close
దద్దరిల్లిన ఇంటర్‌ బోర్డు 

మూల్యాంకనంలో అవకతవకలపై ఆగ్రహం 
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన 
రాజకీయనేతలు, విద్యార్థి సంఘాల ముట్టడి 
నినాదాలు.. ధర్నాలు.. అరెస్టులతో ఉద్రిక్తత 
16 మంది ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని నేతల ప్రశ్న 
పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
సమగ్ర విచారణ జరపాలని సీఎంకు ఉత్తమ్‌, భట్టి లేఖ 
దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఇంటర్‌ బోర్డు 
ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నాంపల్లి

ఇంటర్‌ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం నాంపల్లిలోని బోర్డు కార్యాలయం ముందు పెద్దస్థాయిలో ఆందోళనలకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. సంఘీభావం తెలిపిన కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌నూ అదుపులోకి తీసుకున్నారు. తప్పులకు బాధ్యులైన బోర్డు అధికారులను విధుల నుంచి, విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించి, సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ వ్యవహారం వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యనేత ఉన్నారంటూ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. మరోపక్క ఇంటర్‌ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. నవ్య అనే విద్యార్థినికి 99 బదులు 0 వేసిన ఇద్దరు అధికారులకు షోకాజ్‌ జారీచేశామని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి  జనార్దన్‌రెడ్డి గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ పనితీరుపై అధ్యయనం చేసి మూడురోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఓ కమిటీని నియమించారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం ఇంటర్‌బోర్డులో అధికారుల మధ్య విభేదాలే కారణమని ఇంటిలిజెన్స్‌ వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొందరు అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసింది. ఇంటర్‌బోర్డులో అంతర్గత తగాదాల వల్ల కొందరు అధికారులు ఈ అపోహలు సృష్టించారని విద్యాశాఖ మంత్రి ఆదివారమే వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఫలితాల్లో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అంతర్గత విభేదాలంటూ ప్రభుత్వం చెబుతోందని కొందరు విమర్శిస్తున్నారు. 

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళం, అవకతవకల నేపథ్యంలో సోమవారం రోజంతా విద్యార్థులు, తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతల ధర్నాలు, ఆందోళనలతో నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం అట్టుడికింది. నినాదాలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రాకతో ఉద్రిక్తత మరింత పెరిగింది.  బీజేవైఎం కార్యకర్తలు కార్యాలయ ప్రహరీ దూకి లోపలికి దూసుకెళ్లారు. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఉదయం నుంచే ఆబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని సైతం అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలు పోస్టర్లు చేతబూని నినాదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరుగా నేతలు వస్తుండటం...వందలాది మంది జనం గుమిగూడి ఉండటంతో అక్కడ ఏంజరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఉదయం పదిన్నర గంటల నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఏబీవీపీ నేతలు ఎల్లస్వామి, శ్రీహరి, శ్రీశైలం నేతృత్వంలో పలువురు జెండాలు చేతబూని పోలీసుల వలయాన్ని తప్పించుకుని బోర్డు కార్యాలయ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు?: రేవంత్‌రెడ్డి 
ఇంటర్‌ ఫలితాల్లో ఇంత గందరగోళం జరిగి 16 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారుల తీరును నిరసిస్తూ తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ధర్నాకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో వచ్చి ఆయన సంఘీభావం తెలిపారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసు బలగాలు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ను అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నించాయి.ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయనీయకుండా పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆయనకు అండగా నిలిచారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో మఫ్టీలో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, అదనపు బలగాలు రంగంలోకి దిగి రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ను అరెస్టు చేసి బేగంబజార్‌ ఠాణాకు తరలించారు. 

