close
రాహుల్‌ రాజీనామా?

నేటి సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పలువురు నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రాహుల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆయన కేరళలోని వయనాడ్‌లో గెలిచినా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో ఓటమిపాలయ్యారు. మోదీ నాయకత్వంలోని భాజపా చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోవడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన ఫతేపుర్‌ సిక్రీ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి రాజ్‌కుమార్‌ ఛహర్‌ చేతిలో 4,95,065 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ కూడా పదవికి రాజీనామా చేశారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఓటమిపై కారణాలు అన్వేషించడానికి సీనియర్‌ నేత నృసింగ మిశ్ర ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కర్ణాటకలో ప్రచార బాధ్యతలు చూసిన హెచ్‌.కె.పాటిల్‌ కూడా రాజీనామా పత్రాన్ని పంపినట్టు తెలిపింది.

ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్‌ విఫలం: ఎంపీ గౌరవ్‌గొగొయి
దిస్‌పుర్‌: ఎన్నికల్లో దారుణ వైఫల్యానికి గల కారణాలపై పోస్టుమార్టానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయి తనయుడు, కలియోబోర్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికైన గౌరవ్‌గొగొయి.. భాజపా ఛరిష్మాను తట్టుకుని ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌ పరువు కాపాడారు. ‘‘ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందనడంలో సందేహం లేదు. రెండోసారి కూడా భాజపానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు విస్పష్టమైన తీర్పు చెప్పారు. భాజపాకు హ్యాట్సాఫ్‌.. శుభాకాంక్షలు’’ అని గౌరవ్‌ వ్యాఖ్యానించారు.


 

సగం రాష్ట్రాల్లో శూన్యహస్తం

కేంద్రంలో అధికారంలోకి రావాలని కలలుగన్న కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకటి రెండూ కాదు ఏకంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పార్టీకి శూన్య హస్తమే మిగిలింది. అరుణాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, దాదర్‌ నగర్‌ హవేలీ, దమన్‌-దయ్యు, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, మణిపుర్‌, మిజోరం, నాగాలాండ్‌, దిల్లీ, రాజస్థాన్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ల్లో కాంగ్రెస్‌కు ఒక్కసీటూ దక్కలేదు. మరోవైపు భాజపా 17 రాష్ట్రాల్లో ఏకంగా 50 శాతం ఓట్లు పొందడం విశేషం.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.