close
లోడ్‌ పెరిగితే డబ్బు కట్టాల్సిందే

కనెక్షన్లవారీగా విద్యుత్‌ వినియోగదారులకు తాఖీదులు
ఏడాది సగటు వాడకం ఆధారంగా ‘డిస్కం’ల ఎస్‌ఎంఎస్‌లు

ఈనాడు- హైదరాబాద్‌: విద్యుత్‌ వాడకం అధికంగా ఉండే ఇళ్లల్లో కనెక్షన్‌కు తొలుత తీసుకున్న లోడ్‌ (భారం)కన్నా ఇప్పుడు అధికంగా ఉంటే.. అదనపు డిపాజిట్‌ సొమ్ము కట్టాల్సిందేనని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌- డిస్కం) తాఖీదులిస్తోంది. గత 12 నెలలు(ఏడాది)గా ఇంట్లో వాడిన కరెంట్‌ యూనిట్ల లెక్కనుబట్టి, ఎంత లోడ్‌ పడుతుందో లెక్కించి ఆ సమాచారమంతా వివరిస్తోంది. అదనపు లోడ్‌కు తక్షణం డిపాజిట్‌ సొమ్ము చెల్లించితీరాలని సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌) ద్వారా తేల్చిచెబుతోంది. ఒకవేళ కట్టకపోతే కఠినచర్యలుంటాయని డిస్కం వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం ఇళ్లకు 3 లేదా 5 కిలోవాట్ల లోడ్‌తో తొలుత విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవడం సర్వసాధారణం. ఎన్నో ఏళ్ల క్రితం కనెక్షన్‌ తీసుకున్నవారి ఇళ్లకు సంబంధించి అధికంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతోనే ఉన్నాయి.కాలక్రమంలో టీవీ, ఫ్రిజ్‌, ఎయిర్‌కూలర్‌, వాషింగ్‌మెషీన్‌ వంటి గృహోపకరణాల వాడకం బాగా పెరుగుతోంది. వీటి సంఖ్య పెరిగేకొద్దీ కరెంట్‌ లోడ్‌ సామర్థ్యం అధికమవుతోంది. అదనంగా పెరిగే కరెంట్‌ లోడ్‌కు డిపాజిట్‌ వివరం చాలామందికి తెలియడం లేదు. నెలవారీ వాడిన కరెంటుకు యూనిట్ల ప్రకారం బిల్లు కడుతున్నాం కదా, మళ్లీ ఈ డిపాజిట్‌ ఎందుకని అనుకుంటున్నారు. కానీ కనెక్షన్‌ తీసుకునేటప్పుడే ఎన్ని కిలోవాట్ల విద్యుత్‌ కావాలన్న లెక్క ఆధారంగా..లోడ్‌ ప్రకారం డిస్కంకు డిపాజిట్‌ చెల్లించాలి. మొదట కనెక్షన్‌ సమయంలో అప్పటికి ఇంట్లో ఉండే తక్కువ గృహోపకరణాల ప్రకారమే లోడ్‌ అంటున్నారు. ఇంటి అవసరాలు, సదుపాయాలు పెరిగేకొద్దీ భారం అధికమవుతోందన్నది  గ్రహించడం లేదు.

నిబంధనల ప్రకారం.. కిలోవాట్‌ భారానికి రూ.1200 వంతున డిపాజిట్‌, దానిపై అదనంగా 18 శాతం జీఎస్టీ, మరో రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టాలి. వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి ఇంటి ప్రస్తుత లోడ్‌ ప్రకారం అదనపు సొమ్ము చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎస్పీడీసీఎల్‌ పేర్కొంటోంది. ఉత్తర తెలంగాణ డిస్కంలో ఈ 50 శాతం రాయితీ అంటూ ఏదీ లేదు. అక్కడి విద్యుత్‌ సిబ్బంది అదనపు లోడ్‌ ఉన్న కనెక్షన్లను గుర్తించి నేరుగా మొత్తం సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. తెలంగాణలోని మొత్తం 1.30 కోట్లలో 70 లక్షల గృహసంబంధ కనెక్షన్లు ఎస్పీడీసీఎల్‌లోనే ఉన్నాయి. వీటిలో 44 లక్షలు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనివి. దీనిలో 30 లక్షల కనెక్షన్లు నగర శివారు కాలనీల్లో ఉంటున్నాయి. గతంలో వీటిల్లో ఎక్కువగా 3 కిలోవాట్లతోనే తీసుకున్నారు. ప్రస్తుతం చాలావరకు 6 నుంచి 8 కిలోవాట్ల దాకా వాడుతున్నారు. నగరంలోనూ 5 కిలోవాట్లతో మునుపు గృహాల్లో తీసుకున్నవాటికి ఇప్పుడు 8 నుంచి 10 వరకు వినియోగిస్తున్నారు. రికార్డుల ప్రకారం కనెక్షన్లకు ఉన్న లోడ్‌ ఆధారంగానే ఇదివరకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేశారు.అదనపు లోడ్‌ ఫలితంగానే అవి తరచూ అధిక భారంతో కాలిపోవడం లేదా ట్రిప్‌ అవుతున్నాయి. సాంకేతిక సమస్యలతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. రికార్డుల్లో ఉన్న కనెక్షన్ల వివరాలకన్నా ఆయా ప్రాంతాల ఇళ్లల్లో కరెంటు వాడకం లోడ్‌ అధికంగా ఉన్నట్లు గ్రహించారు. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లపై లోడ్‌ పెరిగి కాలిపోతుండటం గమనార్హం. లక్షల్లో కనెక్షన్లు ఉండగా, సంస్థకు వినియోగదారుల చెల్లింపులు ఇప్పటికి నాలుగు వేలకే పరిమితమయ్యాయని, అవి వేగవంతమైతేనే సమస్యలన్నీ తీరతాయని అధికారవర్గాలు స్పష్టంచేస్తున్నాయి.

ముందుగా ప్రతి ఇంటిలోనూ వాస్తవంగా వాడుతున్న లోడ్‌ ఎంతనేది రికార్డుల్లో పక్కాగా నమోదు కావాలి. అది జరగాలంటే, లోడ్‌ ప్రకారమే వాడకందారులు డిపాజిట్‌ చెల్లించాలి. ఆ సొమ్ము కట్టకపోతే, సంబంధిత కనెక్షన్‌కు అదనపు లోడ్‌ నమోదు కంప్యూటర్‌లో సాధ్యం కాదు. అప్పుడు అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌, లైన్‌ సామర్థ్యం పెంచడం కుదరదు. ఇవన్నీ తీరాలంటే, వినియోగదారులే వచ్చి డిపాజిట్‌ కట్టేలా 50 శాతం రాయితీ  పథకం అమలుచేస్తున్నామని దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. త్వరలోనే ఉత్తర తెలంగాణలోనూ ఇటువంటి పథకం అమలుకు యోచిస్తున్నామని ఉత్తర డిస్కం సీఎండీ గోపాలరావు ‘ఈనాడు’కు చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.