close
జగన్‌ సమ్మోహన విజయం

ఏపీలో వైకాపా ప్రభంజనం
   అసెంబ్లీ.. లోక్‌సభ ఎన్నికల్లో  తిరుగులేని గెలుపు
   తెదేపా ఘోర పరాజయం
   మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు,  ఉద్దండులకు తప్పని పరాభవం
   రెండింటా ఓడిపోయిన పవన్‌.. జనసేనకు ఒక్కటే

3600 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాల్ని చూశా. వారి బాధలు విన్నా. వారందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. నాపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాల్ని నిలబెట్టుకుంటా. ఆరు నెలల నుంచి ఏడాది  వ్యవధిలో పాలనంటే ఏమిటో.. గొప్ప పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తా.

- వైఎస్‌ జగన్‌

 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రతో మొదలైన ఓట్ల సునామీ కోస్తాంధ్ర మీదుగా రాయలసీమదాకా ఉప్పొంగి వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ విజయాన్ని అందించింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైకాపా సాధించిన విజయం అధికార తెదేపాను నివ్వెరపరిచింది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు స్థానాల్లోని తెదేపా కంచుకోటలు బద్దలయ్యాయి. ముగ్గురు మినహా తెదేపా మంత్రులంతా కొట్టుకుపోయారు. 4 జిల్లాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండాపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెట్టని కోట అయిన కుప్పంలో మెజారిటీ గణనీయంగా తగ్గింది. నవరత్నాల హామీలు జగన్‌కు అధికార పంచామృతాన్ని అందించాయి. పులివెందులలో అప్రతిహత విజయం ఆయనకు సొంతమైంది. చంద్రబాబు నమ్ముకున్న పోలవరం, రాజధాని తెదేపాను గట్టెక్కించలేకపోయాయి. ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై విముఖత, పార్టీ వ్యూహాల్లో వెనుకబాటు వంటి అంశాలు అధికార తెదేపాను ఓటమి బాట పట్టించాయి.

పక్కా ప్రణాళిక, పాదయాత్ర, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకపోవడం, ఎప్పటి నుంచో తెదేపాకు అండగా ఉన్న బీసీల ఓట్లు చీలడం.. వంటివి ప్రతిపక్ష వైకాపాకు కలిసివచ్చాయి. ఆ పార్టీని విజయపథంలో నడిపాయి. ఇక ఎన్నో అంచనాలతో, వామపక్షాల అండతో బరిలోకి దిగిన జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ పోటీచేసిన 2 చోట్లా పరాజయం పాలయ్యారు. ఆ పార్టీ ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

జగన్‌కు ప్రధాని మోదీ అభినందనలు
ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి ప్రధాని మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

30న విజయవాడలో ప్రమాణ స్వీకారం
వైకాపా శాసనసభాపక్షం భేటీ శుక్రవారం నిర్వహించనున్నారు. పార్టీ శాసనసభా పక్షనేతగా జగన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం ఈ నెల 30న ఏపీ నూతన సీఎంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.40 -12.00 గంటల మధ్య ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది.

అన్ని చోట్లా విజయఢంకా
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైకాపా అసాధారణ విజయం సొంతం చేసుకుంది.  శాసనసభ ఎన్నికల్లో వైకాపా ఏకంగా 150 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుంది. విజయవాడ సెంట్రల్‌లో చివరి సమాచారం అందేవరకు వైకాపా ఆధిక్యంలో ఉంది. 25 లోక్‌సభ స్థానాలకుగాను 21 ఆ పార్టీ వశమయ్యాయి. విశాఖ లోక్‌సభలో ఆధిక్యంలో కొనసాగుతోంది. లోక్‌సభ స్థానాలలో శ్రీకాకుళం, విజయవాడను తెదేపా గెలుచుకుంది. తెదేపా ఆధిక్యంలో ఉన్న గుంటూరులో ఫలితాన్ని పెండింగ్‌లో ఉంచారు. మొత్తంగా వైకాపా ఓట్ల వరదలో అధికారపక్షం తెదేపా కొట్టుకుపోయింది. ఆ పార్టీ కేవలం 21 శాసనసభ స్థానాలకే పరిమితమైంది. మరో రెండింట ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర శాసనసభలో 175 స్థానాలుండగా.. తెదేపా కేవలం ఏడో వంతు సీట్లు మాత్రమే గెలుచుకుంది. జనసేన ఒక సీటు గెలుచుకోగా మిగతా అన్ని సీట్లూ వైకాపా ఖాతాలోనే చేరాయి. 21 మంది మంత్రులు పోటీ చేయగా ఇద్దరు గెలిచారు. మరొకరు ఆధిక్యంలో ఉన్నారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌లకూ ఓటమి తప్పలేదు. 25 మంది మంత్రులకుగాను 19 మంది శాసనసభకు, ఇద్దరు లోక్‌సభకు పోటీ చేయగా అచ్చెన్నాయుడు, చినరాజప్ప  గెలిచారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓట్ల లెక్కింపును గురువారం రాత్రి నిలిపేశారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు, వీవీప్యాట్ల స్లిప్పుల్లో తేడా వచ్చినందున విషయాన్ని స్థానిక ఎన్నికల అధికారులు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లోక్‌సభకు పోటీ చేసిన మంత్రులు శిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డి ఓడిపోయారు.

