close
బెంగాల్‌ అల్లర్లపై ఈసీ కొరడా

ఒకరోజు ముందుగానే ప్రచారం ముగించాలని ఆదేశం
  రాష్ట్రమంతా రాజకీయ ఉద్రిక్తత
  సంఘసంస్కర్త విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసంపై వివాదం
  భాజపాయే కారణమంటూ  ఈసీకి తృణమూల్‌ ఫిర్యాదు
  కోల్‌కతాలో ముఖ్యమంత్రి మమత ర్యాలీ

కోల్‌కతా, దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కోల్‌కతాలో నిర్వహించిన ప్రదర్శనలో హింస చెలరేగడం ప్రకంపనలు సృష్టించింది. మంగళవారం జరిగిన ఈ ప్రదర్శనలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మరింత వివాదాస్పదమయింది. ఇందుకు కారణం మీరంటే మీరని తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. బెంగాల్‌ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని తృణమూల్‌ ఆరోపించగా, తమపై నింద మోపడానికి కుట్ర జరిగిందని భాజపా ప్రత్యారోపణ చేసింది. ఈ సంఘటనకు నిరసనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కోల్‌కతాలో ప్రదర్శన నిర్వహించారు.

భాజపా కూడా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు తెలిపింది. సంఘటన తీవ్రత దృష్ట్యా ప్రచారాన్ని ఒక రోజు ముందుగా గురువారమే ముగించాలంటూ ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో చివరిదైన ఏడో దశలో భాగంగా 9 నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్‌ జరగాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం ప్రచారం ముగియాల్సి ఉండగా, కోల్‌కతాలో జరిగిన ఘర్షణల దృష్ట్యా గురువారం రాత్రి పది గంటలకే ప్రచారాన్ని ముగించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని, తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ చంద్ర భూషణ్‌ కుమార్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోం) అత్రి భట్టాచార్య, అదనపు డీజీపీ (సీఐడీ) రాజీవ్‌ కుమార్‌లను ఆయా పదవుల నుంచి తొలగించినట్టు తెలిపారు.

ఇది మోదీకి ఈసీ బహుమతి: మమత
పశ్చిమ బెంగాల్‌లో 324వ అధికరణాన్ని అమలు చేయడాన్ని మమతా బెనర్జీ ఖండించారు. ఈ అధికరణాన్ని విధించేటంతటి శాంతిభద్రతల సమస్యలు రాష్ట్రంలో లేవని చెప్పారు. ఎన్నికల సంఘం ‘‘గతంలో ఎన్నడూ లేని, అప్రజాస్వామిక, అనైతిక నిర్ణయం తీసుకొంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలకు ఈసీ ఇచ్చిన బహుమతి’’ అని ఆరోపించారు. మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌వారితో నిండిపోయిన ఇలాంటి ఎన్నికల సంఘాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఇద్దరు ఉన్నతాధికారులను కూడా ఈసీ కాకుండా మోదీ, అమిత్‌షాయే తొలగించారని ఆరోపించారు.

విగ్రహ ధ్వంసం భాజపా పనే: తృణమూల్‌
విగ్రహాన్ని ధ్వంసం చేయడం భాజపా పనేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ ఆరోపించారు. ఎన్నికల ముందు హింస సృష్టించాలన్న ఉద్దేశంతోనే అమిత్‌ షా ప్రదర్శన నిర్వహించారని అన్నారు. కోల్‌కతాలో ఇందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. కాషాయ రంగు టీ షర్టులు ధరించిన వ్యక్తులు విగ్రహాన్ని ముక్కలు చేశారని తెలిపారు. ఆ పార్టీ ఎంపీలు డెరెక్‌ ఓబ్రెయిన్‌, సుఖేందు శేఖర్‌ రాయ్‌ తదితరులు దిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. భాజపా హింసకు సాక్ష్యాలుగా తమ వద్ద 44 వీడియోలు ఉన్నాయని తెలిపారు. కేంద్రబలగాలు భాజపాతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. భాజపా ఏమి చేసినా జోక్యం చేసుకోవద్దంటూ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సందీప్‌ జైన్‌ ఆదేశించారంటూ ఆరోపించారు.

మూకస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు: కాంగ్రెస్‌
కోల్‌కతాలో  విధ్వంసాన్ని కాంగ్రెస్‌ ఖండించింది. నరేంద్ర మోదీ, అమిత్‌షాలు కలిసి మూకస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి ఆరోపించారు. భాజపా రాష్ట్రాల సంస్కృతులను ధ్వంసం చేస్తోందని అన్నారు. ఇది బెంగాల్‌పై జరిగిన దాడి అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. విద్యాసాగర్‌ చేపట్టిన సంస్కరణలన్నా, ఆదర్శభావాలన్నా భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఇష్టం ఉండదని అందుకే ఈ దారుణానికి పాల్పడ్డాయని ఆరోపించారు.

తృణమూలే కారణం..: అమిత్‌ షా
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసానికి తృణమూల్‌దే బాధ్యత అని ఆరోపించారు. ఓడిపోతామని తెలిసే ప్రజల సానుభూతి పొందడం కోసం హింసను ప్రేరేపించారని అన్నారు. కేంద్రబలగాలు, సీఆర్‌పీఎఫ్‌ లేకపోయి ఉంటే తాను బయట పడడం కష్టమయ్యేదని అన్నారు. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంగా చూస్తూ ఉండిపోయిందని ఆరోపించారు. దేశంలో అన్ని చోట్లా రౌడీషీటర్లను అరెస్టు చేశారని, బెంగాల్‌లో మాత్రం బాండు పేపర్లు తీసుకొని విడుదల చేసిందని తెలిపారు. ఈసీ వైఖరిపై అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో హెచ్చరికలు చేస్తున్నా ఆమె ప్రచారంపై నిషేధం విధించలేదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించడంపై కేంద్రం జోక్యం అవసరం లేదని, ప్రజలే తగిన తీర్పు ఇస్తారని అన్నారు. మరోవైపు అమిత్‌ షాపై దాడికి నిరసనగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భాజపా మౌన ప్రదర్శన జరిపింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.