close
పోటాపోటీ భేటీలు

ఫలితాలకు ముందే పార్టీల హడావుడి
భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు
ఓట్ల లెక్కింపునకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో అధికార, ప్రతిపక్షాలు

పోటాపోటీగా మంగళవారం సమావేశాలు నిర్వహించాయి. కేంద్రమంత్రులు, మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలపడానికంటూభాజపా విందు  ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వాన జరిగిన ఈ సమావేశానికి 36 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎగ్జిట్‌పోల్స్‌లో భాజపానే విజయం వరిస్తుందని వెల్లడైన నేపథ్యంలో మరో మూడు పార్టీలు శుభాకాంక్షలు చెబుతూ లేఖలు రాశాయని సమాచారం. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయని.. అప్పటికి మనదేశాన్ని ‘‘దృఢమైన, అభివృద్ధి చెందిన, సంక్షేమ, సమగ్రాభివృద్ధి చెందిన దేశం’’గా చేయాలని ఎన్డీయే ప్రతిన బూనింది. మరోవైపు  రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీఆజాద్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌ల నేతృత్వంలో 22 రాజకీయపార్టీలు దిల్లీలో సమావేశమై  భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలని నిర్ణయించాయి.


 

సుదృఢ భారతం ఎన్డీయే లక్ష్యం
2022 నాటికి  దేశాన్ని సుసంపన్నం చేయాలని ఎన్డీయే పక్షాల భేటీలో తీర్మానం
ప్రధానిని సత్కరించిన కూటమి నేతలు

ఇప్పటివరకు నేను ఎన్నో ఎన్నికల్లో ప్రచారం చేశా.. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారం మాత్రం ఒక తీర్థయాత్రను తలపించింది. ప్రత్యర్థులతో భాజపా ఒక్కటే కాదు. ప్రజలు కూడా పోరాడారు.

- ప్రధాని నరేంద్ర మోదీ


దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికలు దేశానికి దిశానిర్దేశం చేశాయని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే పక్షనేతలు అభిప్రాయపడ్డారు. 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయని.. అప్పటికి దేశాన్ని సుదృఢంగా, సుసంపన్నంగా, అభివృద్ధి చెందినదిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇదే తమ ముందున్న లక్ష్యమని మంగళవారం రాత్రి భాజపా నేతృత్వంలో జరిగిన ఎన్డీయే పక్ష నేతల భేటీలో తీర్మానించారు. లోక్‌జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా మిగిలిన నేతలంతా ఆమోదించారు.
సమావేశం అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కూటమిలోని 36 భాగస్వామ్య పార్టీలు ఈ భేటీకి హాజరయ్యాయని ఆయన తెలిపారు. ‘కులాలకు అతీతంగా, పేదరికమే ప్రాతిపదికగా అభివృద్ధి సాగాలని మోదీ నొక్కిచెప్పారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. మరోవైపు బెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింస పట్ల ఎన్డీయే నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

దేశభద్రతలో మా ముద్ర
ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ఎన్డీయే ప్రభుత్వం విజయవంతమైందని రాజ్‌నాథ్‌ అన్నారు. జాతీయ భద్రత విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా తమదైన ముద్ర వేశామని చెప్పారు. 2019 ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే సునామీ సృష్టిస్తుందని ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాసవాన్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఉత్సాహంగా నేతలు
ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఊపుమీదున్న భాజపా మంగళవారం రాత్రి కూటమి భాగస్వామ్య పక్షాలకు ఇచ్చిన విందు సందడిగా సాగింది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహించిన ఈ భేటీకి బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నీతీశ్‌కుమార్‌, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, అప్నాదళ్‌ నుంచి అనుప్రియా పటేల్‌ సహా ఎన్డీయే పక్ష నేతలంతా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడతాయనగా ఎన్డీయే పక్ష నేతలంతా హాజరవడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీయేదే మళ్లీ అధికారమని ఎగ్జిట్‌ పోల్సన్నీ చెప్పిన నేపథ్యంలో కూటమి నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సమావేశానికి వచ్చిన నేతలంతా ఒక్కొక్కరుగా వచ్చి ప్రధాని మోదీకి శాలువాలు కప్పి ఆయనను అభినందించారు. అనంతరం వారంతా వేదికపై మోదీ సరసన కూర్చున్నారు. ప్రధానికి ఒక వైపు ఎన్డీయే నేతల్లో సీనియర్‌ అయిన ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, రెండో వైపున భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఆశీనులయ్యారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల ప్రచారం ఓ తీర్థయాత్ర

దిల్లీ:ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఒక తీర్థయాత్రను తలపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అందువల్ల ఇప్పటి వరకు తాను చూసిన ఎన్నికలన్నింటిలోనూ ఇదే ప్రత్యేకమైనదని ప్రధాని వ్యాఖ్యానించారు. భాజపా కీలక నేతలు, మంత్రులతో మంగళవారం జరిగిన సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన మంత్రివర్గ సహచరుడు నరేంద్రసింగ్‌ తోమర్‌ విలేకరులతో చెప్పారు. మంత్రులంతా చాలా బాగా పనిచేశారని ప్రధాని ప్రశంసించారన్నారు. దేశానికి చేసిన సేవలకు గాను మంత్రులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు భాజపా పేర్కొంది.

మరొక్కమారు.. మోదీ నేతృత్వంలో
‘ఐదేళ్లపాటు ఎన్నో ఘన విజయాలు సాధించిన మోదీ సర్కారుకు నా కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి ప్రధాని మోదీ నాయకత్వంలో నవ భారతాన్ని నిర్మించాలి’ అని అమిత్‌షా ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.