లోకేశ్‌ ఓటమి
మంగళగిరిలో తెదేపా ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ పరాజయం పాలయ్యారు. కుప్పంలో తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు 30,400 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచి.. తర్వాత తెదేపాలో చేరి ఈ ఎన్నికల్లో పోటీ చేసినవారిలో గొట్టిపాటి రవికుమార్‌ మాత్రమే అద్దంకిలో గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లోనూ చాలా మందికి ఓటమి తప్పలేదు. పార్టీ సీనియర్‌ నాయకుల వారసులుగా రంగంలోకి దిగిన వారిదీ అదే పరిస్థితి. జనసేనకు ఈ ఫలితాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఆ పార్టీ ఒకే స్థానం గెలుచుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భీమవరం, గాజువాక రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. విశాఖలో ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి, సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. జనసేన మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకూ ఘోర పరాభవమే మిగిలింది. కాంగ్రెస్‌, భాజపా ఎక్కడా బోణీ చేయలేదు సరి కదా, ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు దక్కలేదు. కె.ఎ.పాల్‌ ప్రజాశాంతి పార్టీ సోదిలోకి కూడా కనిపించలేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తెదేపా ఘోరంగా దెబ్బతింది.

ఆది నుంచీ అన్ని చోట్లా ఆధిపత్యమే
గురువారం ఉదయం ఎనిమిదింటికి ఓట్ల లెక్కింపు మొదలయ్యాక పోస్టల్‌ బ్యాలెట్‌తోనే వైకాపా విజయయాత్ర మొదలైంది. తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికే ఆ పార్టీ ఘనవిజయం సాధించనుందన్న సంకేతాలు వెలువడ్డాయి. మరో రెండు మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి వైకాపా విజయం ఖాయమైంది. చివరి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసేంత వరకు ప్రతి దశలోనూ అప్రతిహతంగా దూసుకుపోయింది. వైకాపా అధ్యక్షుడు జగన్‌ పులివెందులలో 89,700 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. జగన్‌ సొంత జిల్లా కడపతో పాటు, విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వైకాపా అన్ని స్థానాలూ ఊడ్చేసింది. ఒకప్పుడు తెదేపాకు కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ముఖ్యంగా వైకాపాకు పట్టున్న రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీకి ఓట్ల వర్షమే కురిసింది. సీమ నాలుగు జిల్లాలలో తెదేపాకు రెండు సీట్లే దక్కాయి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెదేపా ఒకే ఒక్క సీటు కుప్పంను దక్కించుకుంది. కడప, కర్నూలు జిల్లాల్లో ఒక్క సీటూ దక్కలేదు. అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు బాలకృష్ణ మరోసారి గెలిచారు. గురువారం అర్ధరాత్రి వరకు ఉరవకొండలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకుగాను వైకాపా 28 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలూ వైకాపా వశమయ్యాయి. శ్రీకాకుళంలో తెలుగుదేశానికి రెండు స్థానాలు దక్కాయి. విశాఖ జిల్లాలో మాత్రం తెదేపా కాస్త పరువు నిలబెట్టుకోగలిగింది. అక్కడ ఆ పార్టీకి 4 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఈసారి వైకాపా విజయకేతనం ఎగురవేసింది. ఈ రెండు జిల్లాలకు కలిపి తెదేపాకు ఆరు, జనసేనకు ఒకటి మాత్రమే దక్కాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోను ఈసారి వైకాపా తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. రెండు జిల్లాల్లో 4 స్థానాలే తెదేపాకు దక్కాయి. అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ వైకాపా గాలి బలంగా వీచింది. ప్రకాశం జిల్లాలో తెదేపా 4 సీట్లు గెలుచుకోగా, నెల్లూరులో మొత్తం
తుడిచిపెట్టుకుపోయింది.


మోదీ, జగన్‌లకు కేసీఆర్‌, కేటీఆర్‌ల అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: భారత ప్రజలు నిర్ణయాత్మక ఫలితాలను వెలువరించారని, లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సంపూర్ణ విజయం సాధించిందని పేర్కొంటూ.. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అద్భుత విజయం సాధించిందని కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.

వైకాపా చరిత్రాత్మక విజయం
ఏపీ ఎన్నికల్లో వైకాపా చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని పేర్కొంటూ.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. వైకాపా అధినేత జగన్‌కు అభినందనలు తెలిపారు. జగన్‌ కష్టానికి ప్రజల దీవెనల రూపంలో మంచి ఫలితం లభించిందని చెప్పారు. సోదర రాష్ట్రంలో పరిపాలనలో అన్ని విధాలా మంచి జరగాలని ఆకాంక్షించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.