close
రణరంగం

కోల్‌కతాలో భాజపా బలప్రదర్శన
అభ్యర్థులతో కలిసి అమిత్‌షా రోడ్‌షో
రాళ్లు రువ్విన తృణమూల్‌, సీపీఎం విద్యార్థి విభాగాలు
ప్రతిగా వాహనాలు తగలబెట్టిన భాజపా శ్రేణులు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో భాజపా బలప్రదర్శనకు దిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. భాజపా అభ్యర్థులకు మద్దతుగా మంగళవారం కోల్‌కతాలో రోడ్‌ షో నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు సెంట్రల్‌ కోల్‌కతా నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరానికి దక్షిణభాగంలో ఉన్న స్వామి వివేకానంద నివాసం వరకు సాగింది. అమిత్‌షా.. భాజపా అభ్యర్థులతో పాటు వాహనంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు భాజపా జిందాబాద్‌, మోదీ జిందాబాద్‌, అమిత్‌ షా జిందాబాద్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

రోడ్‌ షో దక్షిణ కోల్‌కతాలోని కలకత్తా విశ్వవిద్యాలయ ప్రాంగణం వద్దకు రాగానే సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగాల విద్యార్థులు నిరసనకు దిగారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అని రాసిన నల్లజెండాలు చేతబట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ కళాశాల, విశ్వవిద్యాలయ వసతిగృహం దాటగానే తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిషద్‌ కార్యర్తలు అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో రెచ్చిపోయిన భాజపా కార్యకర్తలు హాస్టల్‌ గేట్లకు తాళాలు వేసి బయట నిలిపిన సైకిళ్లు, మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టారు. హాస్టల్‌ భవనంపైకి రాళ్లు రువ్వారు. సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యా సాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

డైమండ్‌ హార్బర్‌లోనూ అల్లర్లు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పోటీ చేస్తున్న డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో మూడు రోజులపాటు అల్లర్లు సాగాయి. ‘దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలోని ఈ నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి భాజపా, తృణమూల్‌ శ్రేణులు పరస్పరం ఘర్షణలకు దిగాయి. ఇళ్లు, దుకాణాలను లూటీ చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఎవరూ గాయపడలేదు. మూడు రోజులపాటు సాగిన అల్లర్లు సోమవారం సద్దుమణిగాయి’ అని సచివాలయంలోని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు.


 

మమతదే బాధ్యత: రాజ్‌నాథ్‌

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలకు, అల్లర్లకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీదే బాధ్యతని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రంలో ముఖ్యమంత్రిదే బాధ్యతన్నారు. ఒకవేళ ఆమె వాటిని నియంత్రించలేకపోతే అది అరాచకమేనని, దానికి మమతే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఫొని తుపాను సహాయచర్యలపై మాట్లాడటానికి ప్రధాని మోదీ ఫోన్‌ చేస్తే మమత స్పందించలేదన్నారు. ప్రధాని ఫోన్‌ చేస్తే ముఖ్యమంత్రి స్పందించకపోవడం బహుశా దేశంలో ఇదే తొలిసారేమోనని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.


 

అమిత్‌ షా దేవుడా?: మమత

కోల్‌కతా: భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనేమైనా దేవుడా.. ఎవరూ ఆయనకు నిరసన తెలియజేయకూడదా అని ప్రశ్నించారు. ‘కంగల్‌ బంగ్లా’ (దివాలా తీసిన బెంగాల్‌) వ్యాఖ్యలు చేయడానికి ఆయనకు ఎంత ధైర్యమని మండిపడ్డారు. ఇందుకు ఆయన చేత గుంజిళ్లు తీయించాలన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలకు పంచేందుకు సీఆర్పీఎఫ్‌ వాహనాల్లో భాజపా డబ్బు చేరవేస్తోందని ఆరోపించారు.
మంగళవారం కోల్‌కతాలో అమిత్‌ షా రోడ్‌షోలో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారుల మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన నేపథ్యంలో మమత తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.