close
ఎన్నికల నియమావళి ముగియగానే రుణమాఫీ

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే రాష్ట్రంలో రైతు రుణమాఫీని ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ఆవరణలో ‘విత్తనమేళా-2019’ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విత్తనమేళాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ హయాంలో 3 సంవత్సరాలకే ప్రాజెక్టులలో నీళ్లు చూస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొంటున్నట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. యువత వ్యవసాయంవైపు ఆకర్షితులయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఒకటి రెండు పంటలకే పరిమితం కాకుండా మార్కెట్‌ పరిస్థితిని బట్టి రైతులు ఎక్కువ రకాలను పండించేలా మారాలని సూచించారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులను పండించేలా తెలంగాణ రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వారి వివరాలు సేకరించాలని వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావుకు సూచించారు. ఈ సందర్భంగా మేళాలోని వివిధ విత్తన స్టాళ్లను ఆయన సందర్శించారు. అనంతరం పలువురు రైతులకు విత్తనాలు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌బొజ్జా, విశ్వవిద్యాలయం సంచాలకులు డాక్టర్‌ జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపకులపతి పదవీకాలం పొడిగింపు..
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు పదవీ కాలాన్ని మరో మూడు సంవత్సరాలపాటు పొడిగిస్తున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఉపకులపతి పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెచ్చుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఆయన పదవీకాలం జులైలో ముగియనున్నప్పటికీ వ్యవసాయ సీజన్‌, పనితీరును దృష్టిలో పెట్టుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌రావు మాట్లాడుతూ..త్వరలో వరి, మొక్కజొన్న, అపరాలలో మరో ఎనిమిది కొత్త వంగడాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.