close
వైద్యం మిథ్యే

ప్రాథమిక వైద్యశాలల్లో అందుబాటులో ఉండని వైద్యులు
సకాలంలో వస్తున్నది కొందరే
గ్రామీణ ప్రాంతాల్లో రోగుల అవస్థలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడి 30 మంది గాయపడ్డారు. పోలీసులు బాధితులను మహదేవపూర్‌ సామాజిక ఆసుపత్రి, కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లగా వైద్యులు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో ఇద్దరు వైద్యులకు ఆయన మెమోలు జారీ చేశారు.

సామాన్యులకు ప్రాణప్రదమైన ప్రాథమిక వైద్యం బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కానరావడంలేదు. ముఖ్యంగా పర్యవేక్షణలేమి ప్రాథమిక వైద్యానికి శాపంగా మారింది. కొంతమంది వైద్యులు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతుండడంతో ఈ వ్యవస్థ గాడి తప్పుతోంది. డాక్టర్‌ ఉంటారో.. ఉండరో అనే అపనమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. సకాలంలో వైద్యం అందక పేద రోగులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంచుకొని, వాటి పనితీరుపై ‘ఈనాడు బృందం’ ఇటీవల ఒకరోజు క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో పలు అంశాలు వెల్లడయ్యాయి. 99 శాతం మంది వైద్యులు సమయపాలన పాటించడంలేదని తేలింది. పీహెచ్‌సీలపై సమగ్ర కథనం..


అలసత్వానికి ఏదీ..ప్రాథమిక చికిత్స?
పీహెచ్‌సీల్లో విధులకు హాజరు పట్ల 99 శాతం మంది వైద్యులది నిర్లక్ష్యమే!
నిరుపయోగంగా రూ.లక్షల పరికరాలు
నిధులున్నా.. మౌలిక వసతుల నిర్వహణలేమి
సర్కారు ఆదేశించినా.. మారని తీరు
ప్రాథమిక వైద్యంలో సమయ పాలనే అసలు సమస్య
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ‘ఈనాడు’ ఒక రోజు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి

ప్రజారోగ్య సంరక్షణలో ప్రాథమిక వైద్యానిదే కీలక పాత్ర. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. గతేడాది 521 వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఔషధాలకు కేటాయించే నిధుల మొత్తాన్ని ఏకంగా మూడింతలు పెంచింది. గతంలో పీహెచ్‌సీలో 156 రకాల ఔషధాలు మాత్రమే సరఫరాకు అర్హతగా ఉండేది. ఈ సంఖ్యను 220కి ప్రభుత్వం పెంచింది. రూ.కోట్లతో పరికరాలనూ సమకూర్చింది. అయినా, పీహెచ్‌సీలు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ముఖ్యంగా వైద్యుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. విధులకు ఆలస్యంగా రావడమే కాకుండా.. మళ్లీ వెళ్లడమూ త్వరగానే! ఈ విషయంపై ప్రభుత్వం పలు సందర్భాల్లో స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడంలేదు.

అయితరాజు రంగారావు
ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగంతో కలిసి

కొందరు వైద్యులు మెరుగైన సేవలే అందిస్తున్నా.. అత్యధికులు విధులకు హాజరవడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చెప్పాపెట్టకుండా డుమ్మాలు కొట్టడం, ఆలస్యంగా వచ్చి, ముందుగానే వెళ్లిపోవడం వంటి చర్యలకు పాల్పడుతుండడంతో ప్రాథమిక వైద్యంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ‘ఈనాడు యంత్రాంగం’ ఒక రోజు పరిశీలనలో వెల్లడైన విషయాలివీ..

ఏడాదికి రూ.1.75 లక్షలు నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి సంస్థ ఖాతాలో జమ అవుతాయి. ఈ నిధులను ఆసుపత్రిలో మరమ్మతులు, అభివృద్ధి పనులకు వినియోగించాల్సి ఉంటుంది. అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేటాయించిన నిధులను సగానికి మించి వినియోగించడంలేదు. కొన్ని చోట్ల 80 శాతానికి పైగా నిధులు మురిగిపోతున్న దాఖలాలూ ఉన్నాయి. ఫలితంగా విలువైన పరికరాలు మూలనపడుతున్నాయి. మౌలిక వసతుల నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి

మచ్చుకు కొన్ని..

