close
ఒక్క ఓటమి.. ఎన్నో కారణాలు

తెదేపా చరిత్రలోనే ఘోరమైన పరాజయం
గట్టెక్కించలేకపోయిన సంక్షేమ పథకాలు
ఈనాడు-అమరావతి

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా తెలుగుదేశం పరాజయానికి ఎన్నో  కారణాలు కనిపిస్తున్నాయి. పరిపాలనలో వైఫల్యాల కన్నా రాజకీయంగా చేసిన తప్పిదాలు,  వివిధ వర్గాల్ని దూరం చేసుకోవటంతో ఇంతటి దారుణ పరాభవం మూటగట్టుకుందన్న భావన కనిపిస్తోంది. భారీగా అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న నమ్మకం నిలవలేదు. తెదేపా తీసుకున్న నినాదాలేవీ ప్రజల్ని ఆకర్షించలేకపోయాయి. ఈ ఓటమి కొనితెచ్చు  కున్నదేనని తెదేపాలో ముఖ్యనాయకుడొకరు చేసిన వ్యాఖ్య పరిస్థితికి అద్దం పడుతుంది. తెదేపా చరిత్రలోనే భారీ పరాజయంగా ఇది మిగిలిపోనుంది.

గత అయిదేళ్లలో తెదేపా దాదాపు 107 కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు వంటివి విపరీతమైన ప్రజాదరణ పొందాయని భావించారు. దాదాపు 95లక్షల మంది డ్వాక్రా మహిళలు, సుమారు 55లక్షల మందికి ఇస్తున్న పింఛన్‌ లబ్ధిదారులు తమకు అండగా ఉన్నారు.. సులువుగా విజయం సాధించొచ్చని అనుకున్నారు. మహిళా పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదవ్వడం కలిసి వస్తుందని నమ్మినా వమ్ము అయింది. తొలుత డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. తర్వాత దాన్ని పెట్టుబడి నిధిగా మార్చి.. చివరికి పసుపు-కుంకుమగా తెదేపా అమలు చేసింది. రూ.200 నుంచి రూ.2,000కు పింఛన్లు పెంచి ఇస్తున్నా ఆశించిన ప్రభావం చూపలేదు.

మూడుసార్లు వైఎస్‌ కుటుంబీకులే..!
తెదేపా అధినేతగా బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ మూడుసార్లు ఓటమిని చవిచూడగా.. ప్రత్యర్థులుగా వైఎస్‌ కుటుంబసభ్యులే ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో   వైఎస్‌ రాజశేఖరరెడ్డి .. ఈ ఎన్నికల్లో జగన్‌ ప్రత్యర్థులుగా ఉన్నారు.

కొంపముంచిన వలసలు
వైకాపా నుంచి 24 మంది ఎమ్మెల్యేల్ని చేర్చుకోవటం ఎన్నో చోట్ల బెడిసికొట్టింది. ఆయా స్థానాల్లో స్థానిక తెదేపా యంత్రాంగంతో వారు సర్దుబాటు కాలేకపోయారు. చివరికి జమ్మలమడుగులో రెండు బలమైన వర్గాల్ని కలపటానికి చంద్రబాబు కొన్ని నెలలపాటు కష్టపడినా.. ఎన్నికల సమయంలో ఇరువురి మధ్య సఖ్యత కొరవడింది.

సిటింగులపై వ్యతిరేకత
పదేళ్ల తర్వాత అధికారంలోకి రావటంతో చాలాచోట్ల ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరించారు. ఇసుక తవ్వకాలు, బదిలీలు, కాంట్రాక్టుల్లో జోక్యం మితిమీరింది. ఎనిమిది మంది వారసులు కాకుండానే  98 మంది సిటింగ్‌లకు టికెట్లు ఇవ్వడం బెడిసికొట్టింది. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలపైన ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.

ప్రతివ్యూహం.. నామమాత్రం
ఎన్నికల్లో విజయానికి వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్‌ను వైకాపా నియమించుకుని పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయన వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించటంలో తెదేపా దారుణంగా విఫలమైంది. గ్రూప్‌ ‘ఎం’ని నియమించుకున్నా ప్రయోజనం లేకపోయింది. వైకాపాకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో దాదాపు 250 మేర ఛానళ్లు, గ్రూపులు, వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని తెదేపా గుర్తించినా.. తిప్పికొట్టలేకపోయింది. సీఎం తీరిక లేకుండా ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలూ క్షేత్రస్థాయి స్థితిగతులు చెప్పడానికి జంకేవారు. ఎన్నికల్లో తెరవెనుక పనిచేసే బ్యాక్‌ ఆఫీస్‌ ఎంతో ముఖ్యమైంది. ఈ విడత అది సరిగా వ్యవహరించలేకపోయింది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వగా.. ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తన స్థానంపై దృష్టిపెట్టారు. బ్యాక్‌ ఆఫీస్‌ అంత చురుగ్గా వ్యవహరించలేకపోయింది. మొత్తంగా ఐదేళ్ల కాలమంతా హడావిడిగా సాగడంతో లోటుపాట్లు గుర్తించి, అధిగమించేలా కృషి చేయకపోవటం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని సీనియర్‌ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.

