈ మారణహోమంలో మృతుల సంఖ్య 290కి పెరిగింది. 500 మందికిపైగా గాయపడ్డారు. చనిపోయినవారిలో 8 మంది భారతీయులు ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా మండలి సోమవారం అర్ధరాత్రి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలని నిర్ణయించింది. నిరవధిక కర్ఫ్యూను సడలించి, రాత్రి వేళలోనే దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వదంతుల వ్యాప్తిని అడ్డుకోవడానికి సామాజిక మాధ్యమాలపై ఆంక్షలను అమలు చేస్తున్నారు.ఈస్టర్‌ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆదివారం ఉదయం కొలంబో తదితర ప్రాంతాల్లోని 3 చర్చిలతోపాటు 3 హోటళ్లలో పేలుళ్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని గంటల తర్వాత కొలంబో జంతు ప్రదర్శనశాల సమీపంలో ఒక పేలుడు జరిగింది. ఆ వెంటనే నగర శివార్లలోని ఒరుగోదవట్టాలో గాలింపులో భాగంగా పోలీసులు ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో పాటు మూడు హోటళ్లు, మూడు చర్చిల్లో జరిగిన దాడులను ఆత్మాహుతి బాంబు పేలుళ్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ దుశ్చర్యలకు తెగబడ్డ ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు కొలంబో శివార్లలోని పనాడురాలో మూడు నెలల పాటు ఒక ఇంట్లో మకాం వేశారని తేల్చారు. 
అరెస్టులు 
ఈ దాడులకు ఏ ముఠా బాధ్యత వహించలేదు. ఈ కేసులో ఇప్పటివరకూ 24 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి రువాన్‌ గుణశేఖర తెలిపారు. వీరంతా దాదాపుగా ఒకే ముఠా సభ్యులని చెప్పారు. వీరి వివరాలను వెల్లడించడానికి ప్రభుత్వం నిరాకరించింది. హోటళ్ల వద్దకు బాంబులను వ్యాన్‌లో రవాణా చేసిన డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు. నిందితుల్లో 9 మందిని మే 6 వరకూ రిమాండ్‌లో ఉంచాలని కొలంబో మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశించింది. 

ఎన్‌టీజే పనే! 
ఈ పేలుళ్లకు దేశంలోని నేషనల్‌ తౌవీత్‌ జమాత్‌ (ఎన్‌టీజే) అనే ఉగ్రవాద ముఠా కుట్ర పన్ని ఉంటుందని అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి రజిత సేనరత్నే చెప్పారు. ఆత్మాహుతి బాంబర్లు అందరూ శ్రీలంక జాతీయులేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కుట్రలో అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాల ప్రమేయం ఉండొచ్చని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. మంగళవారం జాతీయ సంతాప దినాన్ని పాటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాంబు పేలుళ్ల మృతుల కుటుంబాలకు 10 లక్షల శ్రీలంక రూపాయలు, అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు, గాయపడినవారికి లక్ష నుంచి 3 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది. పేలుళ్లలో దెబ్బతిన్న చర్చిల మరమ్మతుల వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించింది. 
హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? 
చర్చిలు లక్ష్యంగా ఎన్‌టీజే ముఠా ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. వీటిని పోలీసు, నిఘా అధికారులు ఎందుకు తీవ్రంగా తీసుకోలేదన్న అంశం చర్చనీయాంశమైంది. దీనిపై దర్యాప్తు జరగాలని ప్రధాని విక్రమసింఘే చెప్పారు. ఈ దాడుల గురించి అంతర్జాతీయ నిఘా సంస్థలు ఈ నెల 4న హెచ్చరికలు చేశాయని, ఆ విషయం ఈ నెల 9న ఐజీకి తెలిసిందని ఆరోగ్య మంత్రి సేనరత్నే చెప్పారు. ఈ భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పోలీసు అధిపతి పుజిత్‌ జయసుందర రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పలువురు ఇతర మంత్రులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 
త్రిసభ్య కమిటీ 
ఈ పేలుళ్లపై దర్యాప్తు కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విజిత్‌ మలగోడ, మాజీ ఐజీ ఎన్‌.కె.ఇలంగకూన్‌, శాంతి భద్రతల విభాగం మాజీ కార్యదర్శి పద్మసిరి జయమణె ఉన్నారు. ఉగ్రవాదంపై పోరులో అంతర్జాతీయ సాయం తీసుకోనున్నట్లు అధ్యక్షుడు చెప్పారు. దర్యాప్తులో సాయానికి ఇంటర్‌పోల్‌ ముందుకొచ్చింది. 
భారత్‌ అప్రమత్తత 
శ్రీలంకలో పేలుళ్ల నేపథ్యంలో భారత నౌకాదళం, తీర రక్షక దళం అప్రమత్తమయ్యాయి. నిఘా కోసం మరిన్ని యుద్ధనౌకలు, విమానాలను రంగంలోకి దించాయి. సముద్ర మార్గంలో ముష్కరులెవరూ భారత్‌లోకి చొరబడకుండా చర్యలు చేపట్టారు. 
మరిన్ని బాంబులు 
సెయింట్‌ ఆంథోనీ చర్చి వద్ద ఒక వ్యాన్‌లో అమర్చిన బాంబును పోలీసులు సోమవారం నిర్వీర్యం చేస్తున్నప్పుడు అది  పేలింది. ఇందులో ఎవరూ గాయపడలేదు. మరోవైపు సెంట్రల్‌ కొలంబో బస్టాండ్‌లో పోలీసులు సోమవారం 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు. కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో రోడ్డు పక్కన ఒక దేశవాళీ బాంబును వైమానిక దళ సిబ్బంది గుర్తించి, నిర్వీర్యం చేశారు. 
8 మంది భారతీయుల మృతి 
శ్రీలంక బాంబు పేలుళ్లలో 8 మంది భారతీయులు మరణించారు. వీరిని లక్ష్మి, నారాయణ్‌ చంద్రశేఖర్‌, రమేశ్‌గా గుర్తించినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం వేమూరై తులసీరామ్‌, ఎస్‌.ఆర్‌.నాగరాజ్‌, ఎం.రంగప్ప, కె.జి.హనుమంతరాయప్ప, హెచ్‌.శివకుమార్‌ మరణించినట్లు శ్రీలంకలోని భారత హైకమిషన్‌ సోమవారం ప్రకటించింది. కేరళకు చెందిన రజీనా (58) అనే మహిళ ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అయితే దీనిపై శ్రీలంక అధికారుల నుంచి ధ్రువీకరణ లేదు. మరోవైపు మృతుల్లో కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ కార్యకర్తలు ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.