ప్రహరీ... గేట్లు ఎక్కి దూసుకెళ్లిన బీజేవైఎం నేతలు 
బీజేవైఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు వినయ్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి లడ్డుయాదవ్‌ నేతృత్వంలో పలువురు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని భాజపా కార్యాలయం నుంచి ఇంటర్‌ బోర్డు వరకూ ఉదయం ర్యాలీగా వచ్చారు. కార్యాలయానికి కూతవేటు దూరంలోనే వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు పోలీసు వలయాన్ని ఛేదించుకొని ఇంటర్‌ బోర్డు ప్రహరీ ఎక్కి లోపలికి దూకి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం.. సీఎం కేసీఆర్‌ డౌన్‌.. డౌన్‌.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర తోపులాట.. వాగ్వాదాలు చోటుచేసుకున్నారు. బ్యారికేడ్లను నిరసనకారులు రోడ్డుపై పడేశారు. ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. ఈ సందర్భంగా బీజేవైఎం అధ్యక్షులు వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 
హోరెత్తించిన విద్యార్థి సంఘాలు 
ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ తదితర సంఘాలు కూడా బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. జవాబుపత్రాల పునఃపరిశీలనను ఉచితంగా చేయాలని ఏబీవీపీ నేతలు కె.ప్రవీణ్‌రెడ్డి, అయ్యప్ప తదితరులు డిమాండ్‌ చేశారు. యువజన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్‌ నేతృత్వంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి పోలీసులు అడ్డుకున్నా  తోపులాట మధ్య ధర్నా నిర్వహించారు. అయితే అక్కడికి వచ్చిన వారిని వచ్చినట్లుగా వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. బాధిత విద్యార్థులకు సంఘీభావంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్‌ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలు జావిద్‌, అశోక్‌రెడ్డి తదితరులు ధర్నాకు దిగడంతో వారిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 
విద్యార్థులు.. తల్లిదండ్రుల అరెస్టు 
నిరసనకారులతో పాటు ఎవరుంటే వారిని... చివరికి మహిళలని కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్లలో పడేశారు. ఏబీవీపీ నేత అయ్యప్పను పోలీసు జీపులో ఉంచి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. కొందరు బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులను కూడా అరెస్టు చేయడం గమనార్హం. మూడు రోజులుగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో .. అధికారుల వివరణ తీసుకుంటామని, లేదంటే అధికారులే బయటికి వచ్చి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరడంతో పోలీసు అధికారులు మీడియా ప్రతినిధులను కూడా కార్యాలయంలోకి వెళ్లనీయలేదు. దీంతో పోలీసు అధికారులకు, మీడియా ప్రతినిధులకు మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. 
సీఎం వివరణ ఇవ్వాలి: ఉత్తమ్‌ 
లక్షలాది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన ఫలితాల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యార్థుల తరఫున కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. అరెస్టై బేగంబజార్‌ ఠాణాలో ఉన్న రేవంత్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌లతో పాటు పార్టీ నేతలను ఆయన పరామర్శించారు.

‘గ్లోబరీనా’ సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో లోపాలున్నాయా? 
పలు అంశాలపై అధ్యయనం  
మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ 

ఈనాడు, హైదరాబాద్‌: గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ పనితీరులో లోపాలే ఇంటర్‌ ఫలితాల్లో తప్పులకు కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధ్యయనానికి ముగ్గురితో కమిటీ నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. టీఎస్‌టీఎస్‌ ఎండీ జీటీ వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా, బిట్స్‌ ఆచార్యుడు ఎ.వాసన్‌, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఆచార్యుడు నిశాంత్‌ దొంగరి సభ్యులుగా కమిటీని నియమిస్తూ సోమవారం విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జీవో జారీ చేశారు. ఈ కమిటీ ప్రధానంగా నాలుగు అంశాలను పరిశీలిస్తుంది. ఒప్పందం ప్రకారమే సంస్థ పని చేసిందా? సకాలంలో సమస్యలను పరిష్కరించేందుకు తగినంత సిబ్బంది ఉన్నారా? సకాలంలో వ్యవస్థీకృత తప్పులను గుర్తించేందుకు తనిఖీ చేసే వ్యవస్థ ఉందా? సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌, అమల్లో పొరపాట్లు ఉండటం వల్ల తప్పులు చోటు చేసుకున్నాయా?అనే అంశాలపై అధ్యయనం చేస్తారు. తప్పులను తగ్గించేందుకు అవకాశమున్న చర్యలపై సలహాలు ఇస్తారు. మూడు రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని జీఓలో పేర్కొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.