* ముథోల్‌ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రికి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఉదయం పది దాటిన తర్వాత వచ్చారు.
* సంగారెడ్డి జిల్లా హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు వైద్యసేవల కోసం ఆవరణలో వేచి చూశారు. స్టాఫ్‌నర్సు, సహాయకురాలు, ఆరోగ్య అవగాహన కార్యకర్త 10.30 గంటలకు వచ్చారు. 11 గంటల తర్వాత వైద్యురాలు వచ్చి రోగుల్ని పరీక్షించారు.
* నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌ పీహెచ్‌సీ సిబ్బంది ఉదయం 11 తర్వాత ఆసుపత్రికొచ్చారు. 11.30 గంటలైనా వైద్యుడు రాలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సిబ్బంది వెళ్లిపోయారు.
* కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం ప్రాథమిక కేంద్రానికి ఉదయం 9 గంటలకే ఇద్దరు రోగులు వచ్చారు. కాలికి గడ్డపార దిగిన బాధితురాలికి అటెండర్‌ ప్రథమ చికిత్స అందించారు. 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఓ ఏఎన్‌ఎం ఆమెకు ఇంజెక్షన్‌ వేసి మందులు ఇచ్చి ఇంటికి పంపారు. వైద్యాధికారి 10.30 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2.30 గంటలకే వెళ్లిపోయారు.
* రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పీహెచ్‌సీలో 24 గంటలపాటు సేవలు అందాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2 తర్వాత ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ కనిపించలేదు.

కొన్ని చోట్ల బాగానే..

* లింగాల ఘనపురం పీహెచ్‌సీలో టీకాలను రెండు శీతలీకరణ యంత్రాలలో భద్రపరిచారు. ఔషధాల నిల్వకు ప్రత్యేక గది కేటాయించారు.
* ఎల్లారెడ్డిపేట పీహెచ్‌సీలో కుక్కకాటు, పాముకాటు, అధిక రక్తపోటు, మధుమేహం, క్షయ వ్యాధికి సంబంధించిన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.
* నర్సాపూర్‌లో ఔషధాలు నిల్వ చేయడానికి ప్రత్యేక గది ఉంది. శీతల యంత్రాలను వాడుతున్నారు.
* సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఔషధాలను నిల్వ చేసేందుకు గది ఉంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా బ్యాటరీలు అమర్చారు.

నర్సే కాన్పు చేసింది..

కుమురం భీం జిల్లా బెజ్జూరులో వైద్య సిబ్బంది ఆలస్యంగా విధులకు వచ్చారు. ఓపీ చూసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వైద్యాధికారి వెళ్లిపోయారు. అనంతరం 2.30 గంటలకు మండలంలోని బారేగూడకి చెందిన గర్భిణి పాలే రజిత పురిటినొప్పులతో ఆసుపత్రికి వచ్చారు. వైద్యుడు లేకపోవడంతో అక్కడ ఉన్న స్టాఫ్‌ నర్సు వైద్య పరీక్షలు నిర్వహించి కాన్పు చేశారు. రజిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

నిరుపయోగ  పరికరాలు

* జైనూరులో రూ.6 లక్షల విలువైన స్కానింగ్‌ పరికరం నిరుపయోగంగా ఉంది. ఇక్కడ దంత పరీక్షల కోసం పరికరాలు మంజూరైనా వినియోగానికి నోచుకోక మూలనపడి ఉన్నాయి..
* ముథోల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే పరికరం చెడిపోయి ఏడాది గడిచినా మరమ్మతులు చేపట్టడం లేదు. వార్డుల్లో ఎటువంటి పరికరాలు లేవు.
* బెజ్జూరులో పిల్లల వెచ్చదనం యంత్రం పనిచేయడంలేదు.
* ఇలా.. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్నచిన్న మరమ్మతులకు నోచుకోక ఎన్నో విలువైన పరికరాలు వృథాగా పడి ఉన్నాయి.

మానవ వనరుల  కొరత

* కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను నియమించినా.. వారిని వేర్వేరు చోట్లకు సర్దుబాటు(డిప్యూటేషన్‌) చేయడమూ సమస్యగా పరిణమించింది.
* ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు 62 కి.మీ దూరంలో ఉన్న ఏటూరునాగారం నుంచి వైద్యుడు రాకపోకలు సాగిస్తున్నారు.
* పెద్దపల్లి జిల్లా గద్దలపల్లి,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నాగర్‌ కర్నూల్‌ జిల్లా పదర, రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ఇంకా.. నార్సింగి, జైనూరు, కుందారం తదితర పీహెచ్‌సీల్లో నియమితులైన వైద్యులు అదనపు విధులు, డిప్యూటేషన్లపై ఉండటం ఆయా కేంద్రాల్లో సేవలకు ఇబ్బందికరంగా మారింది.

