close
వీవీప్యాట్లను మొదటే లెక్కించాలి

తేడా వస్తే మొత్తం స్లిప్పులను గణించాలి
ఎన్నికల సంఘానికి 22 రాజకీయ పార్టీల డిమాండ్‌
నేడు చర్చించి చెబుతామని ఈసీ హామీ ఇచ్చిందన్న ఆజాద్‌
23న కార్యాచరణపై విపక్షాల చర్చ

మనిషి ఆరోగ్యం తెలుసుకోవడానికి ఒక రక్త నమూనా చాలని లోగడ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చెప్పారు. ఒకవేళ రక్త పరీక్షలో శరీరమంతా కలుషితమైందని తేలితే బాడీస్కానింగ్‌ చేయాలి కదా.

-ఏపీ సీఎం చంద్రబాబు


ఈనాడు, దిల్లీ: ఓట్ల లెక్కింపు సమయంలో తొలుత అయిదు వీవీప్యాట్లను లెక్కించాలని, అందులో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించేలా మార్గదర్శకాలను ఇవ్వాలని విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఏపీ, రాజస్థాన్‌, దిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, అశోక్‌గహ్లోత్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ల నేతృత్వంలో 22 రాజకీయ పార్టీలు మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ప్రధానంగా ఇదే డిమాండ్‌ చేశాయి. ఓట్ల లెక్కింపు సమయంలో వచ్చే ఇబ్బందులను తొలగించడానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ 11 పేజీల వినతిపత్రాన్ని సమర్పించాయి. ఈ సందర్భంగా తెదేపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్క వీవీప్యాట్‌లో తేడా వచ్చినా మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలని తాము నెలన్నరగా కేంద్ర ఎన్నికల సంఘానికి న్యాయమైన డిమాండ్‌ చేస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. ‘తేడా వచ్చినప్పుడు అన్ని వీవీప్యాట్లు లెక్కించడంలో ఈసీకున్న సమస్యేంటి? ఇందులో న్యాయముందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కూడా సమర్థించారు. ఈవీఎంల పనితీరుపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని చెప్పారు. ప్రజా తీర్పును గందరగోళపర్చడానికి వీల్లేదు. అందుకే ప్రజాస్వామ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా మేం పదేపదే విన్నవిస్తున్నాం. మనిషి ఆరోగ్యం తెలుసుకోవడానికి ఒక రక్త నమూనా చాలని లోగడ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చెప్పారు. ఒకవేళ రక్త పరీక్షలో శరీరమంతా కలుషితమైందని తేలితే బాడీస్కానింగ్‌ చేయాలి. మేం అదే డిమాండ్‌ చేస్తున్నాం’ అని అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా ఈవీఎంల తరలింపులో గందరగోళం చెలరేగడం, అనుమానాలు తలెత్తడం చూస్తున్నాం. భద్రతా సిబ్బంది లేకుండా ఈవీఎంలు బయటకురావడం, లోపలకు వెళ్లడం, ప్రైవేటు వాహనాల్లో తరలడాన్ని చూశాం. ఈ అంశాలనే ఈసీ దృష్టికి తెచ్చాం. చాలా ఈవీఎంలలో ఏ పార్టీకి ఓటేసినా అది భాజపాకు వెళ్లిన విషయాన్నీ వారికి వివరించాం. ప్రతి శాసనసభ పరిధిలో అయిదు వీవీప్యాట్ల లెక్కింపును ఈవీఎంల కౌంటింగ్‌కు ముందే పూర్తి చేయాలి. తేడా వస్తే మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని కోరాం. దీనిపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం హామీనిచ్చింది’ అని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌మనూ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘దేశంలో 75శాతం ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు వచ్చి అడిగినప్పుడు ఈ మాత్రం మార్పు తీసుకురాలేరా? అని ప్రశ్నించాం. నిబంధనలు సవరించమనడం లేదు. వీవీప్యాట్లు ముందు లెక్కించేలా మార్గదర్శకాలివ్వాలని మాత్రమే కోరుతున్నాం. నమూనాలో తప్పున్నట్లు తేలితే ఆ నియోజకవర్గం మొత్తంలో లోపమున్నట్లే లెక్క. రూ.9వేల కోట్లతో తయారు చేయించిన వీవీప్యాట్లను అలంకారప్రాయంగా ఉంచడంలో అర్థమేంటి? నమూనాలో తేడాలు వచ్చినప్పుడు కూడా లెక్కించకపోతే పారదర్శకత ఎక్కడుంటుంది?’ అని ప్రశ్నించారు. బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో ఏఆర్‌ఓ టేబుల్స్‌పై ఎన్నికల ఏజెంట్లను కూర్చోనివ్వబోమని అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. దీన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లగా.. ఇంతవరకూ అలాంటి ఉత్తర్వులేమీ ఇవ్వలేదని చెప్పింది’ అని అన్నారు. ప్రతి ఏఆర్‌వో టేబుల్‌పై ప్రతి పార్టీ ఏజెంటు కూర్చోవడానికి అవకాశమిచ్చేలా ఆదేశిస్తామని హామీనిచ్చిందని తెలిపారు.