కంచుకోటల్ని కాపాడుకోలేకపోవటం
తెదేపాకు చిరకాలంగా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్ని ఈసారి కాపాడుకోలేకపోయింది. గతంలో చేజారిన వాటిని తిరిగి దక్కించుకోలేకపోయింది. ఉత్తరాంధ్ర తెదేపాకు కంచుకోట. విశాఖ నగరం మినహా ఎక్కడా ప్రభావం లేదు. విజయనగరం జిల్లాలో మృణాళిని తొలగించాక బీసీలకు అవకాశమివ్వలేదు.

ప్రత్యేక హోదా.. ప్యాకేజీ
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వగా.. దాన్ని సమర్థించాల్సిన పరిస్థితి తెదేపాకు ఏర్పడింది. అదీ అమల్లోకి రాకపోవటంతో కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకోవడం ఇబ్బందిగా మారింది. భాజపాపై ఎదురుదాడికి ప్రయత్నించినా సాధ్యంకాలేదు.

ఆర్థిక వనరుల కొరత!
గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఆర్థిక వనరులు గణనీయ ప్రభావం చూపుతున్నాయి. తెదేపాకు వనరులు అందకుండా చూడటంలో ప్రత్యర్థులు సఫలమయ్యారు. కనీసం 50చోట్ల పార్టీ విజయావకాశాలపై ఇది ప్రభావం చూపినట్లు తెదేపా అంచనా.

యువతకు చేరువకాకపోవడం
గత ఐదేళ్లలో యువతను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినా ఆఖరి ఏడాదిలోనే అమలు చేసింది. చెప్పుకోదగ్గస్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారు.

రాజధాని.. పోలవరం.. ప్రభావం ఏమాత్రం
చెన్నై, హైదరాబాద్‌ను వదిలి వచ్చిన ఆంధ్రులకు సొంత రాజధాని నిర్మాణం పెద్ద కల. దానిని సాకారం చేసే దిశగా కృషి చేసినా ప్రజలకు చేరలేదు. రాజధాని ఉన్న మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓడిపోయింది. ప్రణాళికల్లో కాలమంతా గడచిపోయి కీలక నిర్మాణాలు పూర్తి కాలేదు. పోలవరం, పట్టిసీమ, రాయలసీమకు నీరివ్వడం పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.


ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత

ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేసింది. ఇళ్లస్థలాలిచ్చింది. కొత్త నివేదిక రాకపోవడంతో 20శాతం ఐఆర్‌ ప్రకటించింది. ఉద్యోగ సంఘాలు చెప్పిందే తడవుగా పనులు పరిష్కారం కావడంతోపాటు వివిధ సమస్యలకు సంబంధించి 30కిపైగా జీవోలిచ్చింది. పదవీ విరమణ వయసును 60ఏళ్లకు పెంచారు. అయినా ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. బయోమెట్రిక్‌ ఆధారంగా జీతాలివ్వాలనే ప్రతిపాదన, పనితీరు ఆధారంగా ఉద్యోగంలో కొనసాగింపు వంటి యోచన అలజడికి కారణమైంది. వీటిని అమలు చేయమని చెప్పినా భయాందోళన తొలగలేదు. అలాగే పరిపాలన అంటే సమీక్షలే అన్నట్లుగా మారింది. స్వయంగా చంద్రబాబు రోజంతా తీరిక లేకుండా సమీక్షించటం, అన్ని స్థాయిల్లోనూ ఇదే విధానం కొనసాగటం.. యంత్రాంగంలో నిరాసక్తతకు దారితీసింది. కలెక్టర్లతో సమావేశాలంటే రెండేసి రోజులు రాత్రి పొద్దుపోయే వరకు సమీక్షించటం యంత్రాంగానికి విసుగు పుట్టించింది.


ఓటు బ్యాంకు దూరం

గత ఎన్నికల్లో తెదేపాకు అన్ని వర్గాల మద్దతు లభించింది. ముఖ్యంగా బీసీలు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ ఐదేళ్లలో కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ పెట్టి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించటం, రిజర్వేషన్లు వచ్చేలా చూడటం వంటి చర్యలు తీసుకున్నారు. జనసేనతో పొత్తు లేకుండా విడిగా పోటీచేయటంతో కాపు ఓట్లు చీలిపోవడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక, యువత ఓట్లు వైకాపాకు వెళ్లవని భావించినా నిజం కాలేదు. కాపు వర్గానికి ప్రాధాన్యమివ్వటం బీసీల్లో అసంతృప్తిని రాజేసింది. వీరిద్దర్ని బుజ్జగించడంలో తెదేపా విఫలమైందన్న వాదన వినిపిస్తోంది. పథకాలతోపాటు పార్టీ టికెట్ల కేటాయింపులోనూ బీసీలకు న్యాయం చేసినట్లు కనిపించలేదు. రాయలసీమలో ఎనిమిది ఎంపీ స్థానాలుంటే మూడుచోట్ల వైకాపా బీసీలకు టికెట్లు ఇవ్వగా తెదేపా ఒక్కటే ఇచ్చింది. వైకాపాకు చెక్‌పెట్టాలన్న ఉద్దేశంతో ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వర్గానికి తెదేపా నాలుగు స్థానాలు కేటాయించడమూ బెడిసికొట్టింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.