నిర్ధారణ  పరీక్షలు

* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం 32 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా.. చాలా చోట్ల 12-15 రకాల పరీక్షలు చేస్తున్నారు. మిగిలినవి ప్రైవేటులో చేయించుకోవాల్సి వస్తోంది.
* ఉదాహరణకు జైనూరులో కేవలం మలేరియా, హిమోగ్లోబిన్‌ పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి.
* నర్సాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా, టైఫాయిడ్‌, హిమోగ్లోబిన్‌, మధుమేహ పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ, టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇటీవల టైఫాయిడ్‌ పరీక్ష కిట్‌లు అందుబాటులో లేకపోవడంతో అవి జరగడం లేదు.
* చాలా పీహెచ్‌సీల్లో డెంగీ పరీక్షలు నిర్వహించడంలేదు.


ఔషధాలున్నా.. నిర్వహణలేమి

* దాదాపు అన్ని పీహెచ్‌సీల్లోనూ ఔషధాలు సమృద్ధిగా ఉన్నాయని పరిశీలనలో స్పష్టమైంది. కొన్ని కేంద్రాల్లో మాత్రం పలు రకాల ఔషధాలు అందుబాటులో లేవు.
* ఉదాహరణకు గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మధుమేహ ఔషధాలు లేవు. కాన్పు సమయాల్లో అవసరమయ్యే మందులు కొన్ని అందుబాటులో ఉండటం లేదు.
* ముథోల్‌లో ఔషధాలను నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు లేవు.
* సంగారెడ్డి జిల్లా కరస్‌గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విటమిన్‌-ఏ సిరప్‌ కొరత ఉంది.
* ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర పీహెచ్‌సీలో ఔషధాల నిల్వ చిందరవందరగా కొనసాగుతోంది.
* పాల్వంచ మండలం ఉల్వనూరు పీహెచ్‌సీలో ఔషధాలను నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో అవి అరకొరగానే రోగులకు అందుతున్నాయి. ఇక్కడ ఉండాల్సిన టీకాలను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వంచ ఏరియా ఆసుపత్రిలో ఉంచుతున్నారు. పీహెచ్‌సీలో విద్యుత్తు సమస్యతో అతి శీతల యంత్రాలను నెలకొల్పలేదు. అత్యవసరంగా ఎవరికైనా పాము, కుక్క కాటు ఔషధాలు ఇవ్వాల్సి వస్తే.. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింహసాగర్‌కు పరుగులు పెట్టాల్సిందే. ఇక్కడ పనిచేసే ఓ ఏఎన్‌ఎం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్‌లో టీకాలను తాత్కాలికంగా నిల్వ చేస్తున్నారు. ఆ ఏఎన్‌ఎం రోజూ ఓ చిన్న ఐస్‌ ప్యాక్‌లో వ్యాక్సిన్లు పెట్టి పీహెచ్‌సీకి తీసుకొస్తున్నారు.
* కారేపల్లిలో మిగతా మందులన్నీ ఉన్నా.. 20 రోజుల నుంచి కంటి చుక్కల మందు పంపిణీ నిలిచిపోయింది.
* ఆదిలాబాద్‌ జిల్లా కుందారంలో ముందులు నిల్వచేసే పద్ధతి సరిగా లేదు. ఇది పురాతన భవనం కావడంతో మందులు ఉంచే గదిలో పెచ్చులు ఊడిపోయి, వర్షాకాలంలో ఉరుస్తోంది

ఎప్పుడూ డాక్టరు ఉండరు

ఎండాకాలం కావడంతో మందుల కోసమని పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి కూర్చుంటే.. పది గంటలైనా వైద్యుడు రాలేదు. ఎప్పుడొచ్చినా వైద్యుడు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండటం లేదు. పిట్టంపల్లి గ్రామం నుంచి ఇక్కడికి రావడానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎండలకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాం.
-బాతరాజు యాదయ్య, పిట్టంపల్లి,
వెలిమినేడు పీహెచ్‌సీ పరిధి

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.