రాష్ట్రపతికి లేఖ కోసం సిద్ధం చేసుకోండి
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి ముందు విపక్షాలు ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఫలితాలు వచ్చాక అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. ఎగ్జిట్‌పోల్స్‌ భాజపా ఒత్తిడితో వెలువరించినట్లు స్పష్టమవుతోందని, వాటి గురించి ఆలోచించకుండా 23న కార్యాచరణపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించాయి. ఆరోజు ఫలితాలు హంగ్‌ దిశగా సాగితే ఏకైక అతి పెద్ద పార్టీకి కాకుండా మెజారిటీ సభ్యుల మద్దతున్న కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని రాష్ట్రపతికి లేఖనివ్వాలన్న అభిప్రాయానికి వచ్చాయి. అందువల్ల అన్ని పార్టీల అధ్యక్షులు తమ లేఖలను ముందుగానే ఇవ్వాలని, రాష్ట్రపతి నిర్ణయం వెలువరించగానే ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయానికి రావొచ్చన్న అభిప్రాయాన్ని సమావేశంలో చాలామంది నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో విజయానికి మోదీ బృందం ఎంతకైనా తెగించే ప్రమాదం ఉన్నందున లెక్కింపు రోజు అప్రమత్తంగా ఉండాలని తీర్మానించాయి.

ఈసీని కలిసిన వారు

1. కాంగ్రెస్‌: గులాంనబీ ఆజాద్‌, అశోక్‌గహ్లోత్‌, అభిషేక్‌సింఘ్వీ, అహ్మద్‌పటేల్‌
2. తెలుగుదేశం: నారా చంద్రబాబునాయుడు
3. ఆప్‌: అరవింద్‌ కేజ్రీవాల్‌, సంజయ్‌సింగ్‌
4. బీఎస్పీ: సతీష్‌చంద్ర మిశ్రా
5. తృణమూల్‌ కాంగ్రెస్‌: డెరెక్‌ ఒబ్రెయిన్‌
6. సీపీఎం: సీతారాం ఏచూరి
7. సీపీఐ: సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా
8. డీఎంకే: కనిమొళి
9. ఎన్‌సీపీ: ప్రఫుల్‌పటేల్‌, మజీద్‌మెమన్‌
10. ఆర్‌జేడీ: మనోజ్‌ఝా
11. ఎస్పీ: రామ్‌గోపాల్‌ యాదవ్‌, సంజయ్‌సేథ్‌
12. జేడీఎస్‌: డి.కుపేంద్ర రెడ్డి
13. ఐఊఎంఎల్‌: ఖొర్రుం అనీస్‌ ఒమర్‌
14. ఆర్‌ఎల్‌డీ: మిరాజుద్దీన్‌ అహ్మద్‌
15.జీవీఎం (ప్రజాతాంత్రిక్‌): అశోక్‌కుమార్‌సింగ్‌
16. ఎల్‌జేడీ: జావేద్‌ రజ్వా
17. నేషనల్‌ కాన్ఫరెన్స్‌: దేవేంద్రసింగ్‌ రాణా
18. నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌: కేజీ కెన్యె
19. హిందుస్థానీ ఆవామీమోర్చా: రజ్‌నీష్‌
20. సీపీఐఎంఎల్‌: అశోక్‌ఝా
21 ఎన్‌పీఎఫ్‌: నరేష్‌రాం
22. జేకేఎన్‌పీపీ: భీంసింగ్‌

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.